Eenadu Online Edition Business News - EENADU
close
20-30 లక్షల విద్యుత్‌ వాహనాలు రోడ్డెక్కాలి 

అప్పుడే వినియోగదారుల్లో అవగాహన పెరిగి భ్రమలు తొలుగుతాయ్‌ 
ఆరేళ్లు కాకుండా రెండేళ్లలోనే ప్రభుత్వం ప్రోత్సాహకాలన్నీ ఇవ్వాలి 
ప్రాధాన్య రుణ రంగాల్లోనూ చేర్చాలి 

ఇంటర్వ్యూ 


హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సొహిందర్‌ గిల్‌

విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కంపెనీలు కూడా విద్యుత్‌ వాహనాల తయారీదిశగా అడుగులు వేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలైతే ఈ తరహా వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి కూడా. తాజాగా హీరో ఎలక్ట్రిక్‌ ఇండియా రెండు విద్యుత్‌ బైకులను విడుదల చేసింది. ఈ సందర్భంగా బైకుల ప్రత్యేకతలను కంపెనీ సీఈఓ సొహిందర్‌ గిల్‌ వివరించారు. వివిధ అంశాలపై ఆయన ఈటీవీ భారత్‌కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

? హీరో ఎలక్ట్రిక్‌ ఇండియా విడుదల చేసిన రెండు విద్యుత్‌ వాహనాల వివరాలు చెబుతారా.. 
సొహిందర్‌: తొలిసారి భారత్‌లో.. అది కూడా బెంగళూరులో రెండు విద్యుత్‌ వాహనాలను విడుదల చేశాం. బెంగళూరులోనే ఎందుకంటే.. విద్యుత్‌ వాహనాలకు ఓ హబ్‌గా దీనిని మేం భావిస్తున్నాం. అందుకే ఇక్కడే వీటిని మొట్టమొదట ఆవిష్కరించాం. ఇక్కడ నుంచి దఫాలవారీగా దేశవ్యాప్తంగా పరిచయం చేస్తాం. విద్యుత్‌ వాహనాల కొనుగోలు విషయంలో ప్రస్తుతం వినియోగదార్లలో నెలకొన్న భ్రమలను తొలగించడమే ఈ రెండు బైకుల విడుదల వెనక మా ప్రధాన ఉద్దేశం. ఒక వినియోగదారుడు షోరూంకి వచ్చి.. ఈ బైకులను చూసి అమితంగా ఇష్టపడాలి. ఎందుకంటే దానిపై కూర్చుంటే శబ్దం ఉండదు.. పొగ రాదు.. చాలా సున్నితంగా, అనువుగా ఉంటుంది. నగర రహదారులపై సగటు వేగానికి మించి ఇది నడుస్తుంది. మంచి పికప్‌తో గంటకు 40 కి.మీ వేగంతో వెళ్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 110- 115 కి.మీ వరకు వెళ్లొచ్చు. పూర్తి ఛార్జింగ్‌కు నాలుగున్నర గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రత్యేకతలన్నింటితో ఈ బైకులను అభివృద్ధి చేశాం. ఈ బైకును కొనడం ప్రయోజనమేనా, ఇక్కడి రోడ్లకు ఇది అనువుగానే ఉంటుందా అని వినియోగదారుడు మదిలో నెలకొన్న ప్రశ్నలకు వీటితో సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను.

? పెట్రోలు వాహనాల కోసం బంకులు అనేకం ఉన్నాయి. విద్యుత్‌ వాహనాల విషయానికొస్తే ఆ మౌలిక వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే.  వీటి ఛార్జింగ్‌ కోసం ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న ప్రస్తుతం వినియోగదారులను వెంటాడుతోంది.. 
విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాలంటే నాలుగేళ్లు పట్టొచ్చని నా అభిప్రాయం. అయితే మా బైకుల విషయంలో ఛార్జింగ్‌ సమస్యకు విభిన్న పరిష్కారాన్ని చూపాం. అదేమిటంటే.. బ్యాటరీలను ఎక్కడి కంటే అక్కడికి తీసుకుని వెళ్లే (పోర్టబిలిటీ) వెసులుబాటు ఉండడం. ఈ బైకుల్లో రెండు బ్యాటరీలు ఉంటాయి. అవి కూడా తేలికపాటివి. ఆఫీసుల్లో, ఇంట్లో మొబైళ్ల ఛార్జింగ్‌ మాదిరి ఎప్పుడంటే అప్పుడు వీటిని ఛార్జి చేసుకోవచ్చు. అరగంట ఛార్జ్‌ చేసుకుంటే చాలు పదిహేను కిలో మీటర్ల వరకు వెళ్లొచ్చు. ఛార్జింగ్‌ స్టేషన్లలో రెండు గంటల పాటు నిల్చునే దాని కంటే ఇది మేలే కదా. అందుకే స్వల్పకాలం పాటు ఈ సమస్యకు ఇది ఓ తాత్కాలిక పరిష్కారమని మేం అనుకుంటున్నాం.

? విద్యుత్‌ వాహనాల వల్ల ప్రయోజనాలు అధికమని, వాతావరణ కాలుష్యానికి వీటితోనే పరిష్కారం దొరుకుతుందని కంపెనీలు అంటున్నాయి. మరి రోడ్లపై చూస్తే ఈ వాహనాలు పెద్దగా కనిపించడం లేదు 
మాట్లాడటం వేరు.. కొనడం వేరు. పెట్రోలు, విద్యుత్‌ వాహనాల్లో మీరు దేనిని ఎంపిక చేసుకుంటారని ఎవరైనా నన్ను అడిగితే? అసలు నేను ఎందుకు విద్యుత్‌ వాహనాన్ని కొనాలని ముందు ప్రశ్నిస్తాను. పర్యావరణం గురించి ఆలోచించేందుకు అందరూ పర్యావరణవేత్తలు కాదు కదా. పోనీ విద్యుత్‌ వాహనాలు ఏమైనా రహదారులపైనా తిరుగుతున్నాయా? అంటే అది కూడా అంతంతే. అలాంటప్పుడు వినియోగదారులకు వీటిపై సానుకూల భావన ఎక్కడ ఉంటుంది. అందుకే విద్యుత్‌ వాహనాలపై అవగాహన పెరగాలి. కనీసం 20-30 లక్షల వరకు విద్యుత్‌ వాహనాలు రోడ్లపై తిరగాలి. అప్పుడే అవగాహన పెరుగుతుంది. వీటిని కొన్న వ్యక్తికి ఆరు నెలల తర్వాత ఒక అద్భుతమైన వస్తువును కొన్నామనే భావన ఏర్పడాలి. తనకే కాదు.. సమాజానికి, దేశానికి, పర్యావరణానికి మేలు చేశాననే అభిప్రాయం కలగాలి. అలాంటి రోజు కోసమే మేం ఎదురుచూస్తున్నాం.

? వాహన పరిశ్రమకు ప్రభుత్వం అందివ్వాల్సిన ప్రోత్సాహకాలపై మీ నుంచి ఇంకా ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? 
విద్యుత్‌ వాహన పరిశ్రమ సంఘానికి నాయకుడిగా నేను తప్పకుండా ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వాన్ని డిమాండు చేస్తాను. వీటిల్లో మొదటిది.. ప్రభుత్వం ఆరేళ్లలో ఇవ్వాలనుకుంటున్న ప్రోత్సాహకాలను రెండేళ్లలో ఇవ్వాలి. తద్వారా విద్యుత్‌, పెట్రోలు వాహనాల మధ్య ధరల వ్యత్యాసం తగ్గించాలి. విద్యుత్‌ వాహనాలతో ఇంధన వ్యయాలు ఆదా అవుతుందనే విషయం కంటే కూడా ధర ఎక్కువనే విషయంపైనా వినియోగదారుడు దృష్టి సారిస్తాడు. కనీసం రెండేళ్ల వరకైనా పెట్రోలు, విద్యుత్‌ వాహనాల ధరలు ఒకేలా ఉంటే.. విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు వినియోగదార్లు మొగ్గుచూపుతారు. ఎక్కువ వాహనాలు రోడ్లపైకి వస్తే.. వాటిపై అవగాహన పెరుగుతుంది. విద్యుత్‌ వాహనాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలిచ్చేలా ఒత్తిడి పెంచాలి. ప్రాధాన్య రంగాల్లో వీటిని చేర్చాలి. చివరగా.. కొరియర్‌, సరకు రవాణా సేవలు అందించే సంస్థలు వినియోగిస్తున్న వాహనాల్లో ఏడాదికి 20 శాతం వాహనాలనైనా తప్పక విద్యుత్‌ వాహనాలుగా మార్చేలా నిర్ణయం తీసుకోవాలి.

రెండు కొత్త విద్యుత్‌ స్కూటర్లు

హీరో ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ స్కూటర్లు ఆప్టిమా ఈఆర్‌, ఎన్‌వైఎక్స్‌ ఈఆర్‌లో కొత్త శ్రేణిని విపణిలోకి ప్రవేశపెట్టింది. ఆప్టిమా ఈఆర్‌ ధర రూ.68,721, ఎన్‌వైఎక్స్‌ ఈఆర్‌ ధర రూ.69,754 (ఎక్స్‌-షోరూమ్‌ ఇండియా)గా నిర్ణయించారు. పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 100 కి.మీ ప్రయాణం చేయొచ్చని, బ్యాటరీపై మూడేళ్ల వారెంటీ ఇస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

? విద్యుత్‌ వాహనాల విభాగంలో హీరో ఎలక్ట్రిక్‌ ఓ దిగ్గజ సంస్థగా ఉంది. అటు చూస్తే విద్యుత్‌ వాహనాల విభాగంలో చాలానే అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి 
ఈ రంగంలో అంకురాలు అడుగుపెడుతుండటాన్ని స్వాగతిస్తున్నాను. తమ ఆలోచనలను, కలలను అద్భుతాలుగా ఆవిష్కరించి, వినూత్న ఉత్పత్తులను తీసుకొచ్చే దిశగా ఈ అంకురాలు పనిచేస్తున్నాయి. ఏడాదికి 2 కోట్ల వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చగలగాలి. దిగ్గజ కంపెనీలకు అంకురాలు కూడా తోడైతే ఇది సులభం అవుతుంది. ఆవిష్కరణపరంగా, సాంకేతికతపరంగా వినూత్న మార్పులను తీసుకొని రావడంలో అంకురాలు కీలక పాత్ర పోషిస్తాయని మా విశ్వాసం. అలాంటప్పుడు మేం అంకురాలతో కలిసి ఎందుకు పనిచేయకూడదు.

- బెంగళూరు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.