close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం

 

● కొవిడ్‌-19 ప్రభావ తీవ్రతను పరిమితం చేస్తుంది

● సానుకూల వర్షపాత అంచనాల నేపథ్యం

● అధ్వాన దశ ముగిసింది ● కీలక సూచీలు పుంజుకుంటున్నాయ్‌

ఆర్థిక శాఖ నివేదిక

దిల్లీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌-19తో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావ తీవ్రతను వ్యయసాయ రంగం కొంత మేర తగ్గిస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. సానుకూల వర్షపాత అంచనాల నేపథ్యంలో వ్యవసాయం రంగం నుంచి ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని ఓ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతానికైతే అధ్వాన దశ ముగిసిపోయినట్లుగా అనుకోవచ్చని అందులో పేర్కొంది. ఏప్రిల్‌లోని క్లిష్ట పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు ఇందుకు ఉపకరించాయని జులై నెలకు ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన స్థూల ఆర్థిక నివేదిక వివరించింది. ‘దేశం అన్‌లాక్‌తో ఆర్థిక వ్యవస్థకు అధ్వాన దశ ముగిసింది. 2020 ఏప్రిల్‌లో ఊహించని ఒడుదొడుకులు ఎదుర్కొన్న కీలక సూచీలు 2020 జూన్‌లో పుంజుకున్నాయి. అయితే కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండటం, కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలవుతున్నందున ఇబ్బందులు లేవని అనలేం. వృద్ధి పుంజుకోవడానికి ఇవి అవరోధంగానూ నిలవొచ్ఛు అందుకే ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ అవసరమ’ని నివేదిక పేర్కొంది. అయితే 2020-21లో ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 సంక్షోభ ప్రభావాన్ని వ్యవసాయ రంగం పరిమితం చేసే అవకాశం ఉందని వెల్లడించింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావచ్చన్న అంచనాల కారణంగా.. స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం వరకు వాటా ఉన్న ఈ రంగం ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచే అవకాశం ఉందని తెలిపింది. లాక్‌డౌన్‌ ఆంక్షలున్నప్పటికీ.. వ్యవసాయ రంగానికి సరైన సమయంలో ఇచ్చిన మినహాయింపులు, చురుకుగా వ్యవహరించి తీసుకున్న నిర్ణయాల కారణంగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి నమోదుకు దోహదం చేసిందని నివేదిక పేర్కొంది. ఈ పరిణామం గ్రామీణ ప్రాంతంలో వినియోగం పెరిగేందుకు తోడ్పడుతుందని తెలిపింది. రానున్న నెలల్లో గ్రామీణ ప్రాంతాలే దేశ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించింది. వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు కూడా రైతులను సాధికారికత వైపు నడిపిస్తున్నాయని.. ఇక నుంచి భారత వృద్ధి ప్రయాణంలో వీళ్లు అత్యంత స్థిరమైన భాగస్వాములుగా మారనున్నారని తెలిపింది. మేలో 30.8 శాతం ఉన్న భారత తయారీ రంగ పీఎంఐ సూచీ జూన్‌లో 47.2 శాతానికి పెరగడం, సేవా రంగ పీఎంఐ సూచీ కూడా 12.6 శాతం నుంచి 33.7 శాతానికి మెరుగవ్వడం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి సంకేతాలని నివేదిక అభిప్రాయపడింది. అన్‌లాక్‌ అనంతరం మౌలిక, నిర్మాణ రంగ కార్యకలాపాలు కూడా సాధారణ స్థితి దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.