Akash Puri: నాన్నకు డబ్బులిచ్చి కథ తీసుకుంటా: ఆకాశ్‌ పూరి - akash puri interview about romantic movie
close
Updated : 26/10/2021 23:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akash Puri: నాన్నకు డబ్బులిచ్చి కథ తీసుకుంటా: ఆకాశ్‌ పూరి

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నా విజయాలను చూసి, మా నాన్న కాలర్‌ ఎగరేసుకుని తిరగాలి’ అంటున్నాడు యువ కథానాయకుడు ఆకాశ్‌పూరి. బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన ఆకాశ్‌పూరి కథానాయకుడిగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా అనిల్‌ పాదురి దర్శకత్వంలో ఆకాశ్‌ నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్‌ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆకాశ్‌పూరి విలేకరులతో మాట్లాడాడు.

పూరి జగన్నాథ్‌ పనిపోయిందన్నారు!

‘‘మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా  వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. పూరి పనైపోయిందని చాలా మంది అన్నారు. నా పని కూడా అయిపోయిందని అన్నారు.. ఆ మాటలు వింటూ ఉండే వాడిని. కానీ ‘ఇస్మార్ట్ శంకర్‌’తో అంతా వెనక్కి వచ్చింది’’

ఇద్దరం షాకయ్యాం!

‘‘అనిల్ గారు నాన్న దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఆయన సీజీ డిపార్ట్‌మెంట్‌ చూసుకునే వారు. ఆయన దర్శకత్వం చేస్తారని, అందులో నేను హీరోగా నటిస్తానని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఓ రోజు నాన్న గారు సడెన్‌గా పిలిచి ఈ సినిమాకు ఆకాశ్‌ హీరో.. నువ్వు దర్శకుడివి అని అనిల్‌తో అన్నారు. ఇద్దరం షాకయ్యాం. మెహబూబా విడుదలైన ఆరు నెలలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ ఒకే సమయంలో జరిగాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో ‘రొమాంటిక్’ ఇంకా  బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడు రమ్యకృష్ణ గారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రావడంతో సినిమా స్థాయి మారిపోయింది. అలా సినిమాను పూర్తి చేసే సమయానికి లాక్డౌన్ వచ్చింది. మొత్తానికి అలా ఆలస్యమైంది’’

ఓటీటీకి ఇచ్చేస్తారేమోనని భయమేసింది!

‘‘కరోనా కారణంగా పలు సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. ‘రొమాంటిక్‌’ కూడా అలానే అవుతుందేమోనని భయపడ్డా. ఎందుకంటే ఇది అందరితో కలిసి థియేటర్లో కూర్చుని చూసే సినిమా. ‘క్రాక్’, ‘ఉప్పెన’, ‘లవ్‌స్టోరీ’ తదితర చిత్రాలు థియేటర్‌లకు ఊపిరిపోశాయి. ‘రొమాంటిక్’లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌, భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. ఇది కేవలం యూత్ సినిమా మాత్రమే కాదు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా’’

రమ్యకృష్ణతో చేయడం పెద్ద సవాల్‌

‘‘చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. వాస్కోడిగామా అనే పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది. మా నాన్న ఈ సినిమా లైన్‌ను ఎప్పుడో రాసుకున్నారు. ఈ కథలోకే నేను వచ్చాను. రొమాంటిక్ కథను నాకు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి హీరోలందరూ మా నాన్న డైలాగ్స్ చెబుతుంటే ఆనందపడేవాడిని. నేను ఇప్పుడు ఆయన డైలాగ్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. సినిమా చూసి నాన్న గారితో పాటు అందరూ ఎమోషనల్ అయ్యాం. చాలా బాగా వచ్చింది రమ్యకృష్ణ గారితో పని చేయడమే పెద్ద ఛాలెంజింగ్. ఆమెతో పని చేయడం నా అదృష్ణం, గౌరవంగా భావిస్తున్నా. ఆమెకు నాకు వచ్చే సీన్లు పోటాపోటీగా ఉంటాయి. ‘ఏం చేయమంటే అది చేస్తా. దూకమంటే దూకుతాను.. కానీ ఈ రొమాన్స్ కాస్త తగ్గించు నాన్నా’ అని అన్నాను. ‘సినిమానే రొమాంటిక్.. అందులో రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా’ అని అన్నారు. సెట్‌లో ఎన్నో సార్లు భయమేసింది. పారిపోదామా? అని అనిపించింది. స్క్రీన్ మీద రొమాన్స్ చేయడం చాలా కష్టం’’

ప్రభాస్‌ స్వయంగా ఫోన్‌ చేశారు

‘‘ప్రభాస్ గారికి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తెలుసు. రొమాంటిక్ ప్రమోషన్స్ కోసం మేం ఎవ్వరం కూడా ప్రభాస్ గారికి ఫోన్ చేయలేదు. ఆయనే ఫోన్ చేసి అడిగారు. అంత పెద్ద స్టార్‌ని మనం ఫోన్ చేసి అడుగుదామా? వద్దా? అని అనుకుంటుంటే ఆయనే ఫోన్ చేసి అడిగారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్‌లో ఒక రోజు మొత్తం మాకిచ్చారు. ఆయనతో ఉన్న ఆ ఒక్క రోజును ఎప్పటికీ మర్చిపోలేను’’

నాన్నకు డబ్బులిచ్చి కథ తీసుకుంటా!

‘‘ఓ పదేళ్ల తరువాత అయినా సరే దర్శకత్వం చేస్తా. కథ రాయడం నాకు రాదు. మా నాన్నకు రెమ్యూనరేషన్ ఇచ్చి కథ తీసుకుంటాను. డైరెక్షన్ మాత్రం చేస్తా. సినిమా ప్రపంచం తప్ప మరొకటి తెలియదు. హీరోగా కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయ్యిండే వాడిని. కానీ సినిమా ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేస్తుండేవాడిని. నాకు రజనీకాంత్, చిరంజీవి దేవుళ్లతో సమానం. వారిద్దరూ చాలా ఇష్టం. వారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. చోర్ బజార్ సినిమా చాలా బాగా వస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నాం. బచ్చన్  సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్రలు దక్కడం ఆనందంగా ఉంది. కమర్షియల్‌పరంగా చాలాపెద్దగా ఉంటుంది. అది యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని