
తాజా వార్తలు
గర్భవతి అనుష్క శీర్షాసనం.. కోహ్లీ సాయం
ముంబయి: బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా కుదుర్చుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెటర్నటీ బ్రేక్‌కు ముందే వీలైనంత వరకు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇటువంటి సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి కసరత్తులు చేస్తున్నారు. ప్రియమైన భర్త విరాట్ కోహ్లీ ఆమెకు అండగా ఉండి, ముందుకు నడిపిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికి శీర్షాసనం వేసిన ఫొటోను అనుష్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోడ ఆధారంగా ఆమె తలకిందులుగా నిల్చోగా.. కోహ్లీ ముందు జాగ్రత్తగా కాళ్లు పట్టుకుని, బ్యాలెన్స్ చేశారు.
‘చేతులు కిందికి పెట్టి.. కాళ్లు పైకి ఎత్తే అతి కష్టమైన వ్యాయామం. ఇది పాత ఫొటో. యోగా నా జీవనశైలిలో ఓ భాగమైపోయింది. గర్భవతిగా ఓ స్థాయి వరకు.. గతంలో రోజూ వేసే ఆసనాలు చేయొచ్చని వైద్యులు సూచించారు. సపోర్ట్ తీసుకుని ఇలాంటి ఆసనాలు వేయమని సలహా ఇచ్చారు. శీర్షాసనాన్ని ఎన్నో ఏళ్ల నుంచి వేస్తున్నా.. గర్భవతిగా వ్యాయామం చేస్తున్నా కాబట్టి గోడను ఆధారంగా తీసుకున్నా. బ్యాలెన్స్ చేయడానికి, మరింత జాగ్రత్త కోసం సమర్థుడైన నా భర్త సాయం చేశాడు (లవ్ సింబల్). నా యోగా శిక్షకురాలి పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వ్యాయామాన్ని కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని అనుష్క పోస్ట్ చేశారు. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత చిత్రీకరణలో పాల్గొంటానని, నటనలోనే తనకు ఆనందం దొరుకుతుందని ఆమె ఇటీవల మీడియాతో అన్న సంగతి తెలిసిందే.