close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యాపిల్‌ తర్వాత రిలయన్సే

ప్రపంచవ్యాప్త దిగ్గజ బ్రాండుల్లో రెండో స్థానం

ఫ్యూచర్‌ బ్రాండ్‌ సూచీలో తొలిసారిగా చోటు

దిల్లీ

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రాండుగా (ఆర్‌ఐఎల్‌) అవతరించింది. ప్రస్తుత సంవత్సరానికి గాను ఫ్యూచర్‌ బ్రాండు రూపొందించిన సూచీలో యాపిల్‌ అగ్రస్థానాన్ని పొందగా.. ఆర్‌ఐఎల్‌ రెండో ర్యాంకు పొందింది. ఈ సూచీలో తొలిసారిగా చోటు దక్కించుకోవడమే కాకుండా.. రెండో స్థానంలో నిలిచిన ఆర్‌ఐఎల్‌ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిందని ఫ్యూచర్‌ బ్రాండు తెలిపింది. ‘భారత్‌లో అత్యధికంగా లాభాన్ని ఆర్జించే కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఐఎల్‌కు గౌరవప్రద స్థానం ఉంది. నైతిక విలువలు పాటిస్తూ వృద్ధి పథంలో పయనిస్తోంది. వినూత్న ఉత్పత్తులు, వినియోగదారులకు అత్యుత్తమ సేవల కలబోతతో ముందుకు సాగుతోంది. ఈ సంస్థతో వినియోగదారులకు విడదీయరాని అనుబంధం ఉంద’ని తెలిపింది. భారతీయులందరికీ ఒకే చోట అన్నీ దొరికేలా (వన్‌ స్టాప్‌ షాప్‌) సంస్థను తీర్చిదిద్దడంలో ముకేశ్‌ అంబానీ చేసిన కృషే రిలయన్స్‌ విజయానికి కారణమని పేర్కొంది. ఓ వైపు ప్రస్తుతమున్న పెట్రో రసాయనాల వ్యాపారాన్ని వృద్ధి పథంలో నడిపిస్తూనే.. మరోవైపు వినియోగదారుల అవసరాలను తీర్చే ఓ దిగ్గజ డిజిటల్‌ సంస్థను ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌ అభివృద్ధి చేశారని అభిప్రాయపడింది. ‘ఇంధనం, పెట్రో రసాయనాలు, జౌళి, సహజ వనరులు, రిటైల్‌, టెలికమ్యూనికేషన్స్‌.. ఇలా ఆర్‌ఐఎల్‌ ఎన్నో రంగాల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటి సంస్థలు ఇందులో వాటాలు తీసుకున్నాయి. మున్ముందు సూచీలో రిలయన్స్‌ను అగ్రస్థానంలో చూసే అవకాశాలూ లేకపోలేద’ని తెలిపింది.

* ఫ్యూచర్‌ బ్రాండ్‌ 2020 సూచీలో యాపిల్‌, ఆర్‌ఐఎల్‌ తర్వాత మూడో స్థానంలో శామ్‌సంగ్‌ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎన్‌విడియా, మౌటాయ్‌, నైక్‌, మైక్రోసాఫ్ట్‌, ఏఎస్‌ఎమ్‌ఎల్‌, పేపాల్‌, నెట్‌ఫ్లిక్స్‌లు చోటు సంపాదించాయి.

* సూచీల్లో కొత్తగా చోటు సంపాదించిన వాటిల్లో ఏఎస్‌ఎమ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, పేపాల్‌, డనహర్‌, సౌదీ ఆరామ్‌కో, అమెరికన్‌ టవర్‌ కార్పొరేషన్‌ ఉన్నాయి. ఈ ఏడాది మొత్తంగా 15 కంపెనీలు కొత్తగా స్థానం సంపాదించాయి. ఇందులో ఏడు తొలి 20 స్థానాల్లో ఉండటం గమనార్హం. వీటిల్లో రెండో స్థానంలో నిలిచిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒకటి.


సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌లోకి ●

2035 కల్లా ప్రపంచంలో అతి పెద్ద కంపెనీగా అవతరణ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యోచన

‘ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహంతో వేస్తున్న అడుగులు.. ఇందులో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, సాంకేతిక భాగస్వాములు, ఈ రంగంలో పనిచేస్తున్న అంకురాలతోనూ కలిసి పనిచేస్తాం’

- వార్షిక సమావేశంలో ముకేశ్‌ అంబానీ

పెట్రో రసాయనాలతో మొదలు పెట్టి.. రిటైల్‌.. టెలి కమ్యూనికేషన్ల రంగాల్లోకి శర వేగంగా విస్తరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఇటీవల కాలంలో సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. థర్మల్‌ విద్యుదుత్పత్తిలో కాలుష్యం అధికంగా వెలువడుతున్నందున, క్రమేణా ఈ విభాగం నుంచి తప్పుకోవాలని మన దేశంతో సహా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ ఆలోచిస్తున్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విద్యుత్‌ మీదే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని దీర్ఘకాలిక అవకాశంగా గుర్తించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ విభాగంలోకి అడుగుపెట్టి, పెద్ద ఎత్తున విస్తరించాలని, 15 ఏళ్లలో అగ్రగామిగా ఎదగాలనీ యోచిస్తోంది.

ప్రస్తుతం దేశీయ విద్యుత్‌ ఉత్పత్తిలో థర్మల్‌ వాటా 64 శాతం వరకూ ఉంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 22 శాతం, జల విద్యుత్‌ 13 శాతం వరకూ ఉండగా.. ఒకశాతం అణు విద్యుత్‌ ఉంది. రాబోయే 10 ఏళ్ల కాలంలో సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని కనీసం 40 శాతానికి చేర్చాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సౌర, పవన విద్యుత్‌ రంగాలకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాలుష్య ఉద్గారాలను 2030 నాటికి కనీసం 33-35 శాతం వరకు తగ్గించి, 2005 స్థాయులకు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సౌర, పవన, హైడ్రోజన్‌, ఫ్యూయల్‌ సెల్‌, బ్యాటరీలాంటి సంప్రదాయేతర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రయతిస్తోంది. చమురు, రసాయనాలతోనే సరిపెట్టకుండా.. దీర్ఘకాలిక వ్యూహంతో సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనికోసం సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ రంగంలోకి ప్రవేశించి.. 2035 కల్లా ప్రపంచ స్థాయిలో నిలపాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో సొంతంగా ముందుకెళ్లడంతో పాటు, ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం ద్వారానూ విస్తరించేందుకు యోచిస్తోంది. సంప్రదాయేతర ఇంధన వనరులతో విద్యుత్‌ ఉత్పత్తితోపాటు, వాహనాల ఇంధనానికీ ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌, విద్యుత్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇదేకాకుండా.. పెట్రోకెమికల్స్‌ తయారీలో వెలువడే కార్బన్‌డైయాక్సైడ్‌ను సేకరించి, దాంతో ఇతర రసాయనాలు, బిల్డింగ్‌ మెటీరియల్‌ బ్లాకులుగా మార్చేందుకూ రిలయన్స్‌ ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా 2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాలను విడుదల చేసే కంపెనీగా గుర్తింపు పొందాలన్నదీ రిలయన్స్‌ లక్ష్యం.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.