close
బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ సంస్థలకే మేలు

ఔషధ, ఐటీ రంగాలకు ప్రయోజనం లేనట్లే
కార్పొరేట్‌ పన్ను తగ్గింపుపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ నివేదిక

దిల్లీ: కార్పొరేట్‌ పన్నును 25.17 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. ఐటీ, ఔషధ రంగాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేటు తక్కువగానే ఉన్నందున స్పష్టమైన ప్రయోజనాలు కనిపించకపోవచ్చని తెలిపింది.

* ‘కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు వరుసగా 48.2, 18 శాతం సంచిత వార్షిక వృద్ధి రేటును (సీఏజీఆర్‌) నమోదు చేస్తాయి. ఇంతకుముందు ఇవి వరుసగా 42.2, 12.2 శాతంగా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి చేర్చిన కొత్త నిబంధనతో, దేశీయ కంపెనీలు 25.17 శాతం పన్ను రేటు (సర్‌ఛార్జి, సెస్‌లు కలిపి) ఆప్షన్‌ను ఎంచుకుంటే, సదరు సంస్థలకు పన్ను మినహాయింపులు/ప్రోత్సాహకాలు ఉండవు. ఇదే సమయంలో ఆ సంస్థలు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌)ను చెల్లించాల్సిన అవసరం లేదు’.
* బ్యాంకులు 11-13 శాతం మేర అధిక లాభాల్ని ప్రకటించే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాంటి పెద్ద బ్యాంకులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. భారీ యంత్ర పరికరాల కంపెనీలకొస్తే ప్రస్తుత పన్ను రేటు 25-34 శాతం మధ్య ఉంది. పన్ను తగ్గింపుతో మధ్య స్థాయి (మిడ్‌క్యాప్‌) కంపెనీలపై ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సిమెంట్‌ కంపెనీలకు ఇప్పటి వరకు అధిక పన్ను రేటు ఉండటం వల్ల, ఇప్పుడు భారీ ప్రయోజనం కలుగుతుంది. మన్నికైన వినిమయ వస్తువుల కంపెనీలకు కూడా పన్ను తగ్గింపు ప్రయోజనం కలుగుతుంది. హోటళ్లు, లాజిస్టిక్స్‌, మద్యం, లోహ, గనుల రంగాలకు కూడా లాభం కలుగుతుంది’.
* ‘ఔషధ కంపెనీలకు ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌) పన్ను రహిత ప్రయోజనాలు, ఆర్‌అండ్‌డీ ప్రయోజనాలతో పాటు ఉపయోగించని మ్యాట్‌ క్రెడిట్‌లతో పన్ను రేటు తగ్గించిన తర్వాత కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రభావం ఉండకపోవచ్చు’.

రూ.37,000 కోట్ల పన్ను ప్రయోజనం: క్రిసిల్‌
కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో 1,000 అగ్ర నమోదిత కంపెనీలు రూ.37,000 కోట్ల పన్ను ప్రయోజనం పొందే అవకాశం ఉందని క్రిసిల్‌ నివేదిక అంచనా వేసింది. ఇందులో చమురు-గ్యాస్‌, ఆర్థిక సేవల కంపెనీలే భారత్‌లో వివిధ సంస్థలు చెల్లించే పన్నుల్లో మూడో వంతు పన్నులు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.