close
స్వల్పకాలంలో ముందుకే!

సమీక్ష : వృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వరుస సంస్కరణలు ప్రకటించడంతో గత వారం సూచీలు లాభాలతో ముగిశాయి. దేశీయంగా చూస్తే.. గత వారం ప్రారంభంలో నష్టపోయిన మార్కెట్లు.. ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో దూసుకెళ్లాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యానికి లోపలే నమోదైంది. ఆగస్టులో ఎగుమతులు 6.05 శాతం తగ్గి 26.13 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశంలో రేట్ల కోత ఉండొచ్చన్న ఆశలతో రంగం, షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడంతో మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టాయి. అక్టోబరు ప్రారంభంలో అమెరికా- చైనా వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావొచ్చన్న అంచనాలు ప్రపంచ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు క్షేత్రంపై డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో పరుగులు తీశాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.68 శాతం లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.79 శాతం పెరిగి 11,274 పాయింట్ల దగ్గర స్థిరపడింది. మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ, యంత్ర పరికరాల షేర్లు రాణించగా, ఐటీ, విద్యుత్‌, స్థిరాస్తి స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.3375 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు, ఫండ్ల కొనుగోళ్లు రూ.4822 కోట్లుగా నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) రూ.4193 కోట్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:1గా నమోదు కావడం..
వారం చివర్లో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా
గత వారం సెన్సెక్స్‌కు 36,100 పాయింట్ల వద్ద మద్దతు లభించడంతో, లాభాలతో ముగిసింది. 37650- 37850 పాయింట్ల శ్రేణి ఎగువన ముగియడంతో.. స్వల్పకాలంలో లాభాల జోరు కొనసాగే అవకాశం ఉంది. సమీపకాలంలో సెన్సెక్స్‌ 200 రోజుల కదలికల సగటు అయిన 37535 పాయింట్ల వద్ద మార్కెట్‌కు మద్దతు లభించొచ్చు.

ప్రభావిత అంశాలు
దేశీయ పరిణామాలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా చూస్తే.. కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతో స్వల్పకాలంలో మార్కెట్‌ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. పన్నుల కోతతో ద్రవ్యలోటుపై పడే ప్రభావాన్ని సైతం మదుపర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. గత శుక్రవారం జీఎస్‌టీ మండలి తగ్గించిన పన్ను రేట్ల నేపథ్యంలో రంగం, షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ముడిచమురు ధరలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. సౌదీపై దాడుల తర్వాత చమురు ధరలు 7 శాతం వరకు పెరిగాయి. చమురు ధరలు ఇంకా పెరిగితే.. మన మార్కెట్ల లాభాలకు అడ్డుకట్ట పడొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల ధోరణి వంటి వాటి నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా- చైనా వాణిజ్య పరిణామాలు కీలకం కానున్నాయి. బ్రెగ్జిట్‌కు సంబంధించిన పరిణామాలపై మదుపర్లు ఓ కన్నేయొచ్చు. 26న అమెరికా రెండో త్రైమాసిక జీడీపీ, 30న బ్రిటన్‌ రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి.

తక్షణ మద్దతు స్థాయిలు: 37,535, 37,000, 36,712;
తక్షణ నిరోధ స్థాయిలు: 38,378, 38,700, 39,204
స్వల్పకాలంలో మార్కెట్ల లాభాల జోరు కొనసాగొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.