
మార్కెట్ సమీక్ష
బ్యాంకులు, ఐటీ షేర్లు డీలా
మదుపర్లు అప్రమత్తత పాటించడంతో సూచీలు స్వల్ప శ్రేణికి పరిమితమయ్యాయి. ఆర్థిక మందగమనంపై ఆందోళనలతో ప్రైవేటు బ్యాంకులు, ఐటీ, ఇంధన షేర్లకు అమ్మకాలు ఎదురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినప్పటికీ.. దేశీయ సెంటిమెంట్ మెరుగ్గా లేకపోవడం ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 71.84 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 40,431.08 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 40,542.40 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒకానొకదశలో 40,221.97 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 72.50 పాయింట్ల నష్టంతో 40,284.19 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 10.95 పాయింట్లు తగ్గి 11,884.50 దగ్గర స్థిరపడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 16 నష్టాలు చవిచూశాయి. యెస్ బ్యాంక్ 4.08%, బజాజ్ ఆటో 1.69%, హీరో మోటోకార్ప్ 1.61%, ఎం అండ్ ఎం 1.61%, ఏషియన్ పెయింట్స్ 1.30%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.28%, ఓఎన్జీసీ 1.22%, టీసీఎస్ 1.06%, బజాజ్ ఫైనాన్స్ 0.84% చొప్పున డీలాపడ్డాయి. భారతీ ఎయిర్టెల్ 4.06%, టాటా స్టీల్ 4.01%, సన్‌ఫార్మా 2.28%, పవర్‌గ్రిడ్ 1.79%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.13%, ఎస్బీఐ 0.99% మేర రాణించాయి. రంగాల వారీ సూచీల్లో యంత్ర పరికరాలు, వాహన, ఇందన, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, పరిశ్రమలు 0.68 శాతం వరకు డీలాపడ్డాయి. టెలికాం, లోహ, ఆరోగ్య సంరక్షణ, యుటిలిటీస్ 3.42% మేర పెరిగాయి. బీఎస్ఈలో 1397 స్క్రిప్‌లు ప్రతికూలంగా, 1169 షేర్లు సానుకూలంగాను ముగిశాయి. 205 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
మార్కెట్ కబుర్లు
* ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో మాల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ తమ వాటాల్ని విక్రయించకూడదంటూ సుప్రీం కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు గత శుక్రవారం పేర్కొనడంతో, ఈ కేసును త్వరితగతిన పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
* ప్రయాణికుల, సామూహిక రవాణా, సరకు రవాణా విభాగాల్లో విద్యుత్ వాహనాలను (ఈవీ) తయారు చేసేందుకు వాణిజ్య విద్యుత్ వాహనాలను రూపొందించే లిథియమ్ అర్బన్ టెక్నాలజీస్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకుంది.
* వెల్స్పన్ ప్లేట్స్ అండ్ కాయిల్స్ మిల్ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు లాప్టెవ్ ఫైనాన్స్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి ఆమోదం లభించింది.
* మైలాన్ లేబొరేటరీస్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో జి.చోడవరం వద్ద ఉన్న యూనిట్లో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలు చేసి కొన్ని అభ్యంతరాలు పసిగట్టింది. ఈ మేరకు ఆ సంస్థకు ‘హెచ్చరిక’ లేఖ జారీ చేసింది.