close

తాజా వార్తలు

Updated : 14/08/2020 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాలీవుడ్‌ హీరోల చేతిలోనే ఉంది!

ఆయన ఓ ‘దమ్ము’న్న నిర్మాత....

ప్రేక్షకులు మెచ్చేలా చిత్రాలు అందించడమే ఆయన ‘అభిలాష’..

తీసే ప్రతి చిత్రాన్ని ఓ‘ఛాలెంజ్‌’గా స్వీకరిస్తాడు...

‘స్వర్ణకమలం’ లాంటి చిత్రాల్ని ప్రేక్షకులకు అందిస్తాడు ఈ పని ‘రాక్షసుడు’. ఆయనే ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు.

అప్పుడెప్పుడో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది... ఎదుర్కొన్న ఒడుదొడుకులు ఏంటి.. ఎలా అధిగమించారో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’లో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం...


అలీ: విజయవాడలో రైలెక్కి చెన్నై వెళ్లి ఏమవుదాం అనుకున్నారు?

కేఎస్‌ రామారావు (కేఎస్‌ఆర్‌): సిన్సియర్‌గా చెప్పాలంటే... మద్రాసు వెళ్లేవరకూ ఏమవుదామనుకుంటున్నానో నిర్ణయించుకోలేదు. కేవలం బతకడం కోసం మాత్రమే మద్రాసు వెళ్లాను. అక్కడికెళ్లిన తర్వాత మంచి టెక్నీషియన్‌ అవ్వాలని డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. కె.ఎస్‌.ప్రకాశ్‌రావు గారి దగ్గర ఆఖరి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. ఆ సినిమాకు ఆయన అబ్బాయి రాఘవేంద్రరావు కూడా పని చేశారు. అలా నా ప్రయాణం 1967లో ‘బందిపోటు దొంగలు’ అనే సినిమాతో దర్శకత్వ విభాగంలో అప్రెంటీస్‌గా మొదలైంది. 

అలీ: ఆ తర్వాత...

కేఎస్‌ఆర్‌: కె.ఎస్‌.ప్రకాశరావు దగ్గర మూడు సినిమాలకు పని చేశాను. ‘బందిపోటు దొంగలు’ తర్వాత ‘విచిత్ర కుటుంబం’, ‘నా తమ్ముడు’ సినిమాలకు దర్శకత్వ విభాగంలో పని చేశాను. ఆ తర్వాత నాలుగో సినిమా కోసం పి.సాంబశివరావు దగ్గర పని చేస్తూ ఇంట్లో నెలకొన్న పరిస్థితులతో మళ్లీ విజయవాడ వచ్చేశాను. అక్కడే కొంతకాలం ఉండిపోయాను. ఆ తర్వాత క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అని 1973 నవంబరులో రేడియో పబ్లిసిటీ సర్వీసును ప్రారంభించాను. అక్కణ్నుంచి నన్ను రేడియో రామారావు అని పిలిచేవారు.

అలీ: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ రామారావుగా ఎప్పుడు మారారు?

కేఎస్‌ఆర్‌:  1973-79 వరకు రేడియో పబ్లిసిటీ, దూరదర్శన్‌లో పబ్లిసిటీ సర్వీసు నిర్వహించేవాణ్ని. ఈ క్రమంలో సినిమా మేకింగ్‌ మీద ఆసక్తి కలిగింది. దానికి కారణం ప్రముఖ దర్శకుడు పుట్టా నాగన్న (పుట్టన్న). ఆయన కన్నడ దర్శకుడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆయన తీసిన సినిమాలు, మేకింగ్‌ స్టైల్‌ బాగా నచ్చేవి. దీంతో ఆయన్ను బాగా గమనించేవాణ్ని. అదే సమయంలో ఆయన కొత్తవాళ్లతో కన్నడలో ‘ఫలితాంశ’ అనే సినిమా చేశారు. దానిని నేను ‘నన్ను ప్రేమించు’ పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేశాను. అలా చిత్ర నిర్మాణంలో ప్రవేశించాను. ఆ తర్వాత ‘సిగప్పు రొజాగళ్‌’ అనే సినిమాను రీరికార్డింగ్‌ టైమ్‌లో చూశాను. అప్పుడు కేఎస్‌ఆర్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  ‘ఎర్రగులాబీలు’ పేరుతో తీసుకొచ్చాను. ఆ సినిమాతో నా కంపెనీ, నేను పాపులర్‌ అయ్యాం.

అలీ: మీరు ఎంతమంది?

కేఎస్‌ఆర్‌:  మా నాన్నకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలం, ముగ్గురు అమ్మాయిలు. నేను పెద్దవాణ్ని. రెండోవాడు బెనర్జీ నాతోపాటే సినిమాలు చేశాడు. నాకు అతనికి పెద్ద తేడా లేదు. కొంతమంది అతనిని చూసి నా కంటె పెద్దవాడు అనుకుంటుంటారు. అందరూ ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటున్నారు. బెనర్జీ ఇప్పుడు లేడు. 

అలీ: మీది ప్రేమ వివాహం అని విన్నాను... నిజమేనా?

కేఎస్‌ఆర్‌: ప్రేమ వివాహమా అంటే... ఆమె నా దగ్గర బంధువు. మా ఇద్దరికి ఇష్టం. పెద్దవాళ్లు అంత సుముఖంగా లేరు. అందుకే వాళ్ల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నాం. దీంతో అది ప్రేమ వివాహం అయిపోయింది. 1969లో నేను అసిస్టెంట్‌ డైరక్టర్‌గా ఉన్నప్పుడే మా పెళ్లి ఇక్కడే హైదరాబాద్‌లోనే జరిగింది. మాకు ఒక అబ్బాయి పేరు వల్లభ.

అలీ: ప్రమోద ఆర్ట్స్‌, కేఎస్‌ ఆర్ట్స్‌ అని రెండు ఉండగా... క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ఎందుకు తీసుకొచ్చారు?

కేఎస్‌ఆర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నా రేడియో పబ్లిసిటీ. అప్పటికే పాపులర్‌ అయ్యింది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మీద రేడియో పబ్లిషిటీ చేసిన మొదటి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. దాంతోపాటు ‘ముత్యాలముగ్గు’, ‘వేటగాడు’ చిత్రాలతో మా సంస్థ పాపులారిటీ పెరిగింది. కొంతకాలం తర్వాత ప్రమోద ఆర్ట్స్‌, కేఎస్‌ ఆర్ట్స్ బ్యానర్ల మీద సినిమాలు తీశాను. పరిశ్రమలో నాకు మార్గదర్శకుడిగా వ్యవహరించిన లింగమూర్తి... ఒక రోజు వచ్చి ‘ఆ పేరు, ఈ పేరు ఎందుకు క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బాగా పాపులర్‌ అయ్యింది కదా.. ఆ పేరుతో ఎందుకు సినిమాలు తీయవు’  అని అన్నారు. అప్పుడు క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌ పెట్టి  సుహాసిని మొదటి సినిమా ‘మౌనగీతం’ని స్టార్ట్‌ చేశాను. ఆ తర్వాత ‘అభిలాష’. ‘మౌనగీతం’ ఆ రోజుల్లో చాలా బాగా ఆడింది. అప్పటివరకు కెమెరా ఉమన్‌గా ఉన్న సుహాసిని ఈ సినిమాతో కథానాయిక అయ్యింది. 

అలీ: ‘అభిలాష’ ఎలా స్టార్టయ్యింది?

కేఎస్‌ఆర్‌:  స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు ఉండేది. నేను డబ్బింగ్‌ సినిమాలు చేయడం, అవి హిట్‌ అవ్వడంతో కొంతమంది స్నేహితులు స్ట్రయిట్‌ సినిమాలు చేయొచ్చు కదా అని సూచించారు. అప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించాను. అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్‌ నవలలు ఫాలో అవుతున్నాను. ‘తులసీదళం’, ‘అష్టావక్ర,’ ‘తులసి’ సీరియళ్లు రన్‌ అవుతున్నాయి. ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్లి సినిమా కథ గురించి అడిగితే ‘నేను రాయబోయే కథ ఇది’ అని ‘అభిలాష’ పాయింట్‌ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఈ కథ నాకిస్తారా.. నేను సినిమా తీస్తాను అని అడిగాను. దానికి ఆయన ‘ఈ కథ మొత్తం తెలుసుకోండి... ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించండి’ అన్నారు. ఆ తర్వాత ఆ కథను ఫాలో అయ్యాం. ఆ రోజుల్లో ఆ సీరియల్‌కు బాగా ప్రాచుర్యం వచ్చింది. అప్పటికే ఆయన ‘తులసీదళం’తో పాపులర్‌ అయినా... ‘అభిలాష’తో అది ఇంకా పెరిగింది. ‘అభిలాష’ను సినిమాగా తీయడంలో యండమూరి సహకారం అవసరమైంది. దీనికి స్క్రీన్‌ప్లేలో క్రాంతి కుమార్‌ సహాయం చేశారు. పైగా అలాంటి సబ్జెక్ట్‌ సినిమాగా తీయొచ్చా అని ఆలోచించే సమయం అది. ఆ కాలంలో ‘వేటగాడు’, ‘అడవిరాముడు’ లాంటి సినిమాలు వస్తున్నాయి. ఆ సమయంలో ఇలాంటి ప్రయోగం చేయొచ్చా అని అనిపించింది. అప్పుడు క్రాంతి కుమార్‌, సత్యానంద్‌ సహాయం చేయగా, కోదండరామిరెడ్డి స్క్రీన్‌ మీదకు తీసుకొచ్చారు. ఆయనకు ప్రతిక్షణం దగ్గరుండి సహాయం చేసింది యండమూరి వీరేంద్రనాథ్‌, సత్యమూర్తి. వాళ్లిద్దరూ సెట్‌లో ఉంటూ.. చిరంజీవి ఎలా ఉండాలి, రాధిక ఎలా చేయాలి అని దగ్గరుండి గైడ్‌ చేశారు. వీరందరి సహకారం వల్లే కొత్త తరహా సినిమా, కొత్త తరహా హీరోతో చేశాం. అప్పటికి చిరంజీవి బాడీలో అంత రిథమ్‌ ఉందని ప్రేక్షకులకు అంతగా తెలియని రోజులవి. 

అలీ: సినిమాకు మొదట్నుంచి హీరోగా చిరంజీవే అనుకున్నారా?

కేఎస్‌ఆర్‌: ‘అభిలాష’ కథ చదువుతున్నప్పటి నుంచి హీరో చిరంజీవే అనుకున్నాం. గమ్మత్తేంటంటే కథ రాసేటప్పుడు హీరో పేరు చిరంజీవే అని యండమూరి రాసుకున్నారు. అంతేకాదు చిరంజీవి మాతృమూర్తి ఈ నవల చదివి ‘ఈ నవలేదో బాగుంది... పాత్ర నీలాగే ఉంది... నువ్వు చేస్తే బాగుంటుంది’ అని అన్నారట. దాంతో చిరంజీవి వెంటనే ఒప్పుకున్నారు. అలా సినిమా చేయడానికి వీరందరి సహకారంతో పాటు అప్పుడే పరిశ్రమకు పరిచయమైన ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారు. దానికి తగ్గట్టు చిరంజీవి బాడీలో రిథమ్‌ సింక్‌ అయ్యింది. స్వర్గీయ లోక్‌సింగ్‌ ఫొటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి. తక్కువ లైట్స్‌తో, తక్కువ బడ్జెట్‌తో చేసిన సినిమా అది. 

అలీ: ఆ రోజుల్లో సినిమా బడ్జెట్‌ ఎంత? అంతమంది ఆర్టిస్టులతో మొత్తంగా వైజాగ్‌లో చిత్రీకరించారు? 

కేఎస్‌ఆర్‌: ఆ బడ్జెట్‌ నంబరు ఇప్పుడు చెప్తే... అందరూ నన్ను కోప్పడతారు.  చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంటుంది. సినిమా చిత్రీకరణ మొత్తం విశాఖపట్నంలోనే చేశాం. ఇప్పుడు ఆ బడ్జెట్‌ గురించి చెప్తే నేను అబద్ధం చెప్పాను అని నిర్మాతలు, హీరోలు, దర్శకులు అనుకుంటారు. అప్పట్లో సినిమాకి ₹16.5 లక్షలు ఖర్చయింది.  దీనికి పబ్లిసిటీ ఖర్చు ₹1.5 లక్షలు. మొత్తంగా ₹18 లక్షలు. ఆ సినిమాకు వచ్చిన లాభంతోనే నేను ఇల్లు కట్టుకున్నాను. 

అలీ: చిరంజీవితో ఎన్ని సినిమాలు చేశారు?

కేఎస్‌ఆర్‌: మొత్తం ఐదు సినిమాలు మా కాంబినేషన్‌లో వచ్చాయి. ‘అభిలాష’, ‘రాక్షసుడు’, ‘ఛాలెంజ్‌’, ‘మరణమృదంగం’, ‘స్టువర్ట్‌పురం‌ పోలీస్‌స్టేషన్‌’

అలీ: చిరంజీవితో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అంటే అద్భుతమైన కాంబినేషన్‌ కదా... మళ్లీ ఎందుకు ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్లాన్‌ చేయలేదు?

కేఎస్‌ఆర్‌:   మా కాంబినేషన్‌ని ‘స్టువర్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌’  బాగా నిరాశపరిచింది. కారణమేదైనా... నిర్మాతగా నన్ను బాగా నిరుత్సాహ పరిచిన సినిమా అది. ఆ తర్వాత నిర్మాతగా నన్ను నేను నిరూపించుకొని, నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ‘చంటి’ సినిమా చేశాను. ఆ రోజుల్లో రామానాయుడు, సురేశ్‌బాబు.. నన్ను బాగా ప్రోత్సహించారు. అప్పుడే ‘చంటి’ సినిమా కథ దొరికింది. వెంకటేశ్‌బాబు బాగా నటించడం, సినిమా భారీ విజయం అందుకోవడంతో... పరిశ్రమలో అత్యధికంగా వసూలు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ‘నేను డిఫరెంట్‌ సినిమాలు చేయొచ్చు’ అనే నమ్మకం ‘చంటి’ ఇచ్చింది. నేను ఎలాంటి సినిమాలైనా చేయగలను అనే శక్తి  వచ్చింది. 

అలీ: చిరంజీవితో ఐదు సినిమాలు... వెంకటేశ్‌తో ఒక సినిమా చేశారు కదా...

కేఎస్‌ఆర్‌: వెంకటేశ్‌తో ‘చంటి’ ముందే ఓ సినిమా చేశాను. నన్ను సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన అప్పారావు అనే స్నేహితుడుతో కలసి ‘స్వర్ణకమలం’ అనే సినిమా నిర్మించాను.  అది హిట్‌ అయిన తర్వాత నాకు గ్యాప్‌ వచ్చింది. అప్పుడు సురేశ్‌బాబు ప్రోత్సహించడంతో తమిళంలో విజయం సాధించిన ‘చినతంబి’ అనే సినిమాను తెలుగులో ‘చంటి’ గా చేశాను. ఈ సినిమా విజయంతో ‘నేను డిఫరెంట్‌ సినిమాలు చేయొచ్చు’ అనుకొని ‘బాబాయ్‌ హోటల్‌’, ‘క్రిమినల్‌’ లాంటి సరికొత్త తరహా సినిమాలు చేశాను. అలా చిరంజీవితో మళ్లీ సినిమా చేసే సందర్భం రాలేదు. ఈలోగా ఆయన ‘మెగాస్టార్‌’ రేంజిలో ఎదిగిపోయారు. నేను అంత పెద్ద సబ్జెక్ట్‌, అంత పెద్ద సినిమా చేసే సందర్భం రాలేదు. నిజం చెప్పాలంటే నేనే అంత పెద్ద సబ్జెక్ట్‌ చూడలేకపోయా. నావైపునే ఆ లోపం ఉంది. నేను మంచి సబ్జెక్ట్‌ తీసుకెళ్తే ఆయన సినిమా చేసేవాడు. నేనెందుకో చేయలేకపోయా. కోదండరామిరెడ్డి కాంబినేషన్‌ కూడా డిస్ట్రబ్‌ అయ్యింది. నా సొంత మనుషులు అనేవాళ్లు లేకపోవడం వల్ల... ఈ ఇండస్ట్రీ అనే మహాసముద్రంలో ఒంటరిగా ఈదడం మొదలుపెట్టాను. దాంతో నాకు అనుకూలంగా ఉన్న సినిమాలు మొదలుపెట్టాను. 

అలీ: బాలకృష్ణతో ఎందుకు సినిమా చేయలేదు?

కేఎస్‌ఆర్‌: నేను నా తరహా సినిమాలు చేస్తుండగా..  ఆయనతో సినిమా చేసే సందర్భం రాలేదు. ఆయన అడిగే సమయానికి నేను వేరే సినిమా చేస్తుండటం వల్ల సందర్భం కుదర్లేదు. ఆయనకు, నాకు మంచి సంబంధబాంధవ్యాలున్నాయి. 

అలీ: బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌ భట్‌ను తీసుకొచ్చి తెలుగులో చేయడం ఆ రోజుల్లో విచిత్రం కదా?

కేఎస్‌ఆర్‌: డిఫరెంట్‌ సినిమా చేయాలి... రొటీన్‌ సినిమా చేయకూడదు అని నేను ఎప్పటినుంచో అనుకునేవాణ్ని. మనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ ఉండాలి అనే తాపత్రయం ఎక్కువ. మహేశ్‌ భట్‌ పేరు బాలీవుడ్‌లో మారుమోగిపోతున్న సమయం అది. ఆ సమయంలో తెలుగు సినిమా చేయాలని ఆయన్ని సంప్రదించాం. హిందీ, తెలుగులో ఒకేసారి తీశాం. రెండు పరిశ్రమల్లోనూ పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. సినిమా బాగా తీశారని, కీరవాణి సంగీతం అద్భుతమని అందరూ అన్నారు. ఆ యాంగిల్‌లో మంచి పేరు వచ్చింది. నేను పెట్టిన డబ్బులు వచ్చేశాయి. నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ అద్భుతంగా నటించిన సినిమా ఇది. 

అలీ: చిరంజీవికి మెగాస్టార్‌ అనే బిరుదు మీరే పెట్టారట?

కేఎస్‌ఆర్‌: మేం ‘మరణమృదంగం’ తీస్తున్న సమయంలో ఆయన స్థాయి, ఆయన సినిమాల వసూళ్లు అద్భుతం అనిపించాయి. దాంతోపాటు నాకు చాలా ఆప్తమిత్రుడు. సొంత కుటుంబసభ్యుడు లాంటి హీరో. ఆయనకు అప్పటికే రకరకాల బిరుదులు ఉన్నాయి. సూపర్‌స్టార్‌ అని, సుప్రీం హీరో అని అనేవారు. అయితే మన హీరోకు కొత్త తరహా పేరు ఉండాలి అనిపించింది. ఎలాంటి పేరు ఆయనకు బాగుంటుంది అని వెతికాం. ఇంతకన్నా మంచి పేరు ఎవరూ పెట్టలేరు అనేలా ‘మెగాస్టార్‌’ అని పెట్టాం. ‘మరణమృదంగం’తో చిరంజీవి పేరుకు ‘మెగాస్టార్‌’ యాడ్‌ చేశాం

అలీ: ‘చంటి’ సినిమాకు తొలుత వెంకటేశ్‌నే అనుకున్నారా... ఇంకెవరినైనా అనుకున్నారా?

కేఎస్‌ఆర్‌: ‘చంటి’ తమిళ మాతృక ‘చినతంబి’ నేను, రామానాయుడు గారు, ఇతర స్నేహితులు కలసి చూశాం. ఎవరితో చేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నప్పుడు ‘ఇది రాజేంద్రప్రసాద్‌ చేస్తే బాగుంటుంది’ అని కొంతమంది స్నేహితులు సూచించారు. ఎవరు దొరుకుతారు.. ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్న తరుణంలో సురేశ్‌బాబు కబురు చేసి... ‘‘చినతంబి’ సబ్జెక్ట్‌ మీ దగ్గర ఉందని విన్నాను. మీకు ఇష్టమైతే మనం చేద్దాం’ అని అన్నారు. దాంతో వెంకటేశ్‌ గురించి ఆలోచించాం. అంతకుముందు వెంకటేశ్‌ అలాంటి సినిమాలు చేయలేదు. ఫుల్‌ రైజింగ్‌ హీరోగా... యాక్షన్‌  సినిమాలు చేస్తున్నారు. కరెక్ట్‌గా ఉంటుందా లేదా అని ఆలోచన మొదలుపెట్టాం. ఈ లోపు ఆయన చంటి గెటప్‌ వేసుకొని ట్రయల్‌ వేశారు. ఆ సినిమా కోసం ఎక్కువ కష్టపడింది వెంకటేశే. గెటప్‌, కాస్ట్యూమ్స్‌ విషయంలో పర్‌ఫెక్ట్‌గా డిజైన్‌ చేసి నటించిన సినిమా అది. దానికి తగ్గట్టుగానే ఆయనకు తెలుగులోనే కాకుండా, హిందీలోనూ మంచి పేరు వచ్చింది.

అలీ: నేను బాలనటుడిగా ఉన్నప్పుడు మీ సినిమాలు ‘పుణ్యస్త్రీ’, ‘ముత్యమంత ముద్దు’లో చేశాను... ఆ రెండింటికీ రవిరాజ పినిశెట్టి దర్శకుడు.

కేఎస్‌ఆర్‌:  రవిరాజ పినిశెట్టి అప్పటికి ‘వీరభద్రుడు’ అనే సినిమా చేశారు. ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వకపోవడంతో కాస్త నిరాశతో ఉన్నారు. అయితే ఆయన మంచి టెక్నీషియన్‌. ‘పుణ్యస్త్రీ’ సబ్జెక్ట్‌ బాగా డీల్‌ చేస్తాడని నమ్మి ఇచ్చాం. ఆ సినిమా చాలామందికి గుర్తుండుకపోవచ్చు కానీ... చాలా గొప్ప సినిమా అది.

కోటు అప్పు తీసుకొని వచ్చాను...

‘పుణ్యస్త్రీ’ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు అలీ ఆ నాటి రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. ‘‘సినిమా పూర్తయ్యాక నాకు రావాల్సిన బ్యాలెన్స్‌ అమౌంట్‌ కోసం ఆఫీసుకు వెళ్దామనుకున్నా... అప్పటికి  మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. బస్సులు లేవు, ఆటోలు లేవు, సైకిల్‌ మీద వెళ్దామంటే అవ్వదు. దీంతో నడుచుకొని బయలుదేరా. మీ ఆఫీసు వాణి మహల్‌ దగ్గర ఉండేది. అక్కడ పక్కన ఉన్న ఫుట్‌పాత్‌ మీద నడుచుకొని వస్తుంటే... మ్యాన్‌ హోల్‌ ఓపెన్‌ అయి ఉంది. ఆ విషయం తెలియక అడుగువేసేసరికి కుడి కాలు లోపలకు జారిపోయింది. మళ్లీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ లేచాను. అయితే కాలు మొత్తం కొట్టుకుపోయింది. రెండూ కాళ్లూ అందులోకి జారి ఉంటే... మీ ‘పుణ్యస్త్రీ’ పేరు చెప్పి పుణ్య లోకాలకు వెళ్లేవాణ్నేమో.’’ అని అలీ చెప్పారు. ‘‘ఆఫీసుకు రాగానే మీరు ఏమైందని వాకబు చేసి... నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ అమౌంట్‌ను మీ తమ్ముడు బెనర్జీతో చెప్పి ఇప్పించారు. ఈ సినిమా 100 రోజుల వేడుకకు నా స్నేహితుడు దగ్గర కోటు అప్పు తీసుకొని అడయార్‌ పార్క్‌ హోటల్‌కి వచ్చాను.  సినిమాలకు అక్కడ వేడుక చేయడం అదే తొలిసారి. కోదండరామిరెడ్డి గారి చేతుల మీదుగా 100 రోజుల షీల్డ్‌ అందుకున్నాను’’ అని గుర్తు చేసుకున్నారు.

 

అలీ: అంత పెద్ద బ్యానర్‌ను నిర్వహించిన మీరు తర్వాత ఎందుకు నెమ్మదించారు?

కేఎస్‌ఆర్‌: సినిమాలు తీయడానికి డబ్బులు మాత్రమే సరిపోవు. సరైన సహకారం అందించే దర్శకుడు, టెక్నీషియన్స్‌, మంచి కథ అందించే కథకుడు, వీటికి సపోర్టు చేసే మంచి హీరో కావాలి. వీళ్లంతా ఉంటే తప్ప మంచి సినిమా రాదు. ఇది చేయాలంటే, వాళ్లందరినీ కలుపుకొని వెళ్లాలంటే చాలా ఎక్కువ కష్టపడాలి. మరోవైపు ప్రస్తుతం పోటీ పెరిగింది. డబ్బు ప్రభావం కూడా ఎక్కువుంది. అప్పుడేమో సినిమానే ముఖ్యం, సినిమా మేకింగే ముఖ్యం, సినిమా గొప్పగా రావాలనేదే ముఖ్యం. ఇప్పుడు వాటితోపాటు ఎంత డబ్బులు పెడితే అంత గొప్ప అనే టైమ్‌ ఇది. దానిని అందుకోవాలంటే ఒక్కోసారి భయంగా ఉంటోంది. ఒక్కోసారి సమకూర్చుకోలేకపోతాం.  ఒక్కోసారి మనకన్నా ఎక్కువ ఇవ్వగలిగేవాళ్లు ఉంటారు. నేను రూ. పది కోట్లు  ఇస్తే... ఇంకొకరు రూ.20 కోట్లు ఇచ్చే స్టేజీకి  పరిశ్రమ వచ్చేసింది. పది కోట్లకు 20 కోట్లు ఇవ్వడం సరైనదేనా... మనం కూడా పరిగెత్తొచ్చా.. మనం కూడా అంత రీచ్‌ అవ్వగలమా అనే ఆలోచనతోనే టైమ్‌ అయిపోతోంది. ఈ లోపు మరో నిర్మాత ముందుకొచ్చేస్తాడు. ఒకరి గురించి ఒకరు ఆలోచించే స్థితిలో పరిశ్రమలో లేదు. చిత్ర పరిశ్రమలోనే కాదు ఎక్కడా అలా ఉండదు. ఎవరి సంగతి వాళ్లు చూసుకోవడం, ఎవరికి వాళ్లు ముందుకు వెళ్లిపోతుంటారు. వెనకేం జరుగుతోంది, వెనుకబడిపోయిన వాళ్లు ఎలా ఉన్నారు అని చూసే పరిస్థితి లేదు. ఈ ఆలోచన సమయంలో నేను వెనుకబడిపోయాను. సరైన కాంబినేషన్‌ దొరక్క, సమయానికి సినిమాలు చేయలేకపోయాను. ఈ విషయంలో కొంత వెనుకబడిపోయానన్న మాట నిజం. దీనికితోడు కొంత వయసు పైబడింది కూడా. అయినా నేను ఫైట్‌లోనే ఉన్నా. నేనేమీ సినిమా పరిశ్రమ నుంచి విరామం తీసుకొని, రిటైర్‌ అయిపోదామనే ఆలోచనలో లేను. చివరివరకు నేను పోరాడుతూనే ఉంటాను. చివరి వరకు సినిమా తీస్తూనే ఉంటాను.

అలీ:  సాధారణంగా నిర్మాతలు ఓ హీరో సినిమా పెద్ద హిట్‌ అయితే అనుకున్న పారితోషికం కంటె కొద్దిగా ఎక్కువిస్తారు. లేదంటే లాభాల్లో వాటా ఇస్తారు. కానీ మీరే ఇంటి ప్లాన్‌ డిజైన్‌ చేసి ఇల్లు కట్టి.. ఆ ఇంటి తాళాలు వాళ్ల చేతిలో పెడతారు.. ఎందుకలా.?

కేఎస్‌ఆర్‌: నాకు స్వతహాగా ఇల్లు డిజైన్‌ చేయడం అలవాటు. అది నాకు బాగా నచ్చే అభిరుచి. నేను ఉన్న ఇల్లు గానీ, కట్టే ఇళ్లు గానీ అలానే ఉంటాయి. మా ఇంటికి వచ్చి చూసి బాగుంది ఈ ఇల్లు నాకిస్తారా అని అడుగుతుంటారు. అలా అడిగితేనే ఇచ్చాను. దానిని వ్యాపారంగా కూడా చేయలేదు. 

అలీ: మెకానిక్‌ అల్లుడు సినిమా షూటింగ్‌ కోసం మాదాపూర్‌ సీసీ స్టూడియోకి వచ్చాను. అది చూసి ‘కె.ఎస్‌.రామారావు ఇక్కడ కట్టారేంటి... ఈ రాళ్లలో ఏంటి’ అనుకున్నా. ఇప్పుడు అక్కడ గూగుల్‌ బిల్డింగ్‌ ఉంది... మురళీమోహన్‌గారు కట్టిన బిల్డింగ్‌ కదా అది. మీ స్థలం ఆయనకెలా వెళ్లింది? 
కేఎస్‌ఆర్‌:
 నేను చాలా నష్టాల్లో ఉన్న సందర్భంలో అప్పు తీర్చడానికి ఆ స్థలం ఆయనకు ఇచ్చేశా. ఆ స్థలం ఇచ్చేస్తే కానీ నష్టం నుంచి బయటపడలేని పరిస్థితి అది. అందుకే ఇచ్చేయాల్సి వచ్చింది. ఆస్తులన్నీ అలాంటివాటికే ఉపయోగపడతాయి. ఇచ్చేశా.. అప్పు తీర్చేశా.

అలీ: ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రాజశేఖర్‌, మీనా... ఇలా చాలామందికి ఇళ్లు ఇచ్చినట్టున్నారు కదా?

కేఎస్‌ఆర్‌: అవి వాళ్ల డబ్బుతో వాళ్లు తీసుకున్న ఇళ్లు. నా ఇల్లేదీ వాళ్లు తీసుకోలేదు.. వాళ్లు అమ్మలేదు. వాళ్ల డబ్బుతో కొనుక్కున్నారు, వాళ్ల సొంతం.

అలీ: విజయ్‌ దేవరకొండ లాంటి టాప్‌లో ఉన్న హీరోతో చేసిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సరిగా ఆడకపోవడానికి కారణమేమనుకుంటున్నారు?

కేఎస్‌ఆర్‌: ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (WFL) తర్వాతి తరం సినిమా అవ్వడమే పరాజయానికి ఒక కారణం. అలాంటి సంస్కృతి, ఫార్ములాతో రూపొందిన సినిమాలు మనకు ఇంకా రాలేదు. దీంతోపాటు విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ సినిమా మీద అంచనాలను ఊహించని స్థాయికి తీసుకెళ్లిపోతాయి.  నా సినిమా అనే కాదు... నా సినిమా ముందు వచ్చిన విజయ్‌ సినిమాలు కూడా అలానే అంచనాలు పెరిగి ఇబ్బందులు పడ్డాయి. అభిమానుల్ని, ప్రేక్షకుల్ని సంతృప్తిపరచాలంటే... నిర్మాతలు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడాలి. మరోవైపు సహజీవనం సంస్కృతి ఇంకా మనకు అలవాటు కాలేదు. ఎక్కడో మెట్రోపాలిటన్‌ నగరాల్లో కొన్ని దగ్గర్ల ఉంది. దీంతో సినిమాలో నాయకానాయికల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, సంభాషణలు సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యి.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 

అలీ: నేను విన్నంతవరకు థియేటర్‌లో 150 మంది సినిమా చూస్తే... 100 మంది బాగోలేదని, 50 మంది బాగుందని చెప్పారంట...

కేఎస్‌ఆర్‌: అంటే ఆ 50 మంది కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించేవాళ్లు అయ్యుంటారు. మిగిలిన 100 మంది ఏదో రెగ్యులర్‌ సినిమా కావాలి, హీరో ఊహకందని ఫీట్లు చేయాలి అనుకుంటుంటారు. 

అలీ: క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని ప్రేక్షకులు అనుకుంటున్న తరుణంలో ‘మాతృదేవోభవ’ అనే సినిమా చేశారు. దానికి కారణం ఏంటి? కథ విన్నాక మనసుకు బాగా నచ్చేసిందా? అవార్డులు వస్తాయని చేశారా?

కేఎస్‌ఆర్‌: నేను ఏ సినిమా కూడా అవార్డు కోసం తీయను. కథ నాకు నచ్చాలి. నా హృదయాన్ని తాకాలి. ఎమోషన్‌ సరిగ్గా ఉందనుకుంటే... నేను తీయడానికి సిద్ధమవుతాను. అలా చేసిన సినిమానే ‘మాతృదేవోభవ’. ఒక తల్లి తన పిల్లల కోసం పడ్డ తపన ఎలా ఉంటుంది. ఎంత త్యాగం చేస్తుందనేది చూపించాం. ఈ పాయింట్లతోనే ఆ సినిమా చేశాం. సినిమాకు టైటిల్‌గా ‘తల్లి ప్రేమ’, ‘అమ్మ కోసం’ అనే పేరు పెట్టొచ్చు కదా... ‘మాతృదేవోభవ’ ఎందుకు అని అడిగారు. తల్లి మీద అంత ప్రేమ చూపించాలి. అంత గౌరవం ఇవ్వాలి అని ప్రేక్షకులకు చెప్పేలా ఆ సినిమాకు ఆ పేరు పెట్టాం. మామూలు పేరు కన్నా... ఇలాంటి పేరుతో ఇంకొంచెం సినిమా జనాల్లోకి వెళ్తుందనిపించింది. పెద్ద నటులు ఎవరూ లేకపోయినా... సినిమాలో ఏదో ఉంది అని ప్రేక్షకులకు అనిపించేలా పేరు పెట్టాలనుకున్నాం. ‘మాతృదేవోభవ’ అనే పేరుపెట్టడం వెనుకు ఇదీ ఓ కారణం. 

అలీ: ‘మాతృదేవోభవ’ చూశాక మీరు ఎంత సంతృప్తి చెందారు?

కేఎస్‌ఆర్‌: నాతో పాటు కొంతమంది తెలిసినవాళ్లు సినిమా చూశారు. అందరినోట మాట రాని పరిస్థితి నెలకొంది. అలా సినిమా అయిపోయాక.. స్టన్‌ అయిపోయారు. మాధవి నటన చూసి అందరూ మెచ్చుకున్నారు. కొత్త దర్శకుడు అంత బాగా చేశారా అనుకున్నారు. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం కూడా అద్భుతం. మనమందరం కలసి ఇంత మంచి సినిమా చేశామా అని అనుకుంటూ కాసేపు ఆనందపడ్డాం. ఆ సమయంలో అందరి కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. 

అలీ: మోహన్‌బాబు మిమ్మల్ని ముద్దుగా సిల్లీ ఫెలో అని పిలుస్తారు.. ఏంటి దాని వెనుక స్టోరీ?

కేఎస్‌ఆర్‌: నేను, మోహన్‌బాబు ఒకే సమయంలో పరిశ్రమలోకి ప్రవేశించాం. చిన్నప్పటినుంచి మా ఇద్దరి మధ్య చనువు ఉంది. ఆ తర్వాత ఆ ధోరణులు, పద్ధతిలో ఆయన ముందుకెళ్లారు. ఆయన ఆ స్టేజ్‌కి వచ్చారు. నా పద్ధతిలో నేను వచ్చాను. అయితే తెలుగు చిత్రపరిశ్రమకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాసరి నారాయణరావు, జీవీఎస్‌ రాజు, రాఘవేంద్రావు లాంటి పెద్దలందరూ కూర్చొని కలసి వజ్రోత్సవం నిర్వహించాం.  మోహన్‌బాబుకి కొన్ని సరదాలు ఉంటాయి. గబుక్కున ఒక మాట మాట్లాడటం, బోల్డ్‌గా చెప్పడం, చనువుగా ఉన్నవాళ్లతో ఇంకా కొంచెం సరదాగా ఉంటారు. అలా నన్ను సిల్లీ ఫెలో అన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న చనువుతో అలా అన్నారు. అయితే అదేదో పెద్ద బూతు పదంలా ఎక్కువ చేసి మీడియా రెండు, మూడు రోజులపాటు పబ్లిసిటీ చేసింది. నిజానికి మా మధ్య అలాంటిదేం జరగలేదు. ఆ తర్వాత నేను తీసిన ‘బుజ్జిగాడు’లో మోహన్‌బాబు చేశారు. నా మీద ఉన్న చనువుతోనో, అభిమానంతోనే, అక్కడికక్కడ వచ్చిన కోపంతోనే అలా అనుంటారు. నేను దానిని చాలా లైట్‌గా తీసుకున్నాను. నాకు మోహన్‌బాబు గురించి చాలా రోజుల నుంచి తెలుసుకాబట్టి నేను పట్టించుకోలేదు. అయినా అసలు అది పెద్ద విషయమే కాదు.

అలీ: మీరు సీనియర్‌ ఎన్టీఆర్‌ను చూశారు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను చూశారు. వాళ్లిద్దరిలో మీరు గమనించిన గొప్ప విషయమేంటి?

కేఎస్‌ఆర్‌: నేను పరుచూరి గోపాలకృష్ణలాగా మంచి పదాలను కూర్చి చెప్పలేను కానీ... నందమూరి తారకరామారావు  అంత గొప్ప నటుడు మళ్లీ పుట్టాడు.. అతనే జూనియర్‌ ఎన్టీఆర్‌. మళ్లీ రామారావుగారు చిన్న కుర్రాడిలా నటిస్తున్నాడే అనేలా జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తుంటాడు. అదే రూపం, అదే నటన అనిపిస్తుంటుంది. ‘విచిత్ర కుటుంబం’ సమయంలో పెద్ద ఎన్టీఆర్‌ను దగ్గర నుంచి పరిశీలించాను. సినిమా విషయంలో చాలా ఏకాగ్రతతో ఉంటారు. ఆయన ఏకసంథాగ్రహి.. ఒకసారి చెప్తే అలా పట్టేస్తారు. ఇప్పుడు తారక్‌లో అది చూశాను. ఎప్పుడు వింటాడు.. ఎప్పుడు దర్శకుడు చెప్పింది అర్థమైంది... ఎప్పుడు తెర మీద చూపించాలి అని అనుకుంటున్నంతలోపే నటించి చూపించి, మెప్పిస్తాడు. తారక్‌ ఏ భాషలో అయినా అంత అద్భుతంగా చేస్తాడు. మనకు అవకాశం రాలేదు కానీ.. తారక్‌ ఇతర భాషల్లోకి వెళ్లినా అదరగొట్టేస్తాడు. కన్నడ, తమిళ పరిశ్రమల నుంచి పాటలు పాడమని తారక్‌ని అడుగుతుంటారు. ఏదైనా ఒకసారి వినేసి ఆ పాట పాడేస్తారు. తమిళం, కన్నడ, హిందీ, ఉర్దూ కూడా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలడు. అంత టాలెంట్‌ ఉంది తారక్‌కి. 

అలీ: సినిమా కంట్రోల్‌ అంతా నిర్మాతల చేతుల్లోంచి దర్శకుడు, కథానాయకుల చేతుల్లోకి వెళ్లిపోయిందని కొందరు అంటున్నారు.. మీరేమంటారు?

కేఎస్‌ఆర్‌: నిజమే అయ్యుంటుంది కానీ. గొప్ప గొప్ప నిర్మాతలు అశ్వనీదత్‌, సురేశ్‌బాబు, అల్లు అరవింద్ నేరుగా సినిమాలు చేయకపోవడానికి ఇదే కారణం. కొంత కాంప్రమైజ్‌ అవ్వకపోవడం, ఇప్పటి జనరేషన్‌తో మనం జర్నీ సరిగ్గా చేయగలమా అనే ఆలోచన ఉండటంతో నేరుగా సినిమాలు తగ్గించేశారు.  కారణమేదైనా.. పరిశ్రమలో మార్పయితే ఉంది. లేదు అంటే మోసం చేయడమే అవుతుంది. అయితే దర్శకులు చేతుల్లో ఉందని అనుకోవడం లేదు. హీరోల చేతుల్లో ఉందనేది అభిప్రాయం. దర్శకులు తమ ప్రతిభను చూపించుకోవడానికి ప్రయత్నం చేసినంతసేపు హీరోలు వాళ్లతో ఉంటారు. దర్శకుడు వీక్‌ అవ్వగానే మార్పు వస్తుంది. హీరోకు ఎప్పుడూ కావాల్సింది మంచి క్రియేటర్‌, టెక్నీషియన్‌. హీరో పదిలంగా ఉండాలి, నాలుగు కాలాల పాటు హీరోగా ఉండాలంటే ఆ మాత్రం ఆలోచన తప్పదు. కాబట్టి హీరోలు ఒక్కరే ఆ గ్రిప్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమ ప్రస్తుతం వంద శాతం హీరోల చేతిలో ఉంది.

అలీ: హీరోగా మీ అబ్బాయిని పరిచయం చేశాక, నిర్మాతగా ఎందుకు మార్చాల్సి వచ్చింది?

కేఎస్‌ఆర్‌: మా అబ్బాయి హీరో నుంచి నిర్మాతగా మారడానికి ఒక కారణం వైఫల్యం. సినిమా సక్సెస్‌ అయితే... మరో సినిమా చేసి ముందుకెళ్లొచ్చు. సినిమా ఫెయిల్‌ అయితే తర్వాతి సినిమా చేయడం అంత సులభం కాదు. డబ్బులు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. తొలి సినిమా పరాజయం పాలైందనే నిరాశ నుంచి బయటికొచ్చి ఇంకో సినిమా చేయాలంటే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. రెండోది తొలి సినిమా విషయంలో నా ఆలోచన కన్నా మా అబ్బాయి ఆలోచనే ఎక్కువ. నటన మనకెందుకు, కుటుంబంలో నటులు లేరు కదా... అనుకున్నా. అయితే  మావాడు సీరియస్‌గా ఉండి చేశాడు. కానీ అది ఫెయిల్‌ అయ్యింది. ఆ తర్వాత ముందుగా నేను అనుకున్నట్లే నిర్మాతగా కొనసాగుతున్నాడు.

అలీ: మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది.

కేఎస్‌ఆర్‌: నా సినిమాలు, వాటిలోని పాటలతో నాకు చాలా అనుబంధం ఉంది. ఆ సినిమాల సమయంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటాయి. ఒక్కోసారి ఎమోషనల్‌గా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఇవన్నీ నేనే తీశానా అనిపిస్తుంటుంది. నా బృందంతో కలసి ఇంత మంచి సినిమాలు చేశానా అనిపిస్తుంటుంది. ఇక ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. 

అలీ: ఇప్పుడు నడుస్తున్న ఓటీటీ ట్రెండ్‌ మీద అభిప్రాయం?

కేఎస్‌ఆర్‌: ఓటీటీ ఒక వినోదం అందించే ప్లాట్‌ఫామ్‌ మాత్రమే. వినోదం కావాలనుకునేవాడికి సులభంగా చేతిలోకి వచ్చేసింది. థియేటర్‌కి వెళ్లకుండానే వినోదాన్ని ఆస్వాదించొచ్చు. కానీ థియేటర్‌లో చూస్తే వచ్చే అనుభూతికి ఏదీ సరిరాదు. వెండితెర మీద సినిమా చూస్తే కలిగే అనుభూతి కొనసాగినంత కాలం వెండితెరను ఓటీటీ ఏమీ చేయలేదు. ఎప్పటికీ మెగా స్క్రీన్‌.. మెగా స్క్రీనే. దాని మీద చూస్తే వచ్చే ఫీలింగ్‌... చిన్న స్క్రీన్‌ మీద రాదు. 


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.