close
జులై-సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు (రూ.కోట్లలో)  

అధికారుల్లో సమన్వయ లోపం 

క్షేత్ర పర్యవేక్షణ తూతూమంత్రం

● పౌష్టికాహారంలో అవకతవకలు

అస్తవ్యస్తంగా ఐసీడీఎస్‌ పథం


ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం

న్యూస్‌టుడే, అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌) : జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఒక అడుగు ముందుకు... మూడు అడుగులు వెనక్కి అనే చందంగా తయారైంది. కీలకమైన పౌష్టికాహార పంపిణీలో భారీఎత్తున చేతివాటం సాగుతోంది. లబ్ధిదారుల బోగస్‌ సంఖ్యతో ప్రతి నెలా రూ.లక్షలు వెనకేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి జిల్లా స్థాయి దాకా ‘కమీషన్ల’ కక్కుర్తి ఒక తంతులా నడుస్తోంది. పేద పిల్లలు, గర్భిణి, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారాన్ని అక్రమార్కులు నొక్కేస్తున్నారు. తరచూ అక్రమాలు తెరపైకి వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత మూడేళ్లుగా అనేక అవినీతి బాగోతాలు ఆధారాలతో సహా నిరూపితమైనా చర్యలు శూన్యం. అధికారులు, ఉద్యోగుల మధ్య పంపకాలు నిర్విఘ్నంగా సాగటమే కారణం. ఏ ప్రాజెక్టు చూసినా పనితీరు దిగదుడుపే. క్షేత్ర పర్యవేక్షణ అటకెక్కించారు. జిల్లా అధికారులు, సీడీపీవోల మధ్య సమన్వయమే లేదు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఆకస్మిక తనిఖీ చేసినా మార్పు లేదు. నేడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అనంతపురంలో ఐసీడీఎస్‌ సమీక్ష నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

అక్రమాలు ఇలా...

గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారం పక్కదారి పట్టడం నిత్యకృత్యమైంది. గుడ్ల సైజు తగ్గడం. కాలం చెల్లిన పాల సరఫరా తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోరు. గుత్తేదారులతో కుమ్మక్కై ఈ చేతివాటానికి పాల్పడుతున్నారు. కదిరి, గుత్తి, సీకేపల్లి, ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర.. వంటి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరగ్గా.. కొన్నింటిపై ‘ఈనాడు’ వరస కథనాలు ప్రచురించింది. కొన్ని ప్రాజెక్టుల్లో విచారణలు చేసినా ఫలితం లేదు. కాసులకు కక్కుర్తిపడి నివేదికలను  సైతం తొక్కిపెట్టారు. అమృతహస్తం పథకంలో చేతివాటం సరేసరి. వంటా వార్పు ఉండదు. సరకులు ఇంటికి ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, గ్యాస్‌.. వంటి వాటికి బిల్లులు పెడుతున్నారు. ఇదొక తంతు నడుస్తోంది.

పడకేసిన పరిపాలన..

పీడీ కార్యాలయంలోనూ అంతే. ఇక్కడ సమన్వయం ఉండదు. సీడీపీవో కార్యాలయాలు, పీడీ కార్యాలయానికి అసలు పొసగదు. నివేదికలు సకాలంలో పంపరు. ప్రగతి నివేదికలన్నీ అస్తవ్యస్తమే. క్షేత్ర స్థాయిలో కీలకమైన సూపర్‌వైజర్లు 206 మంది ఉండాలి. కానీ... కేవలం 83 మందే పని చేస్తున్నారు. వీరు కూడా సమర్థంగా పని చేస్తున్న దాఖలాలు లేవు. ఇక సీడీపీవోలు ఇళ్లకు... కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు 621 ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఏడాది కిందట నోటిఫికేషన్‌ ఇచ్చినా కొలిక్కి రాలేదు.

ప్రాధాన్యాలూ పట్టవే...

జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తల్లీబిడ్డ మరణాలు కూడా ఎక్కువే. వీటిని తగ్గించే ప్రయత్నాలు తూతూమంత్రమే. ఐసీపీఎస్‌, సఖీ, బాల సదన్‌, శిశుగృహ, మహిళా సదన్‌, ఉజ్వల కేంద్రాలు... వంటి వాటి పనితీరుపై సమీక్షలు లేవు. అందుకే అక్కడ పని చేసే ఉద్యోగులు వచ్చామా.. వెళ్లామా రీతిలో ప్రవర్తిస్తున్నారు. బాలసదన్‌లో బాలికలు తప్పిపోతున్న ఘటనలు అడపాదడపా చోటుచేసుకున్నా చర్యలు ఉండవు.

తప్పులు సహించేది లేదు - చిన్మయదేవి, పీడీ, ఐసీడీఎస్‌

మా శాఖలో జరిగే కార్యక్రమాల నిర్వహణపై పరిశీలన ఉంచాం. తరచూ తనిఖీలు చేస్తున్నాం. జిల్లా అధికారులు కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్తున్నారు. కొన్ని రకాల పోస్టులు ఖాళీగా ఉన్న మాట నిజమే. త్వరలో భర్తీ చేస్తాం. పౌష్టికాహార వ్యవహారంలో కొన్ని తప్పులు దొర్లాయి. ఇవన్నీ గతంలోనే. ఇప్పుడు పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఏ చిన్న తప్పు చేసినా సహించేది లేదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.