Eenadu Online Edition Business News - EENADU
close
చేనేత వస్త్రాలకు మినహాయింపు లేదు

? 15 నెలల క్రితం మేం కలంకారి, చేనేత వస్త్రాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించాం. తొలి ఏడాది మా టర్నోవరు దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుంది. మేం జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందా? జౌళి మంత్రిత్వశాఖ నుంచి నాకు మహిళా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద ధ్రువీకరణ పత్రం ఉంది. ఈ ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఏమైనా ఉందా

- తేజోమూర్తి పింజల

మహిళా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి, కలంకారి/ చేనేత వస్త్రాలకు జీఎస్‌టీ మినహాయింపునకు సంబంధించి జీఎస్‌టీ చట్టంలో ఎటువంటి నిబంధనలు లేవు. అందువల్ల జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. తొలి ఏడాది మీ వార్షిక టర్నోవరు రూ.20 లక్షలకు మించినందున, మీరు తెలంగాణలోనే వ్యాపారం చేస్తుంటే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేస్తుంటే కనుక ఈ పరిమితి రూ.40 లక్షలు. అంటే మీ వార్షిక టర్నోవరు రూ.40 లక్షలు మించితేనే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట.

? తంబోలా టికెట్‌కు జీఎస్‌టీ వర్తిస్తుందా? ఒకవేళ వర్తిస్తే.. ఏ రేటు ప్రకారం చెల్లించాలి. మా వస్తువుల అమ్మకాలను పెంచుకునేందుకు బహుమతి కూపన్‌గా తంబోలా టికెన్‌ను ఇస్తే కూడా జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందా

- బి.జె.రెడ్డి, ప్రొద్దుటూరు

నోటిఫికేషన్‌ సంఖ్య: 1/2017, తేదీ: 28-06-2017లోని షెడ్యూల్‌- 4, ఐటమ్‌ సంఖ్య 229 ప్రకారం తంబోలాకు 28 శాతం జీఎస్‌టీ రేటు వర్తిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకునేందుకు తంబోలా టికెట్లను ఉపయోగిస్తే కూడా 28 శాతం జీఎస్‌టీ రేటు ప్రకారం చెల్లించాల్సిందే.

? మున్సిపల్‌ ఇంజినీర్‌ అండ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కోసం అద్దెకు తీసుకున్న కారుకు ప్రతి నెల రూ.35,000 కాంట్రాక్టరుకు చెల్లిస్తున్నాం. దీనిపై 18 శాతం జీఎస్‌టీని అడుగుతున్నారు. ఆ కాంట్రాక్టరు వార్షిక టర్నోవరు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. కారు అద్దె రుసుముకు జీఎస్‌టీ వర్తిసుందా? లేదా

- వెంకట సుబ్బారావు

సెంట్రల్‌ ట్యాక్స్‌ రేట్‌ నోటిపికేషన్‌ సంఖ్య: 11/2017, తేదీ 28-06-2017, ఎంట్రీ సంఖ్య: 18(7), దీనిలోని సవరణల ప్రకారం.. ఏదేని ఒక వాహనం ద్వారా ప్రయాణికులను రవాణా చేసినప్పుడు జీఎస్‌టీ 18 శాతం వర్తిస్తుంది.  కాంట్రాక్టరు వార్షిక టర్నోవరు రూ.2 కోట్ల వరకు ఉంటుందని మీరు చెప్పినందున, ఆయనకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఉంటుందనే అనుకుంటున్నాను. అందువల్ల పైన చెప్పిన విధంగా 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

? మా కంపెనీ వాణిజ్య కార్యకలాపాలకు భవనాలను నిర్మించి, అద్దెకిస్తుంటుంది. అయితే ఈ భవనాల నిర్మాణానికి వాడిన సామగ్రిపై చెల్లించిన పన్నును ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద తిరిగి పొందొచ్చనే విషయం ఈ మధ్యనే మాకు తెలిసింది. నిజంగానే అలా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందే వీలుందా

- రాజు సూర్యవంశీ

అవును.. మీరు విన్నది నిజమే. ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకు ఇచ్చే ఉద్దేశంతో నిర్మించే భవనాలకు వాడే సామగ్రిపై చెల్లించిన పన్నును మీరు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌గా తిరిగి పొందొచ్చు. అయితే ఐటీసీ క్లెయిమ్‌ చేసుకోవడానికి ముందు మీ రాష్ట్రంలో ఒడిశా హైకోర్టు తీర్పు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని ఓ న్యాయవాదిని కలిసి తెలుసుకోండి.

? కొన్ని వ్యయాలకు రివర్స్‌ ఛార్జీ పద్ధతిలో జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందనే విషయం నాకు తెలియదు. అందుకే 2017-18 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో రివర్స్‌ ఛార్జీ కింద పన్ను చెల్లించలేదు. ఇప్పుడు ఆ పన్ను బకాయిలను చెల్లించాలని అనుకుంటున్నాం. ప్రస్తుత రిటర్న్‌లో ఆ వివరాలు పొందుపరిచి మేం పన్ను చెల్లించవచ్చా? లేదంటే పన్ను చెల్లించేందుక వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా

- ఎ.సాయారెడ్డి

2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివర్స్‌ ఛార్జీ కింద చెల్లించాల్సిన పన్నును ప్రస్తుత నెల రిటర్న్‌లో చూపించలేం. 2017-18 ఆర్థిక సంవత్సరానికి మీరు వార్షిక రిటర్న్‌లను 2019 ఆగస్టు 31న లేదంటే ఆ లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వార్షిక రిటర్న్‌లో రివర్స్‌ ఛార్జీ పన్ను బకాయిలను పొందుపరిచి, వడ్డీతో కలిపి పన్ను చెల్లించొచ్చు. అయితే ఇప్పటికే 2017-18 వార్షిక రిటర్న్‌ను దాఖలు చేసినట్లయితే, జీఎస్‌టీ డీఆర్‌సీ-03 ఫారం ద్వారా పన్ను బకాయిలు చెల్లించొచ్చు. పన్ను చెల్లించాక ఆ విషయాన్ని మీ పరిధిలోని జీఎస్‌టీ అధికారికి తెలియజేయండి.

? పాఠశాలలకు/వాణిజ్య కార్యకలాపాలకు భవనాలను అద్దెకిస్తే ఆ అద్దెపై జీఎస్‌టీ మినహాయింపు ఉంటుందని 2019 ఆగస్టు 7న ఈనాడులో ప్రచురితమైన జీఎస్‌టీ ప్రశ్నలు- సమాధానాల్లో మీరు వెల్లడించారు. అయితే వాణిజ్య కార్యకలాపాలకు ఇచ్చిన భవనాల ద్వారా రూ.20 లక్షల వరకు అద్దె వస్తుంటే జీఎస్‌టీ కట్టనక్కర్లేదని కొన్ని రోజుల క్రితం నేను అడిగిన ఓ ప్రశ్నకు మీరు బదులిచ్చారు. ఇందులో ఏది సరైనదో తెలియజేయగలరు.

- పి.వెంకటేశ్వరరావు

భవనాలను పాఠశాలలకు అద్దెకిస్తే జీఎస్‌టీ మినహాయింపు ఉంటుందని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆగస్టు 7న ప్రచురితమైన ప్రశ్నలు- సమాధానాల్లో నేను పాఠశాలలకు అద్దెకిస్తే జీఎస్‌టీ వర్తిస్తుందనే బదులిచ్చాను. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోనంత వరకు రూ.20 లక్షల దాకా అద్దెలపై జీఎస్‌టీ మినహాయింపు ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీరు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తీసుకుంటారో.. జీఎస్‌టీ మినహాయింపునకు సంబంధించి కనీస పరిమితి నిబంధనలు వర్తించవు.

? ఈ ఏడాది జూన్‌లో నా స్నేహితుడు ఒక ఫ్లాటు బుక్‌ చేసుకున్నారు. ఫ్లాటు విలువ రూ.60 లక్షల వరకు ఉంటుంది. అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులపై 5 శాతం జీఎస్‌టీ కట్టాలని నిర్మాణదారు అడుగుతున్నారు. మా స్నేహితుడు అడ్వాన్స్‌ డబ్బులపై జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుందా? లేదంటే ఫ్లాటును స్వాధీనం చేశాక మొత్తం ఫ్లాటు ధరపై చెల్లించాలా? అసలు 5 శాతం జీఎస్‌టీ రేటు సరైనదేనా? కాదా

- ప్రేమ్‌నాధ్‌ డేగల

మీ స్నేహితుడి ఫ్లాటు విలువ రూ.60 లక్షలు చెప్పారు. అంటే ఇది రూ.45 లక్షలు కంటే ఎక్కువే కనుక అందుబాటు గృహం కిందకు రాదు. అందువల్ల జీఎస్‌టీ చట్టంలోని నిబంధనల ప్రకారం.. 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. అడ్వాన్స్‌ డబ్బులతో కలిపి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్మాణదారు మీకు పన్ను రశీదు ఇచ్చిన తర్వాతే జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుంది. సాధారణంగా ఫ్లాటును స్వాధీనం చేసే సమయంలోనే నిర్మాణదారు పన్ను రశీదు ఇస్తుంటారు. ఒకవేళ నిర్మాణదారు అడ్వాన్స్‌పై పన్ను చెలిస్తే.. ఆ చెల్లించిన పన్ను మొత్తాన్ని పన్ను రశీదు ఇచ్చిన సమయంలో నిర్మాణదారు మినహాయించుకొని, మిగతా మొత్తాన్ని ప్రభుత్వానికి ఆయన కట్టాల్సి ఉంటుంది.

మీ సందేహాలు పంపండి 
జీఎస్‌టీకి సంబంధించి మీ సందేహాలు మాకు పంపించండి..  
మీ సందేహాలు  ఎలాంటివైనా సరే అవి క్లుప్తంగాను, సరళంగాను ఉండాలి.. మా చిరునామా  

eenadubusinessdesk@gmail.com; businessdesk@eenadu.net

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.