Eenadu Online Edition Business News - EENADU
close
ఆర్థిక మందగమనం తీవ్ర ఆందోళనకరం 

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ 
సరికొత్త సంస్కరణలు కావాలి 
దిల్లీ

ర్థిక వ్యవస్థ మందగమనం తీవ్ర ఆందోళనకరమని, పరిష్కారానికి నూతన సంస్కరణలు అవసరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పూర్వ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. విద్యుత్తు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రంగాల సమస్యలు సత్వరం పరిష్కరించాల్సి ఉందని, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు సరికొత్త సంస్కరణలు అవసరమని తెలిపారు. ప్రైవేటురంగ విశ్లేషకుల నుంచి వృద్ధిరేటు అంచనాలు వేర్వేరుగా ఉంటున్నాయని, వీటిల్లో చాలావరకు ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగా ఉంటున్నాయని రాజన్‌ గుర్తు చేశారు. మొత్తంమీద ఆర్థిక వ్యవస్థ మందగమనం తీవ్ర ఆందోళనకరమని సీఎన్‌బీసీ టీవీ 18తో అన్నారు.

వివిధ రంగాలు ఇబ్బంది పడుతున్నా, వాహన రంగం మాత్రం 2 దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి విదితమే. వాహన, అనుబంధ రంగాల్లో వేలసంఖ్యలో ఉద్యోగాలు తొలగిస్తున్నారని, స్థిరాస్తి రంగంలో అమ్ముడుకాకుండా నిర్మాణాలు భారీగా మిగిలిపోతున్నాయని, ఎఫ్‌ఎంసీజీ రంగంలో విక్రయాలు తగ్గుతున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆయా రంగాల నుంచి ఉద్దీపనల కోసం విజ్ఞప్తులు అధికమవుతున్నాయని రాజన్‌ గుర్తు చేశారు. ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమని తెలిపారు.

ప్రస్తుతం కంటే 2-3 శాతం వృద్ధి పెంచాలంటే.. 
‘ప్రస్తుతం కంటే వృద్ధిరేటును మరో 2-3 శాతం పెంచాలంటే, ఏ విధంగా దేశాన్ని ముందుకు నడిపించాలనే విషయంపై అవగాహన ఉండాలి. విద్యుత్తు, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లో సత్వరం సమస్యలు పరిష్కరించాలి. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు వచ్చేలా దీర్ఘకాలిక దృక్పథం కలిగిన సంస్కరణలూ కావాలి. ప్రోత్సాహకాలు, ఉద్దీపనలు తాత్కాలికంగా మాత్రమే ఉపకరిస్తాయి. ‘2011-12 నుంచి 2016-17 వరకు జీడీపీని 2.5 శాతం అధికంగా గణించారన్న మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ వాదనలపై మనం దృష్టి కేంద్రీకరించాలి. జీడీపీని మనం ఎలా గణిస్తున్నామో, స్వతంత్ర నిపుణుల పర్యవేక్షణ ఉండాలి’ అని రాజన్‌ విశదీకరించారు.

బ్యాంకుల స్థితి ఫరవాలేదు 
2008 ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యాంకుల స్థితి బాగానే ఉందని రాజన్‌ తెలిపారు.2008లో పరపతి విధానం కీలకమైంది. ఇప్పుడు మెరుగైన విధానం కాదు, ప్రత్యేక విధానం కావాలి. మరో భారీ ఆర్థిక సంక్షోభం వస్తుందని భావించడం లేదు. ఒకవేళ వచ్చిందంటే, అందుకు మార్గాలు కూడా వేరేవి అవుతాయి. అందువల్ల గతంలో ఎదురైన సమస్యలు పెరగకుండా చూద్దామనుకుంటే సరిపోదు’ అని స్పష్టం చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.