close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పన్నుల వ్యవస్థలో నవీన పథం

అవరోధాలు, వేధింపులకు చెల్లుచీటీ

నిజాయతీకి, పారదర్శకతకూ పెద్దపీట

సరళమైన పన్ను విధానమే లక్ష్యం

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టీకరణ

130 కోట్ల మంది ఉన్న దేశంలో పన్ను చెల్లించేవారు కోటిన్నరేనా?

ఆత్మావలోకనం చేసుకోండి

ఆత్మనిర్భర్‌ భారత్‌కు చేయూతనివ్వాలని పిలుపు

ఈనాడు - దిల్లీ

పన్నుల చెల్లింపుల్లో సమూల మార్పుల దిశగా దేశం వడివడిగా అడుగులు వేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరంలేని, అవినీతికి, వేధింపులకు తావులేని పన్ను విధానమే లక్ష్యమని ప్రకటించారు. పారదర్శకమైన, విశ్వసనీయమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పన్ను చెల్లింపుదారుల హక్కులకు రక్షణ కల్పిస్తామని స్పష్టంచేశారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారులూ నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. పన్ను చెల్లించే శక్తి ఉండి కూడా ఎగవేతలకు పాల్పడుతున్న వారు ఆత్మ పరిశీలన చేసుకొని దేశ పురోగతికి సహకరించాలని పిలుపునిచ్చారు. ‘‘పారదర్శక పన్ను విధానం...నిజాయితీపరులకు గౌరవం (ట్రాన్సపరెంట్‌ ట్యాక్సేషన్‌...హానరింగ్‌ ద హానెస్ట్‌)’’ అన్న ఆదాయ పన్నుశాఖ పోర్టల్‌ ప్రారంభం సందర్భంగా ఆయన గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.


పన్ను బాధ్యత ప్రతి భారతీయుడిది

పన్నుల విధానంలో గత ఆరేడు ఏళ్లుగా తీసుకొస్తున్న కొత్త విధానాలను ప్రధాని మోదీ వివరించారు. ‘‘సంక్లిష్టతలు, వివాదాలు తగ్గించి, పారదర్శకత, నిబద్ధత(ట్యాక్స్‌ కంప్లయిన్స్‌), విశ్వాసం పెంచాం. ఈ ప్రయత్నాల వల్ల ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 2.5 కోట్లకు పెరిగింది. 130 కోట్ల మంది ఉన్న దేశంలో ఇది చాలా తక్కువ. అంతకుముందు 1.50 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లించేవారు. పన్ను బాధ్యత కేవలం ఐటీ శాఖదే కాదు...ప్రతి భారతీయుడిదీ. పన్ను చెల్లించే స్థోమత కలిగి ఉన్నా కట్టలేని వారు ఒకసారి ఆత్మను అడిగి ముందడుగు వేయండి. ఆగస్టు 15 వస్తుంది. స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయులను గుర్తుచేసుకొని మీరూ ఎంతో కొంత దేశానికి చేయండి. ఆత్మనిర్భర్‌ భారత్‌ సంకల్పాన్ని సాకారం చేయండి’’ అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.


కొత్త మైలురాయికి సంస్కరణలు

దేశంలో నడుస్తున్న నిర్మాణాత్మక సంస్కరణల పరంపర ఇప్పుడు కొత్త మైలురాయిని చేరుకొందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘పారదర్శక పన్ను విధానం ద్వారా నిజాయతీపరులను గౌరవించే 21వ శతాబ్దపు పన్ను వ్యవస్థను ఇప్పుడు జాతికి అంకితం చేస్తున్నాం. ఆన్‌లైన్‌లో పన్ను మదింపు (ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌), పన్ను చెల్లింపుదారుల హక్కులు(ట్యాక్స్‌పేయర్స్‌ ఛార్టర్‌), ఆన్‌లైన్‌ ద్వారానే వివాదాల నివేదన (ఫేస్‌లెస్‌ అప్పీల్‌) వంటి భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాం. ఇందులో రెండు సంస్కరణలు తక్షణం మొదలయ్యాయి. ఆన్‌లైన్‌ ద్వారా వివాదాల నివేదన సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జన్మదినం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇది పన్ను చెల్లింపుదారుల ఆందోళనలను తొలగించి విశ్వాసాన్ని నింపుతుంది’’ అని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల 2012-13లో 0.94% ఉన్న రిటర్న్‌ల పరిశీలన 2018-19లో నాటికి 0.26%కి తగ్గిపోయాయని తెలిపారు.


ప్రజల కేంద్రీకృతంగా..

‘‘చట్టాలు, విధానాల ప్రక్రియను అధికార కేంద్రం నుంచి ఆవలికి తెచ్చి పన్ను చెల్లింపుదారులు, ప్రజల కేంద్రీకృతంగా మారుస్తున్నాం. ఇది సరికొత్త ప్రభుత్వ విధాన ప్రయోగం. బలప్రయోగం, శిక్షల ద్వారా సాధ్యం కాని మార్పును నాలుగు అంశాల ద్వారా తీసుకురావచ్ఛు అందులో మొదటిది విధాన చోదక పరిపాలన. విధానాల్లో స్పష్టత ఉంటే లోపాలు వాటంతట అవే తగ్గిపోతాయి. రెండోది సామాన్య ప్రజల నిజాయతీని విశ్వసించడం. మూడోది ప్రభుత్వ వ్యవస్థలో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించి సాంకేతిక వినియోగాన్ని పెంచడం. నాలుగోది ప్రభుత్వ యంత్రాంగ సమర్థత, నిబద్ధత, సున్నితత్వాన్ని గుర్తించి అభినందించడం’’ అని మోదీ తెలిపారు.


కోర్టు వెలుపలే పరిష్కారం

‘‘చిన్నచిన్న మొత్తాల వివాదంలోనూ గతంలో ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లేది. ఇప్పుడు అలాంటి వాటిని కోర్టు బయటే పరిష్కరించుకొనేందుకు ‘వివాద్‌ సే విశ్వాస్‌’ చట్టాన్ని తెచ్చాం. దానివల్ల చాలా తక్కువ సమయంలోనే 3 లక్షల వివాదాలు పరిష్కారమయ్యాయి. దేశంలో పన్నులు తగ్గించాం. ఇప్పుడు రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదు. మిగతా శ్లాబులూ తగ్గిపోయాయి. ప్రపంచంలోనే అతితక్కువ కార్పొరేట్‌ ట్యాక్స్‌ అమలుచేస్తున్నాం. అవరోధాల్లేని, ఇబ్బందుల్లేని, భౌతికంగా కార్యాలయాలకు వెళ్లనవసరంలేని (సీమ్‌లెస్‌, పెయిన్‌లెస్‌, ఫేస్‌లెస్‌) పన్ను విధానమే మా లక్ష్యం’’.


సాంకేతికత ఆధారంగా పరిశీలన

అధికారుల నుంచి పన్ను చెల్లింపుదారులకు ఎదురయ్యే వేధింపులను నివారించేందుకు తీసుకొచ్చిన మార్పులనూ ప్రధాని వివరించారు. ‘ఇప్పటివరకు మనం ఏ నగరంలో ఉన్నామో ఆ నగరంలోని ఆదాయపన్ను అధికారులే రిటర్నుల పరిశీలించి, సర్వే, జప్తులాంటివి చేసేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ముగిసిపోతోంది. ఇక మీదట దేశంలో వేరే ప్రాంతంలో ఉన్న అధికారికి యాదృచ్ఛిక విధానంలో రిటర్నుల పత్రం పరిశీలనకు వెళ్తుంది. పునఃపరిశీలన కోసం మరో నగరంలోని అధికారికి వెళ్తుంది. ఈ ప్రకియలో పాల్గొనే అధికారులనూ కంప్యూటర్‌ యాదృచ్ఛికం(ర్యాండం)గానే నిర్ణయిస్తుంది కాబట్టి ఎవ్వరికీ ముందే తెలిసే అవకాశం ఉండదు. దీనివల్ల అనవసర కేసులు తగ్గి ఆదాయపు శాఖపై పనిభారం తగ్గుతుంది. అప్పీళ్లు కూడా ఫేస్‌లెస్‌ అవుతాయి’ అని వివరించారు.


పన్ను చెల్లింపుదార్లలో మరింత విశ్వాసాన్ని నింపుతాయి

పరిశ్రమ సంఘాలు

ఆన్‌లైన్‌లో పన్ను మదింపు, ఆన్‌లైన్‌ ద్వారానే వివాదాల నివేదన, పన్ను చెల్లింపుదార్ల హక్కులు వంటి సంస్కరణలతో పన్నుల విధానంలో పారదర్శకత పెరుగుతుందని పరిశ్రమ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ సంస్కరణల వల్ల పన్ను చెల్లింపుదార్లకు పలు ప్రయోజనాలు కలుగుతాయని సీఐఐ ప్రెసిడెంట్‌ ఉదయ్‌ కోటక్‌ అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ సంకల్పం సాకారానికి కూడా దోహదం చేస్తుందని తెలిపారు. వ్యవస్థీకృత సంస్కరణల ప్రయాణంలో ఇది మరో మైలురాయి అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి అన్నారు. దేశంలో పన్న చెల్లింపుదార్లలో విశ్వాసాన్ని ఈ సంస్కరణలు మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.