close

Published : 14/01/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భళా ఇన్ఫోసిస్‌

అంచనాలు మించిన అక్టోబరు- డిసెంబరు ఫలితాలు
16.6 శాతం పెరిగిన నికర లాభం
ఆదాయం రూ.25,927 కోట్లు
2021-22లో రెండంకెల వృద్ధిపై ధీమా
దిల్లీ

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌, మార్కెట్‌ వర్గాల అంచనా కంటే మెరుగైన ఫలితాలతో మెప్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు- డిసెంబరు)లో కంపెనీ రూ.5,197 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.4,457 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 16.6 శాతం అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం సైతం 12.3 శాతం వృద్ధితో రూ.25,927 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.23,092 కోట్లుగా నమోదైంది.
ఆదాయ అంచనాలు పైకి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాలను స్థిర కరెన్సీ ప్రాతిపదికన 4.5- 5 శాతానికి పెంచింది. అంతక్రితం అక్టోబరు అంచనాల్లో స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి 2-3 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. మార్జిన్‌ సైతం 24- 24.5 శాతానికి పెరగొచ్చని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రెండంకెల వృద్ధి సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని వివరాలు ఇలా..
* స్థిర కరెన్సీ ప్రాతిపదికన సమీక్షా త్రైమాసికంలో ఆదాయ వృద్ధి 6.6 శాతంగా నమోదైంది.
* మూడో త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్‌ 25.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 350 బేసిస్‌ పాయింట్ల వృద్ధి సాధించింది.
* డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ 7.13 బిలియన్‌ డాలర్ల భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. మొత్తం ఆదాయంలో డిజిటల్‌ ఆదాయాల వాటా 50 శాతాన్ని అధిగమించింది. ఫలితంగా 31.3 శాతం వృద్ధి నమోదుచేసింది.
* ఫ్రీ క్యాష్‌ ఫ్లో 19.4 శాతం పెరిగి రూ.5,683 కోట్లకు చేరింది.
* ఆస్ట్రేలియా డిజైన్‌ ఏజెన్సీ కార్టర్‌ డిజిటల్‌ ఆస్తులు, ఉద్యోగుల కొనుగోలు ఒప్పందానికి ఇన్ఫోసిస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. లావాదేవీ విలువను వెల్లడించలేదు.
* సీఈఓ సలీల్‌ పరేఖ్‌కు రూ.3.25 కోట్లు, మరో పేరు వెల్లడించని వ్యక్తికి రూ.1.75 కోట్ల విలువైన స్టాక్‌ యూనిట్లను కంపెనీ ఇచ్చింది.
17,000 తాజా నియామకాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17000 మంది ఫ్రెషర్లను కంపెనీ నియమించుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 24,000 క్యాంపస్‌ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది.
* డిసెంబరు ఆఖరుకు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,49,312గా ఉంది. ఉద్యోగుల వలసల రేటు 15.8 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. 97 శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఇంటి నుంచే పని) చేస్తున్నారు.
‘మరోసారి అద్భుత త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్‌ బృందం సాధించింది. మాకే కాదు.. పరిశ్రమలోనూ ఎన్నడూ చూడని భారీ ఒప్పందాలు (710 కోట్ల డాలర్లు) సాధించాం. 9 నెలల కాలానికి చూసుకుంటే, పెద్దమొత్తం ఒప్పందాలే 1200 కోట్ల డాలర్ల మేరకు ఉన్నాయి. డిజిటల్‌ మార్పులకు అనుగుణంగా ఖాతాదారు ఆధారిత వ్యూహాన్ని అమలు చేయడం కొనసాగించడంతో మంచి వృద్ధి నమోదుచేశాం. ఇందులో పరిశ్రమ కంటే ముందంజలో ఉన్నాం. అగ్రగామి అంతర్జాతీయ కంపెనీలు వాన్‌గార్డ్‌, దైమ్లర్‌, రోల్స్‌-రాయిస్‌లు కొత్త ఖాతాదారులుగా చేరడం.. కంపెనీ డిజిటల్‌, క్లౌడ్‌ సామర్థ్యాల బలాలను చూపిస్తోంది. ఖాతాదారుల అవసరాలపై మరింతగా దృష్టి పెట్టనున్నాం. భవిష్యత్‌పై ధీమాగా ఉన్నాం’

- సలీల్‌ పరేఖ్‌, సీఈఓ, ఇన్ఫోసిస్‌

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని