close
శాసించండి ఈ ప్రపంచాన్ని

అద్భుత అవకాశాల కృత్రిమ మేధ

మీరు మొబైల్‌ గేమ్‌ ఆడే ఉంటారు. అయితే ప్రతీ మొబైల్‌ గేమ్‌ తయారీకి కావాల్సిందేమిటో తెలుసా?
మీరు జరిపే బ్యాంకు లావాదేవీలు అంత పకడ్బందీగా ఎలా జరుగుతున్నాయో తెలుసా?
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వందలకొద్దీ ప్రయోజనాలు కలుగుతున్నది కేవలం కృత్రిమ మేధ(ఏఐ)తోనే. అది అందించిన పలు అప్లికేషన్లతోనే.
వచ్చే అయిదేళ్లలో భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ఏఐ, 5జీ సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి.
పుడు వర్థమాన సాంకేతికత ఉద్యోగాలకు గిరాకీ ఉంది. అయితే దురదృష్టవశాత్తూ అవన్నీ ఖాళీగా ఉంటున్నాయి. అందుకు తగ్గ నైపుణ్యాలున్నవారు లభించకపోవడమే ఇందుకు కారణం. బిగ్‌ డేటా, క్లౌడ్‌, కృత్రిమ మేధ(ఏఐ), డేటా సైన్స్‌ వంటి వాటిని ఎలా నేర్చుకోవాలో కూడా చాలామందికి తెలియడం లేదు. కంప్యూటర్లలో తెలివైన ప్రోగ్రాములను రూపొందించి తెలివైన యంత్రాలను/లేదా అప్లికేషన్లను తయారు చేసే శాస్త్ర విజ్ఞానమే కృత్రిమ మేధ. జ్ఞానాన్ని ఉపయోగిస్తూ అత్యంత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాన్ని చూపే సామర్థ్యాన్ని ఏఐ కలిగిస్తుంది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ అనేవి కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ప్రతి చోటా కనిపిస్తుంటాయి. మొత్తం మీద ఏఐలో మెషీన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ వంటి మూడు అంశాలుంటాయి. వీటి ద్వారా గొంతు, మాటను గుర్తించడం; ముఖాన్ని గుర్తించడం, వస్తువును గుర్తించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, వైవిధ్యంగా ఆలోచించడం వంటివన్నీ సులభ సాధ్యమవుతాయి.

ఏఐ మార్కెట్‌ విస్తృతి ఇదీ..
గత 20 ఏళ్లలో ఏఐపై పరిశోధన చాలా విస్తృతంగా జరిగింది. బిగ్‌ డేటా, రోబోటిక్స్‌, వైద్య పరిశోధన, స్వయం చోదిత వాహనాల వంటివన్నీ ఏఐలో భాగంగానే వచ్చాయి. ఇగ్నైట్‌ నివేదిక ప్రకారం.. వాహన తయారీ, క్లౌడ్‌ సేవల్లో ఏఐ విలువ 2024 కల్లా 10.73 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చు. మిలటరీలో ఏఐ మార్కెట్‌ విలువ 2025 కల్లా 18.82 బి. డాలర్లకు చేరుకుంటుందని అంచనా. సీఐఎస్‌ ఇండియా నివేదిక ప్రకారం.. 2025 కల్లా భారత ఆర్థిక వ్యవస్థకు 957 బి. డాలర్లను ఏఐ జత చేస్తుందంటే దాని ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2035 కల్లా భారత వార్షిక వృద్ధి రేటును 1.3 శాతం మేర పెంచగల సత్తా ఏఐకి కలుగుతుందని ఓ అంచనా.

ఏఐ.. ఇక్కడ నేర్చుకోవచ్చు

2019-20 విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ ఏఐని తొమ్మిదో తరగతిలో ఒక ఐచ్ఛిక పాఠ్యాంశంగా చేయడం విశేషం. ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ పొవాయ్‌, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ బాంబేలు ఇప్పటికే ఏఐలో కొత్త కోర్సులను ప్రారంభించాయి. ఐఐఎస్‌సీ రెండేళ్ల ఎంటెక్‌ ప్రోగామ్‌ను ఆగస్టు 2019 నుంచి మొదలుపెట్టనుంది. ఏఐ ఇంజినీర్లకు ఉన్న గిరాకీ నేపథ్యంలో ప్రతీ సంస్థా ఇపుడు ఏఐని అందిపుచ్చుకుంటోంది. విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, ఐబీఎమ్‌, మైక్రోసాఫ్ట్‌, యాక్సెంచర్‌, అమెజాన్‌, క్యాప్‌ జెమిని, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటివి ఏఐ ఇంజినీర్లను నియమించుకుంటున్నాయి.

ఇవీ ఉపయోగాలు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌లు ఇతోధికంగా ఉపయోగపడుతున్నాయి. పలు భాషల్లో ఈ అప్లికేషన్లు లభ్యం అవుతున్నాయి.
* చాబాట్‌: ఏఐ అల్గారిథమ్స్‌ను అమలు చేసే సమయంలో వినియోగదార్ల వివరాలను ఇది ట్రాక్‌ చేస్తుంది. వినియోగదార్లు అడిగే ప్రశ్నలకు మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా సమాధానాలను ఇస్తుంది.
* మొబైల్‌ గేమ్స్‌: వీడియోగేమ్‌కు ఏఐనే పునాది. అది లేకుండా గేమ్స్‌ రూపకల్పన అసాధ్యం.
* సిరి: యాపిల్‌ ఫోన్లలో వినియోగదార్ల ప్రశ్నలను అర్థం చేసుకుని సమాధానమిస్తుందీ అప్లికేషన్‌కు.
* టెస్లా: స్వయం చోదిత వాహనాలను రూపొందిస్తున్న ఈ కంపెనీ ఉపయోగిస్తున్న సాంకేతికత కృత్రిమ మేధే.

ఉద్యోగావకాశాలు

2020 కల్లా ఏఐ సాంకేతికత రంగంలో 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అంచనా. 2022 కల్లా మెషీన్‌ లెర్నింగ్‌ మార్కెట్‌ పరిమాణం 8.81 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాల నుంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవడం కోసం ఒక జాతీయ ఏఐ పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది కూడా. ఈ పోర్టల్‌ ద్వారా ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌లలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. డేటా ఆర్కిటెక్ట్‌, అప్లైడ్‌ సైంటిస్ట్‌, ఎమ్‌ఎల్‌ స్పీచ్‌ విజన్‌, అనలిస్ట్‌ బీఐ వంటి ఉద్యోగాలు వస్తాయని నాస్‌కామ్‌ అంటోంది.

ప్రభుత్వం, పరిశ్రమలకూ ఉపయోగమే

* ప్రభుత్వంతో ప్రజలు అనుసంధానం కావడానికి ఏఐని ఉపయోగించుకోవచ్చు. పౌర సేవలనూ పొందవచ్చు. చాబాట్స్‌ లేదా వర్చువల్‌ అసిస్టెంట్ల ద్వారా ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వ సమాధానాన్ని ఇప్పించవచ్చు. లేదా ఆయా విజ్ఞప్తులను సంబంధిత అధికారులకు పంపవచ్చు.
* వాహన పరిశ్రమపై ఏఐ ప్రభావం భారీగానే ఉంది. ముఖ్యంగా స్వయం చోదిత వాహనాలను తయారు చేయడానికి ఏఐ చాలా కీలకం. ఆడి, కాడిలాక్‌, వోల్వో వంటి కంపెనీలు అధునాతన స్వయం చోదిత సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.
* రక్షణ రంగం విషయానికొస్తే ఆధునిక యుద్ధ తంత్రంలోనూ ఇది కీలకంగా వ్యవహరించే సత్తా ఉంది. స్వయం నియంత్రిత యుద్ధ వ్యవస్థలను రూపొందించడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. సైబర్‌ భద్రత, సైబర్‌ దాడులను అడ్డుకోవడానికి, కనిపెట్టడానికి సైతం ఇదే కావాలి. మిలటరీలో స్వయం చోదిత వాహనాలను వాడి సైనికుల ప్రమేయాన్ని తగ్గించవచ్చు.
* ఆరోగ్యసంరక్షణ రంగంలో దీని పాత్ర అంతకంతకూ పెరగనుంది. ఇప్పటికే కాన్సర్‌ గడ్డల(ట్యూమర్ల)ను కనిపెట్టడానికి, రోగాల విశ్లేషణకు, రోబో సహాయ సర్జరీలు చేయడానికి, వర్చువల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్లను ఉపయోగించుకోవడానికి సైతం వీలు కలుగుతోంది. ప్రాథమిక రోగ నిర్థరణ, ఆటోమేటెడ్‌ ఇమేజ్‌ డయాగ్నసిస్‌ వంటి వాటికీ ఇదే మందు. కేన్సర్‌ను కనిపెట్టడానికి ఒక జాతీయ రిపాజిటరీని ఏర్పాటు చేయడం కోసం ఏఐపై ఆధారపడాలని నీతి ఆయోగ్‌ యోచిస్తోంది కూడా.
* ఇ-కామర్స్‌ కంపెనీలు తమ వినియోగదారుల నిర్ణయాల విషయంలో; ఉత్పత్తులపై ఇచ్చే సలహాలను వడబోత చేయడానికి, వినియోగదార్లు ఇష్టపడే ఇతర వస్తువులను విశ్లేషించడానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి.
* బ్యాంకింగ్‌, బీమా రంగంలో ఏఐ వల్ల ఆటోమేషన్‌ వచ్చేసింది. లావాదేవీ ప్రక్రియ సులభతరమైంది. చాబాట్‌లను ఉపయోగించుకోవడం వల్ల వినియోగదార్లకు మెషీన్ల ద్వారా సమాధానాలను ఇప్పిస్తున్నారు. వెల్త్‌మేనేజ్‌మెంట్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెం్, కార్డ్‌ మేనేజ్‌మెంట్‌లకూ ఇది ఉపయోగిస్తున్నారు. బీమా కంపెనీలైతే ఆటోమేటింగ్‌ క్లెయిము హ్యాండ్లింగ్‌లకు దీనినే వాడుతున్నారు.
* ప్రచురణ పరిశ్రమ కూడా ఏఐ ద్వారా రాతపూర్వక అంశాలను వీడియో కంటెంట్‌గా మార్చుకుంటున్నాయి.
(రచయిత విప్రో టెక్నాలజీస్‌లో లీడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌)

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.