close
రైతు కావాలి.. అతని కష్టాలు కాదు

వ్యవసాయ రంగం
ఆర్థిక వ్యవస్థ
ప్రభుత్వ విధానాలు

దేశంలోని రైతుల కనీస అవసరాలు ఇప్పటికీ తీరడంలేదు. చాలామంది పేదరికంలోనే జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఎక్కువ మందికి చదువు కూడా రాదు. విచిత్రమేమిటంటే భారత్‌లో పనిచేసేవారిలో వీరి సంఖ్య సగంపైనే ఉన్నా.. ఇతరులతో పోలిస్తే అయిదో వంతు మాత్రమే సంపాదిస్తున్నారు. జాతీయ ఉత్పాదకతకు ఏడో వంతు వాటాను అందిస్తున్నారు. ఎలా చూసినా.. ఎన్ని గణాంకాలను వెతికినా.. రైతు జీవితం దుర్భరమే. ఎవరు ఒప్పుకోకపోయినా.. ఇది తీవ్రంగా కలచివేసే నిజం.
రైతుల జీవితాలు ఇలా కావడానికి మొదటి కారణం మన దేశ రాజకీయాలే. ప్రతీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రైతులను పావుగా వాడుకుంటూనే ఉంది. ఎన్నికలు వచ్చాయి అంటే నాయకులకు అత్యంత ఆప్తుడు రైతే. రుణ మాఫీలేమిటి, నగదు బదిలీలేమిటి, ఆదాయాన్ని రెట్టింపు చేయడమేమిటి, కనీస మద్దతు ధర.. ఇలా ఏది కావాలంటే అది ప్రకటిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీయే కాదు, ఆయా స్థానిక రాజకీయ పార్టీలు సైతం ఇటీవల తమ ఎన్నికల ప్రచారంలో రైతులపైనే గురిపెట్టారు.

పరిష్కారం అదే..
దేశానికి అన్నం పెట్టే రైతుల జీవితాలను మెరుగుపరచేందుకు నాయకులు చేసింది కొంతే. ఎపుడూ వారిని ఓట్ల కోసం వాడుకోవడమే తప్ప ఇంకోటి చేసింది లేదు. చాలామంది విధానకర్తలకు వ్యవసాయ గణాంకాల అర్థమే తెలియదు. వాటిని చూసి పరిశోధన చేసి.. గ్రాఫులు తయారు చేసినా చూచూయగా తెలుస్తుంది తప్ప అసలు నిజం దాక్కునే ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న సవాలు ఒకటే. అందుకు పరిష్కారం ఏమిటంటే.. రైతు ఆదాయాన్ని పెంచడమే.

కనీసం ‘మద్దతు’ ఏదీ
చాలామంది కనీస మద్దతు ధర(ఎమ్‌ఎస్‌పీ) వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభ్యమవుతున్నాయని అనుకుంటుంటారు. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే కార్యాలయం (ఎస్‌ఎస్‌ఎస్‌ఓ) ప్రకారం చూసినా.. ఎమ్‌ఎస్‌పీ వద్ద మార్కెట్లో తమ పంటలను విక్రయిస్తున్న రైతులు 6 శాతం కంటే తక్కువే ఉన్నారు. కేవలం నాలుగింట ఒక రైతుకు మాత్రమే తాము పెంచుతున్న పంటల ఎమ్‌ఎస్‌పీ ఎంత అనేది తెలుస్తోంది. వరి, గోధుమ మాత్రమే ఎమ్‌ఎస్‌పీ వద్ద విక్రయమవుతున్నాయి. అవి కూడా మూడింత ఒక వంతు మాత్రమే.

అయిదేళ్ల నుంచీ ఆదాయాలది నేలచూపే
ప్రతీ ప్రభుత్వం పంట దిగుబడి గణాంకాలను పలవరిస్తూ తమ విధానాల పనితీరును తమకు తామే ప్రశంసించుకుంటుంది. రికార్డు ఉత్పత్తి నమోదైందంటారు. ఒకవేళ ఉత్పత్తి తగ్గితే నెపం వరుణ దేవుడి మీదకు నెడతారు. ఇపుడు మనం గుర్తించాల్సింది ఏమిటంటే.. రైతుల బాధలు వారి ఆదాయాలు తగ్గడం వల్ల కలుగుతున్నవే. 2014 నుంచీ గ్రామీణ ఆదాయాలు తగ్గుతూ వస్తున్నాయని ఆర్‌బీఐ నివేదికే చెబుతోంది. వారి వాస్తవ వేతనాలు అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరాయి. మరి ఇటువంటి సమయంలో ఆదాయాలు పెరుగుతున్నాయా లేదా అని తరచిచూడడంపైనే దృష్టి సారించాలి. ఉత్పత్తి పెరిగిందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు.

మాఫీల ప్రయోజనం.. పెద్ద రైతులకే
రైతుల ఆందోళనలను తగ్గించాలంటే.. రుణ మాఫీల కంటే మెరుగైన, సమర్థమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మాఫీల వల్ల ఆర్థిక వ్యవస్థపైనా భారం పడుతుంది. రుణ మాఫీల వల్ల చిన్న రైతులకు హాని కలుగుతుంది. ఎందుకంటే భవిష్యత్‌లో వారికి రుణాలు లభించడం కష్టమవుతుంది. అపుడు స్థానికంగా వడ్డీ వ్యాపారుల నుంచి 30-40 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటారు. కేవలం 15 శాతం మంది చిన్న రైతులు (2 హెక్టార్ల కంటే తక్కువ పొలం ఉన్నవారు) మాత్రమే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న సంగతి ఇక్కడ మనం గుర్తుకుతెచ్చుకోవాలి. విచిత్రం ఏమిటంటే.. ధనవంతులుగా ఉన్న రైతులకు మాత్రం ఈ మాఫీల వల్ల ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఎందుకంటే వారు అధిక ఉత్పాదకత కోసం ఎక్కువ రుణాలు తీసుకుంటారు కాబట్టి.

చిన్న రైతులకు అది విష వలయమే
ఈ రుణ మాఫీ అనే విష వలయం వల్ల చిన్న రైతులకు బ్యాంకు రుణాలు దొరకడం కష్టమై.. బయటి వ్యక్తుల వద్ద తీసుకుంటారు. దాంతో వచ్చిన పంట ఆదాయాన్ని వడ్డీలు కట్టుకోవడానికి ఉపయోగించుకోవల్సి వస్తుంది. ఇక ఆదాయం మాట అటుంచితే.. ఆత్మహత్యలకూ దారితీసే పరిస్థితులొస్తాయి. ఇదీ దేశానికి వెన్నెముక అయిన రైతు పరిస్థితి. ఎపుడూ వారిది ఓడిపోయే కథే.

అధిక వృద్ధి రాదన్న మాట తప్పు
పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థల్లోనూ వ్యవసాయ రంగం అరుదుగానే 4 శాతం వృద్ధిని నమోదు చేస్తుంటుందని చాలా మంది రాజకీయ నాయకులు తప్పుగా చెబుతుంటారు. చైనా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పదేళ్ల పాటు 7 శాతం వృద్ధి రేటును కొనసాగించింది. మన రాష్ట్రాల్లోనూ కొన్ని సాధించాయి. అందుకు ప్రతిఫలంగా ఆ ముఖ్యమంత్రులకు తిరిగి అధికార పీఠం దక్కింది కూడా.  విద్యుత్‌, మార్కెట్‌కు రవాణా, నిల్వ సదుపాయాలు, నీటి సరఫరాకు ఢోకా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి తోడు గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, యువతకు తగిన విద్య, నైపుణ్య శిక్షణ వల్ల గ్రామీణ వినియోగం పెరిగేలా చేయొచ్చు. వృద్ధి మరింత సమతులంగా ఉండేలా చూడొచ్చు. అపుడు గ్రామీణ వృద్ధి 12 శాతంగా నమోదైనా ఆశ్చర్యం లేదు.

పేదరిక నిర్మూలన వేగంగా..
గ్రామీణ రంగంలో వృద్ధి వల్ల మరో ప్రయోజనమూ ఉంది. ఇతర రంగాలతో పోలిస్తే మూడు రెట్లు వేగంగా పేదరిక నిర్మూలన జరుగుతుంది. అపుడు యువతకు వ్యవసాయం అనేది చివరి అవకాశంగా కాకుండా.. ఉపాధి అవకాశంగా మారుతుంది. నెలలకొద్దీ పొలంలో కష్టపడి.. మనకు అన్నం పెట్టే రైతుకూ అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలి కదా.


ప్రభుత్వం ఏం చేయాలంటే..

* కొత్త ప్రభుత్వం బలమైన వ్యవసాయ విధానాలను రూపొందించాలి. రైతుపైనే దృష్టి నిలిపి సమతుల అభివృద్ధికి చేయూతనిచ్చేలా చేయాలి. రైతులకు ఉపయోగపడేలా భూ సంస్కరణలను తీసుకురావాలి. తద్వారా భూమిపై వారి యాజమాన్యం, హక్కులు కొనసాగేలా చేయాలి. అపుడే సమర్థంగా ఉపయోగించి.. మెరుగైన ఉత్పత్తిని నమోదు చేయడానికి వీలవుతుంది.
* నిల్వ సదుపాయాలు అంటే గిడ్డంగులను విరివిగా ఏర్పాటు చేస్తే చిన్న రైతుకు మంచి ధర వచ్చే వరకు ధాన్యాన్ని అట్టేపెట్టిఉంచుకోవడానికి వీలవుతుంది.
* రైతును ఒక వ్యవసాయ పారిశ్రామికవేత్తగా మార్చడానికి మరిన్ని వ్యవసాయ సదుపాయాలు, మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. నీటి వసతి లేని ప్రాంతాల్లో సమర్థమైన నీటి వినియోగానికి తగిన సంస్కరణలను తీసుకురావాలి.
* చిన్న కమతాలను ఏకీకరణ చేయడం ద్వారా ఉత్పత్తి పెరిగేలా చూసుకోవాలి.
* రైతుల పక్షాన నిలబడి ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేయాలి. ఇవి రైతుల కోసం సాంకేతికత, మార్కెటింగ్‌, రవాణా సదుపాయాలను అందజేసేందుకు పెట్టుబడులు పెట్టాలి.
* అదే విధంగా ఇ-మార్కెట్లలో పెట్టుబడుల వల్ల దళారుల వ్యవస్థ తగ్గి మార్కెట్లపై నియంత్రణ పెరుగుతుంది. దీని వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా.. కొనుగోలుదారుకు కూడా వ్యయాలు తగ్గుతాయి. ఇ-మార్కెట్ల నుంచి వెళ్లే సమాచారం వల్ల ఉత్పత్తి ప్రామీణీకరణ జరుగుతుంది. మెరుగైన నాణ్యత కూడా కనిపిస్తుంది.
* సంస్థాగత కార్మికుల తరహాలోనే వృద్ధాప్య పింఛను ఇచ్చి సామాజిక భద్రతను కల్పించాలి.
* అన్నిటికంటే ముఖ్యమైనది కొత్త వ్యవస్థలో బీమాను తప్పనిసరిగా ఉంచాలి. రైతుల చేతుల్లో లేని అంశాలు చాలా ఉండడంతో నష్టభయం ఎక్కువ. ఆ ‘నష్టభయాన్ని’ మనం దూరం చేయాలి. కనీస ప్రతిఫలాలకు హామీనివ్వడం ద్వారా.. కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా చూడాలి.

(రచయిత - సీనియర్‌ ఆర్థికవేత్త)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.