close
ఆరంభ జోరుకు కళ్లెం 

సూచీలకు స్వల్ప లాభం 
బ్యాంకింగ్‌, వాహన షేర్లు డీలా 


మార్కెట్‌ సమీక్ష

సూచీల ఆరంభ జోరుకు కళ్లెం పడింది. చివరి గంటన్నర ట్రేడింగ్‌లో వాహన, బ్యాంకింగ్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటించొచ్చన్న ఆశలతో ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్లు పరుగులు తీశాయి. మాంద్యంపై భయాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొట్టిపారేయడం కలిసొచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 29 పైసలు తగ్గి 71.43 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు సానుకూలంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 37,485.92 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజులో అధిక భాగం లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 37,718.88 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో 37,358.49 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 52.16 పాయింట్ల లాభంతో 37,402.49 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 6.10 పాయింట్లు పెరిగి 11,053.90 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,037.85- 11,146.90 పాయింట్ల మధ్య కదలాడింది. 

తడబడిన స్పందన స్ఫూర్తి: స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ షేరు స్టాక్‌ మార్కెట్లలో నమోదైన తొలిరోజే తడబడింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధరైన రూ.856తో పోలిస్తే 3.73 శాతం తక్కువగా రూ.824 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.865 వద్ద గరిష్ఠాన్ని, రూ.690 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 0.89 శాతం నష్టంతో రూ.848.40 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో 0.96 శాతం తగ్గి రూ.847.80 దగ్గర స్థిరపడింది. బీఎస్‌ఈలో 4.72 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 46 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయి. తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5,444.78 కోట్లుగా నమోదైంది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 లాభాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 2.66%, టెక్‌ మహీంద్రా 1.84%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.40%, ఎల్‌ అండ్‌ టీ 1.30%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.15%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.01%, ఎన్‌టీపీసీ 0.89% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. యెస్‌ బ్యాంక్‌ 3.46%, పవర్‌గ్రిడ్‌ 2.01%, ఓఎన్‌జీసీ 1.48%, ఎస్‌బీఐ 1.46%, ఎం అండ్‌ ఎం 1.36%, హీరో మోటోకార్ప్‌ 1.32% మేర నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు, యంత్ర పరికరాలు, ఆరోగ్య సంరక్షణ, ఇంధన, ఐటీ 1.57% వరకు రాణించాయి. చమురు- గ్యాస్‌, వాహన, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీలు మాత్రం 0.59% వరకు పడ్డాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.