
తాజా వార్తలు
ఆ సన్నివేశానికి రూ.100కోట్లట!
వ్యంగ్యంగా మాట్లాడిన ‘డిటెక్టివ్2’ దర్శకుడు మిస్కిన్
చెన్నై: విశాల్ హీరోగా మిష్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమిళ చిత్రం ‘తుప్పరివాలన్’. తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం ‘తుప్పరివాలన్ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే చిత్ర బృందంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తొలి షెడ్యూల్ను లండన్లో చిత్రీకరించారు. మిష్కిన్ దర్శకత్వంలో విశాల్, ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను అక్కడ తెరకెక్కించారు. చెన్నైలో రెండో షెడ్యూల్ను చిత్రీకరించనున్నారు.
అయితే దర్శకుడు మిష్కిన్ కారణంగా ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైందని, ఇంకా రూ.40 కోట్లు అడుగుతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో దర్శకుడిపై నిర్మాణ వర్గాలు, కథానాయకుడు గుర్రుగా ఉన్నారని సమాచారం. అందువల్ల ‘తుప్పరివాలన్ 2’ నుంచి మిష్కిన్ను విశాల్ తొలగించారని, మిగిలిన సన్నివేశాలను ఆయనే తెరకెక్కించుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నిర్ణయంపై మిష్కిన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చమత్కారంతో సమాధానమిస్తున్నారు. ‘నేను అధికంగా రూ.40 కోట్లు అడగలేదు. రూ.400 కోట్లు అడిగా. ఓ సన్నివేశంలో శాటిలైట్ నుంచి విశాల్ దూకాల్సి ఉంది. ఆ సన్నివేశానికి రూ.100 కోట్లు అవుతుంది. మొత్తానికి నేను రూ.400 కోట్లు అడిగిన మాట వాస్తవమే’ అని పేర్కొన్నారు. ఇటీవల చెన్నై షెడ్యూల్ మిష్కిన్ లేకుండానే ప్రారంభమైందని సమాచారం.