close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/03/2020 08:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోండి..

ఇంట్లో ఉంటేనే అందరికీ మంచిది

‘కరోనా’పై సినీ తారల హెచ్చరిక

అర్జున్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు రాష్ట్రంలో మరింత వేగంగా వ్యాపిస్తోంది. అయినప్పటికీ ప్రజలు ఆ గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోకుండా చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారని పలువురు తారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాస్త బుద్ధిని ఉపయోగించాల్సిన తరుణమిది అని ఘాటుగా స్పందిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది జనం రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలురకాలుగా అవగాహన కల్పించినప్పటికీ, ప్రపంచ దేశాల్లో జరిగిన విషయాలను మీడియా చాటి చెబుతున్నప్పటికీ కొందరు వ్యక్తుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని పోలీసులు కూడా వాపోతున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు తారలు కూడా అవగాహన కల్పించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సూర్య, త్రిషలతోపాటు పలువురు తమవంతు సూచనలు చేశారు. కానీ మార్పు రాకపోవడంతో ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. తాజాగా నటి వరలక్ష్మి విడుదల చేసిన వీడియోలో ఆమె స్పందిస్తూ.. ‘‘ ఓ గ్రూపు తమకు కరోనా వైరస్‌ సోకదులే అనే ధైర్యంతో బయట విచ్చలవిడిగా తిరుగుతోంది. వారితోనే ప్రధానంగా ఈ వీడియో ద్వారా మాట్లాడదలచుకున్నా. ఈ వ్యాధి ఎవరికైనా వ్యాపిస్తుంది. సుమారు 27 శాతం మంది మాత్రమే ఇళ్లలో ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలినవారు బయట తిరుగుతున్నారు. దీనివల్ల వారితోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రమాదం కలుగుతుంది. ముఖ్యంగా వయసు మీదపడిన ఇరుగుపొరుగు వారికి వ్యాధి సోకే అవకాశముంది. వీలైనంత వరకు ఆ వృద్ధులకు సహకరించండి. ఇక బాడుగ తీసుకునేవారికి నా వేడుకోలు ఇది. ప్రస్తుతం ఎవరికీ జీతాలు లేవు. అందువల్ల పెద్ద మనసు చేసుకుని ఒక నెల బాడుగను అడగకండి. మనది ఇటలీ మాదిరిగా చిన్న దేశం కాదు. దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్నాం. అలా విచ్చలవిడిగా తిరిగితే ఏం జరుగుతుందోనని ఒక్కసారి బుద్ధితో ఆలోచించండి. అందరూ ప్రభుత్వాలకు సహకరించి కరోనాను తరిమికొడుదామని’’ పేర్కొన్నారు.

వరలక్ష్మి

తీవ్రతను తెలుసుకోండి

ఇదేవిధంగా నటుడు శివకార్తికేయన్‌ కూడా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. ‘‘తమ ఆరోగ్యం, తమ కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది మన కోసం శ్రమిస్తున్నారు. వాళ్లందరికీ సెల్యూఫట్‌. మన కోసం, వాళ్ల కోసం.. మనం చేయాల్సిందల్లా ఒకటే. ఇంట్లో ఉండటమే! చాలా అవసరం అనిపిస్తే బయటకు వెళ్దాం. కానీ చాలా మందికి పరిస్థితి అర్థం కావడంలేదు. సీరియస్‌నెస్‌ తెలుసుకుని వ్యవహరించాలి. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండి మిగిలినవారికి సహకరించండని’’ కోరారు.

రిత్విక

అర్థం చేసుకోకపోతే ఎలా?

నటి రిత్విక స్పందిస్తూ.. ‘‘నాలుగేళ్ల క్రితం చెన్నైలో వరదలు వచ్చాయి. నగరం మొత్తం మునిగిపోయింది. నాలుగురోజులపాటు కరెంటు లేదు. సరిగ్గా తిండి లేదు, నీళ్లు కూడా లేవు. అయినప్పటికీ అందరూ ఇంట్లోనే ఉండిపోయాం. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సినిమాలు చూసుకోవచ్చు, ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంత వినోదం ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువమంది బయటకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండని’’ చెప్పారు.

ఇటలీ దీనావస్థ చూడండి...

అర్జున్‌ విడుదల చేసిన వీడియోలో ఆయన స్పందిస్తూ.. ‘‘ఇది కొత్త విషయానికి సంబంధించి వీడియో కాదు. కరోనాకు సంబంధించినదే. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉండండి. ఇది మీతోపాటు, మీ చుట్టూ ఉన్నవారికి మంచిది. ముఖానికి మాస్క్‌ లేకుండా అస్సలు బయటకు వెళ్లకండి. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కానీ.. ఉదయాన్నే ఇటలీలో ఉన్న నా స్నేహితుడితో మాట్లాడా. ఒక రోజుకు 5 వేల నుంచి 6 వేల మంది కరోనా పాజిటివ్‌గా మారుతున్నారు. వారిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఆలోచించి చూడండి. మన జనభా ఎంతో ఆలోచించండి. అలాంటి పరిస్థితిని రానివ్వకండి. దయచేసి తప్పుగా అనుకోకండి.. మీరు బయటకు వెళ్తున్నారంటే, మీరు ఇంకొకరిని హత్య చేసినట్టే అర్థం. రజనీకాంత్‌, కమల్‌, అజిత్‌, విజయ్‌తోపాటు అందరు హీరోల అభిమానులందరూ కలిసి ఇందుకు పూర్తిగా సహకరించండి. జైహింద్‌!’’ అని ప్రార్థించారు.

మంత్రికి శానిటైజర్‌ను అందజేస్తున్న పార్తిబన్‌

ఐదు లీటర్ల శానిటైజర్‌ అందజేత

తన ఇంటిని ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తే తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన పార్తిబన్‌... బుధవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ను కలిశారు. ‘ఎప్పుడూ పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించే ఆయన్ను, అందుకు బదులుగా ఈ సారి ఐదు లీటర్ల శానిటైజర్‌ ఇచ్చాన’ని పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ కవిత్వాన్ని కూడా శానిటైజర్‌ క్యానుపై రాశారు.

శివ కార్తికేయన్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.