close
Array ( ) 1

తాజా వార్తలు

ఎందుకీ గజిబిజినెస్‌?

భారత్‌-అమెరికా మధ్య సుంకాల రగడ
ట్రంప్‌ పర్యటనలో వాణిజ్య ఒప్పందం లేనట్లే!

భారత్‌ అధిక పన్నుల్ని బాదేస్తోందని, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలకు అదే ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరచూ ఆరోపిస్తున్నారు. భారత్‌ కొత్తగా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని, అందువల్ల ట్రంప్‌ పర్యటనలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాల్లేవని అమెరికా వైట్‌హౌస్‌ ప్రతినిధి తాజాగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో విభేదాలు, ఉద్రిక్తతల్ని స్పష్టంగా చాటుతున్నాయి. వాణిజ్య సుంకాలపై పరస్పరం అవగాహనకు రాకపోవడం దీనికి ప్రధాన కారణం.


ఏమంటోంది?

మా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక సుంకాల్ని విధిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై మరీ ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల్ని భారత్‌ ఉల్లంఘిస్తోంది. ‘పూర్తి స్థానికత’ విధానాన్ని అవలంబిస్తోంది. ఆర్థిక డేటా ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల వీసా, మాస్టర్‌కార్డ్‌లాంటి కంపెనీలు నష్టపోతున్నాయి. మా ఎగుమతులకు అడ్డంకిగా ఉన్న విధానాల్ని భారత్‌ ఎత్తేయాలి


ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ సర్కారు భారీగా సుంకాలు వడ్డిస్తోంది. వీటిని ఉపసంహరించాలి. జనరలైజ్డ్‌ సిస్టం ఆఫ్‌ ప్రిఫరెన్స్‌(జీఎస్‌పీ) కింద భారత్‌కు ప్రయోజనాల్ని ఉపసంహరించడం వల్ల మేం నష్టపోతున్నాం.


ఏం కోరుతోంది?

* గుండె స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పలపై ధరల నియంత్రణ విధించకూడదు
* హార్లీ డేవిడ్‌సన్‌ బైకులపై సుంకాల్ని తగ్గించాలి
* అమెరికా పాడి, వ్యవసాయ ఉత్పత్తులకు బేషరతు మార్కెట్‌ సదుపాయం కల్పించాలి
* ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గించాలి
* అమెరికా ఫలాలకు మార్కెట్‌ సదుపాయం కల్పించాలి
* డబ్ల్యూటీఓలో ఫిర్యాదుల్ని పరస్పరం ఉపసంహరించుకోవాలి
* అమెరికా ఇన్‌ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలి
* ప్రతికార సుంకాల జోలికి వెళ్లొద్దు


* ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల్ని తగ్గించాలి.
* భారత మామిడిపండ్లు, ద్రాక్షకు మరింతగా మార్కెట్‌ సదుపాయం కల్పించాలి.
* భారత పండ్ల ఎగుమతిదారులకు సులభంగా అనుమతులివ్వాలి
* జీఎస్‌పీ కింద ఎగుమతి ప్రయోజనాలను పునరుద్ధరించాలి.
* వ్యవసాయం, వాహనాలు, వాహన విడిభాగాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల్ని అమెరికాలో మరింతగా విక్రయించడానికి అనుమతించాలి.


జీఎస్‌పీ అంటే..

ధనిక దేశాల్లో తక్కువ ఖర్చుతో తయారైన వస్తువుల్ని పేద దేశాల్లో విక్రయించేటపుడు స్థానిక మార్కెట్‌ దెబ్బతినకుండా.. అక్కడి ధరల ప్రకారం, లేదా అంతకన్నా ఎక్కువకు విక్రయించాలి. ఆ మేరకు పేద దేశాలు సంబంధిత ఉత్పత్తులపై సుంకాలు విధించొచ్చు. జనరలైజ్డ్‌ సిస్టం ఆఫ్‌ ప్రిఫరెన్స్‌(జీఎస్‌పీ) పేరిట ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఈ నిబంధనను చేర్చింది. అయితే పేద దేశాల జాబితా నుంచి భారత్‌ను గత ఏడాది అమెరికా ఏకపక్షంగా తొలగించినందువల్ల ఈ నిబంధన కింద పొందే ప్రయోజనాల్ని భారత్‌ కోల్పోతోంది. పైపెచ్చు మన ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అధిక పన్నుల్ని ట్రంప్‌ సర్కారు ఉపసంహరించట్లేదు. దీనికి నిరసనగా దాదాపు 28 అమెరికా ఉత్పత్తులపై మనదేశం కూడా గత ఏడాది జూన్‌లో సుంకాల్ని విధించింది. ఇందులో బాదం, యాపిల్స్‌ లాంటివీ ఉన్నాయి. భారత్‌తో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటున్నామని ట్రంప్‌ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మనదేశం ఈ చర్యకు దిగింది. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. వివాదాల్ని పరిష్కరించుకోడానికి భారత వాణిజ్యమంత్రి పీయూష్‌గోయల్‌, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైథిజెర్‌ మధ్య కొన్ని వారాలుగా ఫోన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. 


వాణిజ్య లోటు ఎంత?

భారత్‌- అమెరికా మధ్య 2018-19లో వాణిజ్య లోటు 1609 కోట్ల డాలర్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే(2209 కోట్ల డాలర్లు) ఏడు శాతం తగ్గింది. ఈ లోటు పూడ్చాలని, భారత్‌ ఎంత ఎగుమతి చేస్తే.. అంత దిగుమతి చేసుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. 


భారత్‌ తాజా రాయితీలివీ..

* అధునాతన బైక్‌లకు సింగిల్‌ డిజిట్‌ (1-9 శాతం) సుంకాలు విధిస్తాం
* వైద్య పరికరాల ధరల నిర్ణయంలో ట్రేడ్‌ మార్జిన్లకు అనుమతిస్తాం 


రక్షణ ప్యాకేజీకి సరే?

అమెరికా నుంచి రూ.18,200 కోట్ల విలువైన 24 హెలికాప్టర్లు(ఎంహెచ్‌-60 రోమియో), ఆరు ఏహెచ్‌-64ఈ అపాచే హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి భారతదేశం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి ప్రతిగా జీఎస్‌పీ కార్యక్రమం కింద ప్రయోజనాల్ని అమెరికా పునరుద్ధరిస్తుందని భారత్‌ ఆశిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2017లో అమెరికాకు దాదాపు 570 కోట్ల డాలర్ల సుంకాల్లేని ఎగుమతుల్ని భారత్‌ చేసింది. 


ఇదీ వాణిజ్యం..

భారత మొత్తం ఎగుమతుల్లో 16% అమెరికాకు వెళ్తాయి. ఐరోపా సమాఖ్య (17.8%) తర్వాత మనది రెండో దేశం. 


అమెరికా ఉత్పత్తుల  దిగుమతిలో చైనా(14.6%), ఈయూ(10.2%) తర్వాత మనది మూడోదేశం(6.3%)


వస్తువులు, సేవల వాణిజ్యం పరంగా చూస్తే అమెరికాకు భారత్‌ ఎనిమిదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

- ఈనాడు వాణిజ్య విభాగం

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.