close
మార్కెట్లకు మళ్లీ పండగే!

కార్పొరేట్‌ పన్ను కోతతో కొనసాగనున్న జోరు
యంత్ర పరికరాలు, తయారీ షేర్లు రాణించొచ్చు
మోదీ అమెరికా పర్యటనపై దృష్టి
జీఎస్‌టీ మండలి నిర్ణయాలు సానుకూలం

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారం ప్రకటించిన ఉద్దీపనలతో స్టాక్‌ మార్కెట్‌ జోరు కొనసాగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్‌ పన్ను కోతతో యంత్ర పరికరాలు, తయారీ, విదేశీ నేపథ్యం ఉన్న కంపెనీలు మరో 10 శాతం వరకు లాభపడొచ్చని అభిప్రాయపడుతున్నారు. విదేశీ మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు దిగే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై మదుపర్లు దృష్టి పెట్టనున్నారు. గత వారం వెలువడిన జీఎస్‌టీ మండలి నిర్ణయాలు కూడా సానుకూలతలు తెచ్చిపెట్టొచ్చని చెబుతున్నారు. ద్రవ్యలోటు లక్ష్యంలో ఎటువంటి మార్పు చేయడం లేదని ఆదివారం ఆర్థిక మంత్రి మరోసారి భరోసా ఇవ్వడం కలిసిరావచ్చు. ఈ వారం నిఫ్టీ 11200- 11600 పాయింట్ల శ్రేణిలో కదలాడొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆయా రంగాలపై విశ్లేషకులు

అంచనాలు ఇలా..
* ఐటీ రంగ షేర్లు ఈవారం సైతం ప్రతికూల ధోరణిలో కదలాడొచ్చు. మార్కెట్‌ మొత్తం మీద సానుకూల సెంటిమెంటు నెలకొనడంతో ఐటీ వంటి రక్షణాత్మక షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవచ్చు. రూపాయి పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపొచ్చు.
* ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో లోహ, గనుల తవ్వకం షేర్ల జోరు కొనసాగొచ్చు. మోదీ పర్యటనలో భాగంగా భారత్‌లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు ముందుకొస్తే.. ఈ రంగానికి సానుకూలం కానుంది.
* బ్యాంకింగ్‌ రంగ షేర్లు కూడా జోరు కనబర్చొచ్చు. కార్పొరేట్లు మూలధన వ్యయాలు పెంచితే, రుణాలకు గిరాకీ పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 25 శాతానికి పైగా కార్పొరేట్‌ పన్ను చెల్లిస్తున్న ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకులకు ఉపశమనం దక్కనుంది. బ్యాంక్‌ నిఫ్టీ 29700- 30,000 పాయింట్లకు పెరగొచ్చు. క్యూఐపీ నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ వెలుగులోకి రావొచ్చు.
* యంత్రపరికరాల షేర్లు ఈవారం భారీగా లాభపడే అవకాశం ఉంది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ఈ రంగ కంపెనీలు ఎక్కువగా లబ్ధి పొందనున్నాయి.
* కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ఔషధ రంగ కంపెనీల ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. ఈ అంచనాలతో ఔషధ షేర్లు రాణించొచ్చు.
* చమురు కంపెనీల షేర్లకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు దిశానిర్దేశం చేయనున్నాయి. చమురు ధరలు పెరిగితే మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రతికూలం కానుంది. అప్‌స్ట్రీమ్‌ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలకు ఇది సానుకూలం.
* టెలికాం షేర్లు ఈవారం మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా కదలాడే అవకాశం ఉంది. అనుసంధానత ఛార్జీలు సమీక్షిస్తామన్న ట్రాయ్‌ నిర్ణయం నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ జోరు కొనసాగొచ్చు.
* ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్లు ఈవారం రాణించేందుకు అవకాశం ఉంది. బలహీన గిరాకీతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కార్పొరేట్‌ పన్ను కోత ఈ రంగ షేర్లకు సానుకూలతను తెచ్చిపెట్టవచ్చని భావిస్తున్నారు.
* వాహన కంపెనీల షేర్లు ఈ వారం పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. వాహన రంగానికి సంబంధించి పన్ను కోతలపై జీఎస్‌టీ మండలి చర్చించకపోవడం ప్రతికూలం కావొచ్చు. నేడు ఈ షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది.
* సిమెంటు కంపెనీల షేర్లు ఈవారం లాభాలు కొనసాగించనున్నాయి. స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు ఇందుకు దోహదం చేసే అవకాశం ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.