close

తాజా వార్తలు

Published : 23/01/2020 07:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేసీఆర్.. జగన్ లతో పరిచయాలు ఉన్నాయి

● రాజకీయాలు, సినీ ప్రయాణంపై ఉదయనిధి

● ‘సైకో’ను పిల్లలు, గర్భిణులు చూడొద్దని వ్యాఖ్య

‘సైకో’లో ఓ దృశ్యం

కరుణానిధి కుటుంబం నుంచి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు ఉదయనిధి. ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేకత చాటేందుకు బాట వేసుకుంటున్నారు. రజనీకాంత్‌పై పరోక్ష విమర్శలు, పార్టీ శ్రేణులతో చర్చలు, రాజకీయ భవిష్య కార్యాచరణ.. ఇలా బిజీగా మారిపోయారు. మరోవైపు సినిమా కెరీర్‌ను కూడా చాకచక్యంగా కొనసాగిస్తున్నారు. తాజాగా మిష్కిన్‌ దర్శకత్వంలో ‘సైకో’ చిత్రంలో నటించారు. ఇందులో నిత్యామేనన్‌ తదితరులు ప్రధాన తారాగణం. శుక్రవారం ఈ సినిమా తెరపైకి రానుంది. తన రాజకీయ, సినీ విశేషాల గురించి ‘న్యూస్‌టుడే’తో ఆయన ముచ్చటించారు. ఆ వివరాలివీ.. - కోడంబాక్కం, న్యూస్‌టుడే

ప్ర: మిష్కిన్‌ దర్శకత్వంలో నటించడానికి కారణమేంటి?

జ: నాకు బాగా నచ్చిన దర్శకుల్లో మిష్కిన్‌ ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ చూశా. దర్శకత్వ శైలి బాగా ఇష్టం. అదే ‘సైకో’ చిత్రంలో నటించేందుకు పెద్ద కారణం. ఆయనకు కోపం ఎక్కువని అందరూ చెబుతారు. కొన్ని సందర్భాల్లో సెట్‌లో ఆయన్ను అలా చూశా. కానీ తన సహాయ దర్శకులతోనే ఎక్కువగా కోపంగా ఉంటారు. తర్వాత చాలా సహజంగా వ్యవహరిస్తారు. చేరన్‌ నటించిన ‘యుద్ధం సెయ్‌’ కథను నా కోసం రాశారు. కానీ కొన్ని కారణాల వల్ల నటించలేదు. ‘ఒరుకల్‌ ఒరుకన్నాడి’ ద్వారా పరిచయమయ్యా. ఇప్పుడు ‘సైకో’తో ప్రేక్షకులకు చాలా భిన్నమైన పాత్రలో కనిపించనున్నా.

ప్ర: ‘సైకో’ ఎలాంటి చిత్రం?

జ: కథాపరంగా నాకు, ఓ సైకోకు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం. ఇందులో ఓ కొత్త వ్యక్తి సైకోగా నటించారు. నేను కంటిచూపు లేని వ్యక్తి పాత్రలో కనిపిస్తా. అలా నటించడం ఇదే తొలిసారి. ఇందుకోసం కొంతకాలం పాటు శిక్షణ తీసుకున్నా. స్పర్శ ద్వారా వాళ్లు ఎలా అర్థం చేసుకుంటారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, యాస, బాడీలాంగ్వేజ్‌ వంటి విషయాలను తెలుసుకుని ఇందులో నటించా. ముఖ్యంగా వారి మానసిక స్థితిని కూడా అడిగి తెలుసుకున్నా. ముఖ్యమైన విషయం చెబుతున్నా. ఇది ప్రయోగాత్మక చిత్రం. పిల్లలు సహా చూడదగ్గ సినిమా కాదు. గర్భిణులు కూడా చూడొద్దనే కోరుకుంటున్నాం.

ప్ర: జయలలిత జీవితాన్ని బయోపిక్‌గా పలువురు తెరకెక్కిస్తున్నారు. మరి మీ తాత జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తారా?

జ: నిజం చెప్పాలంటే.. తాత ఉన్నప్పుడే నాకు ఆయన జీవితాన్ని తెరపై చూడాలనే ఆశ ఉండేది. నాన్న కూడా అనుకున్నారు. కానీ, తాత జీవితాన్ని ఒక సినిమాలో కుదించలేమని భావించాం. చాలా భాగాలు తీయాల్సి ఉంటుంది. ఆ బయోపిక్‌కు సంబంధించి త్వరలోనే కొన్ని విషయాలు తెలుస్తాయి.

ప్ర: ఒకవేళ సినిమా చేస్తే కరుణానిధి పాత్రకు ఎవరు నప్పుతారు?

జ: ప్రస్తుతానికి ఆ విషయాన్ని చెప్పలేను. నేను తప్పకుండా నటించను. ఎందుకంటే న్యాయం చేయలేకపోవచ్ఛు ఒకవేళ తాత సినిమాను తెరకెక్కించే దర్శకులు తీసుకునే నిర్ణయమే కీలకం కావొచ్ఛు

ప్ర: సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు ఎంజీఆర్‌ పేరు పెట్టినట్టు, ఎగ్మూరు స్టేషన్‌కు కరుణానిధి పేరు పెట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోందే?

జ: తాతకు అవార్డులు ఇస్తే.. వాటికే గొప్పతనం చేకూరుతుంది. అయినా పురస్కారాల వల్ల ఆయనకు కొత్తగా పేరుప్రతిష్ఠలు వస్తాయని నేను అనుకోను. వాటన్నింటికీ అతీతమైన వ్యక్తి ఆయన. ‘తాతకు భారతరత్న ఇవ్వాలి, రైల్వేస్టేషన్‌కు పేరు పెట్టాలి’ వంటి విషయాలపై డీఎంకే సముచిత రీతిలో నిర్ణయం తీసుకుంటుంది.

ప్ర: చెన్నై మేయరుగా ఒకప్పుడు మీ నాన్న ప్రత్యేకత చాటారు. త్వరలో మీరు కూడా మేయరు అభ్యర్థిగా పోటీ చేస్తారనే టాక్‌ వినిపిస్తోందే?

జ: ముందుగా మేయర్‌ ఎన్నికలు జరగనివ్వండి. ఆ తర్వాత పోటీ గురించి ఆలోచిద్దాం. అసలు ఎన్నికలే నిర్వహించడం లేదుగా. నేను పోటీ చేయడానికి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నా.

ప్ర: ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పుడు రాజకీయాల గురించి చర్చించారా?

జ: చాలా సంవత్సరాలుగా నాన్నకు జగన్‌ తెలుసు. పదవీ ప్రమాణ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను కూడా వెళ్లా. అప్పుడు పెద్దగా రాజకీయ ప్రస్తావన రాలేదు. అలాగే కేసీఆర్‌ కూడా గతంలో మా ఇంటికి వచ్చారు. వారితో బాగానే పరిచయాలున్నాయి.

ప్ర: రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలు తగ్గించారా?

జ: అలాంటిదేం లేదు. త్వరలో మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలోని ఓ సినిమాలో నటిస్తున్నా. అలాగే మారన్‌ దర్శకత్వంలోని ‘కణ్నై నంబాదే’ షూటింగ్‌ కొనసాగుతోంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో పగలంతా పార్టీ తరఫున ప్రచారం చేశా. రాత్రిపూట సినిమాల్లో నటించా. సైకో అప్పుడే తెరకెక్కించారు.

ప్ర: ‘వయసు మీదపడిన వారు సురక్షితంగా ఇంట్లోనే ఉండండి’ అంటూ ‘పౌరసత్వ’ ఆందోళన సందర్భంగా మీరు చేసిన ట్వీటు వివాదాస్పదంగా మారింది. అది పరోక్షంగా రజనీకాంత్‌ను ఉద్దేశించినదనే ప్రచారంపై ఎలా స్పందిస్తారు?

జ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆ ట్వీటు చేశా. కానీ ఎవర్నీ ఉద్దేశించి అలా ప్రస్తావించలేదు. పార్టీలోని వయసు మీదపడిన వారిని భద్రంగా ఇంట్లోనే ఉండమని చెప్ఫా వ్యక్తిగతంగా ఎవర్నీ ప్రత్యేకించి ఇలా చేయలేదు.

ప్ర: నడిగర్‌ సంఘం ఎన్నికల్లో ఓటింగ్‌ పూర్తయినా ఫలితాలు వెలువడకపోవడంపై మీ స్పందనేంటి?

జ: ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించారు. వాస్తవానికి నడిగర్‌ సంఘం ఫలితాలు వెల్లడించకపోవడం చాలా బాధాకరం. ఎన్నికల తర్వాత మా నాన్న స్టాలిన్‌తో నటుడు విశాల్‌ భేటీ అయ్యారు. సమస్య అక్కడే ఆరంభమైంది. ఆ కారణం వల్లే ఫలితాలను ఆపారని అనుకుంటున్నా. బహుశా.. విశాల్‌ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేక అలా చేశారేమో!

ప్ర: ఎప్పుడైనా తాతను మిస్‌ అయ్యానని బాధపడిన సందర్భం ఉందా?

జ: చాలా సందర్భాల్లో అనుకుంటున్నా. నేను నటించిన ‘మనిదన్‌’ చిత్రాన్ని ఆయన చూడాలని అనుకున్నా. కోర్టు, వాదనల సన్నివేశాలను తాత బాగా ఇష్టపడుతారు. కానీ అది కుదరలేదు. అప్పటికే అనారోగ్యానికి గురయ్యారు. ఆయన శ్రమ, మాటలను రోజూ గుర్తు చేసుకుంటా. నేను నటుడిగా కొంత మందికి మాత్రమే తెలుసు. ఇలాంటి నగరాలను దాటి గ్రామాల్లోకి వెళితే.. ‘కరుణానిధి పేరన్‌’ (కరుణానిధి మనవడు) అనే అంటారు. ఇటీవల ఓ గ్రామానికి వెళ్లినప్పుడు వాళ్లకు నేను నటుడనే విషయం తెలియలేదు.. ‘కరుణానిధి పేరనా ఇవరు’ అని నన్ను అక్కున చేర్చుకున్నారు. ఆ క్షణం వారి కళ్లల్లో తాతను చూశా.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.