close
‘ఎయిర్‌ కోస్టా’పై దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: విజయవాడ కేంద్రంగా ‘ఎయిర్‌ కోస్టా’ పేరుతో విమాన సర్వీసులు నిర్వహించిన ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌పై దివాలా ప్రక్రియ చేపట్టాలని ఎన్‌సీఎల్‌టీ అమరావతి బెంచ్‌ ఆదేశాలు ఇచ్చింది. జర్మనీ సంస్థ ఎంటీయూ మెయింటెనెన్స్‌ బెర్లిన్‌-బ్రాండెన్‌బర్గ్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐబీసీలోని సెక్షన్‌-9 ప్రకారం దివాలా ప్రక్రియ చేపట్టేందుకు ఎంఎస్‌ఎం రంజనిని ఐఆర్‌పీగా నియమించింది. పిటిషనర్‌ వాదన ప్రకారం ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, విమానాల లీజు సేవల నిమిత్తం ఎంటీయూ మెయింటెనెన్స్‌ లీజ్‌ సర్వీసెస్‌తో 2014లో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ఎంటీయూ మెయింటెనెన్స్‌ కెనడాతో మరొక ఒప్పందం చేసుకుంది. ఈ సేవలకు సంబంధించిన చెల్లింపులు చేయలేదనేది పిటీషనర్‌ అభియోగం. తర్వాత తాను బకాయి ఉన్న సొమ్మును వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకరించి దాన్ని కూడా పాటించలేదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తనకు రావలసిన సొమ్ము కోసం ఎంటీయూ మెయింటెనెన్స్‌ సంస్థ లండన్‌లోని హైకోర్టు ఆఫ్‌ జస్టిస్‌లోని కమర్షియల్‌ కోర్టును ఆశ్రయించారు. దానిపై కోర్టు ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌ను 24.60 లక్షల డాలర్లు, 19,400 పౌండ్లు దానిపై వడ్డీ చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోవటంతో ఎన్‌సీఎల్‌టీ-అమరావతి బెంచ్‌ను పిటీషనర్‌ ఆశ్రయించారు. పిటీషనర్‌ ఆరోపణలను, క్లెయిములను ఎన్‌సీఎల్‌టీ ముందు విచారణ సందర్భంగా ఎల్‌ఈపీఎల్‌ తిరస్కరించింది.  కానీ వివాదాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పిటీషనర్‌ వైపు మొగ్గు చూపింది.

అప్పీలు చేశాం
ఎన్‌సీఎల్‌టీ-అమరావతి బెంచ్‌ ఆదేశాలపై తాము వెంటనే అప్పీలుకు వెళ్లినట్లు ఎల్‌ఈపీఎల్‌ ఒక ప్రకటనలో వివరించింది. ఎంటీయూతో వివాదం కేవలం కాంట్రాక్టు పరమైనదేనని పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీలో ప్రస్తుత వివాదం ఎయిర్‌ కోస్టాకు సంబంధించింది మాత్రమేనని, ఈ ఉత్తర్వుల వల్ల ఎల్‌ఈపీఎల్‌ గ్రూపు సంస్థలు కానీ, వాటి వ్యాపారాలకు కానీ వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని ఎల్‌ఈపీఎల్‌ అధినేత లింగమనేని రమేష్‌ తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.