close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 19/01/2020 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహీంద్రా వేగం పెంచిన ‘స్కార్పియోమ్యాన్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడా కార్పొరేట్‌ కంపెనీల్లో వారసులే ఛైర్మన్లుగా వ్యవహరిస్తుంటారు. లేదా సంస్థలో అత్యధిక వాటా కలిగిన వారిలో ఎవరో ఒకరు పగ్గాలు చేపడుతుంటారు. కానీ, భారత వాహనరంగ చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహీంద్రా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. కంపెనీలో ఒక ఉద్యోగిగా చేరి.. అంచెలంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని భావించింది. మరి మహీంద్రా వంటి అంతర్జాతీయ కంపెనీని మేనేజ్ చేయడం అంటే కత్తి మీద సామే. ప్రస్తుత ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకు మాత్రం.. తన తర్వాత కంపెనీని నడిపే నాయకుడి వేట సునాయాసంగా సాగిపోయింది. అప్పటికే.. కంపెనీ కీలక బాధ్యతలు మోస్తూ ‘స్కార్పియో మ్యాన్‌’గా పేరుగాంచి తన సత్తా ఏంటో చాటుకున్న పవన్ గొయెంకా ఉండగా ఆనంద్‌కు నాయకుడి ఎంపిక నల్లేరు మీద నడకలా సాగిపోయింది.

జనరల్‌ మోటార్స్‌లో ‘ఆంగ్లం’పై పట్టు...

మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో 23 సెప్టెంబరు, 1954లో జన్మించిన పవన్‌ కుమార్ గొయెంకా.. చిన్నతనంలోనే కుటుంబంతో పాటు కోల్‌కతాకు వలసవెళ్లారు. అక్కడే హిందీ మీడియంలో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఐఐటీ కాన్పూర్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీ.టెక్‌ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీలో ‘ల్యూబ్రికెంట్స్‌ ఇన్‌ ఆర్టిఫీషియల్‌ జాయింట్స్‌’ అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. అక్కడే ప్రముఖ జనరల్‌ మోటార్స్‌ పరిశోధన విభాగంలో ఉద్యోగిగా చేరారు. అయితే ప్రాథమిక విద్య హిందీ మీడియంలో సాగడంతో ఉద్యోగంలో భాషాపరమైన ఇబ్బందులు తప్పలేదు. దీంతో కంపెనీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్సులో చేరి మరికొంత మంది ఆంగ్లేయేతర సహచరులతో కలిసి ఆంగ్ల భాషపై పట్టు సాధించారు. 

ఓ పత్రికా ప్రకటనతో భారత్‌కు...

1979లో జనరల్‌ మోటార్స్‌లో చేరిన గొయెంకా 1993 వరకు అక్కడే పనిచేశారు. ఆయన సతీమణి మమత కోరిక మేరకు భారత్‌కు తిరిగి రావాలని నిశ్చయించుకున్నారు. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థ పూర్తిగా సమసిపోయి భారత్‌లో కార్పొరేట్‌ ప్రపంచం రెక్కలు విచ్చుకుంటున్న రోజులవి. అంతకుముందున్న అనేక కఠిన నిబంధనల వల్ల విదేశాలకు తరలివెళ్లిన ‘టాలెంట్‌’ను భారత్‌కు రప్పించాలని ఇక్కడి కంపెనీలు భావిస్తున్నాయి. ఆ మేరకు విదేశీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాయి. అందులో ఒకటి మహీంద్రాది. వెంటనే తన ఆసక్తిని తెలియజేస్తూ కంపెనీకి ఉత్తరం రాశారు. అలా మరికొన్ని సంస్థలను కూడా గొయెంకా ఆశ్రయించారు. 

సమ్మె వల్ల మహీంద్రా చేరాల్సి వచ్చింది...

అమెరికా నుంచి నేరుగా తన స్వస్థలం కోల్‌కతాలో దిగిన గొయెంకా.. పలు కంపెనీలను సంప్రదించేందుకు యత్నించారు. కానీ, అప్పటికి ఎయిరిండియా సమ్మె కొనసాగుతోంది. మరోవైపు కోల్‌కతా వదిలి వెళ్లొద్దని అమ్మ షరతు. ఒకవేళ వదిలినా.. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేలా ఉండాలి అని నిబంధన. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. కోల్‌కతా నుంచి రెగ్యులర్‌గా విమానాలు నడిచే నగరాల్లో ముంబయి ఒకటి. అవసరమైనప్పుడల్లా కోల్‌కతాకు వచ్చేయొచ్చు. పైగా సమ్మె నేపథ్యంలో కేవలం ముంబయికి మాత్రమే ఎయిరిండియా సర్వీసులు నడుపుతోంది. దీంతో వేరే మార్గం లేక.. ముంబయికి వచ్చేశారు. అప్పటికే తనకు కంపెనీ నుంచి అందిన లేఖతో మహీంద్రాలో ఇంటర్వ్యూకి వెళ్లారు. ముఖాముఖిలో ఆనంద్‌ మహీంద్రాకు తన లక్ష్యాల్ని వివరించారు. గొయెంకా ఆశయాలకు ఆకర్షితులైన ఆనంద్‌.. కంపెనీపై తన విజన్‌ని ఆయనకు వివరించారు. దేశీయంగా వినూత్న వాహనాల్ని రూపొందించాలన్న ఆనంద్‌ ఆశయం.. గొయెంకాకు ఎంతగానో నచ్చింది. మరోమాట లేకుండా కంపెనీలో చేరిపోయారు.

సీనియర్ల నుంచి చేదు అనుభవాలు...

విదేశాల నుంచి వచ్చిన గొయెంకాకు కంపెనీ సకల వసతులతో నాసిక్‌లో ఉన్న పరిశోధనా కేంద్రానికి సమీపంలో నివాసం ఏర్పాటు చేసింది. వెంటనే విధుల్లో చేరిన తనకు సీనియర్ల నుంచి కొన్ని చేదు అనుభవాలు తప్పలేదు. అయితే కంపెనీ అధినేత ఆనంద్‌ తనపై నమ్మకం ఉంచడంతో బాలారిష్టాల్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాలేదు. అయితే గొయెంకాకు కేవలం పరిశోధనాపరమైన పట్టు తప్ప కంపెనీ ఇతర కార్యకలాపాలపై పెద్దగా అవగాహన లేకపోవడం కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో సంస్థలోని ఇతర ప్రముఖులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు అన్ని మెలకువల్ని నేర్చుకున్నారు. తనకున్న శ్రమించేతత్వం, పట్టుదల వంటి లక్షణాలతో తక్కువ కాలంలోనే కంపెనీలో అందరి మన్ననలు పొందారు. అలా అనతి కాలంలోనే కీలక వ్యక్తిగా మారిపోయారు.

స్కార్పియో మ్యాన్‌...
కార్ల విభాగంలో అప్పటికి పేరెన్నికగన్న దేశీయ వాహనాలు చాలా తక్కువే. దీంతో ఆ రంగంలో ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో నాణ్యమైన కార్లను ఉత్పత్తి చేయాలని మహీంద్రా భావించింది. దీనికి ఓ జట్టును ఏర్పాటు చేసి అప్పటికే పరిశోధన విభాగంలో అపార అనుభవం ఉన్న గొయెంకాను దానికి నాయకుడిగా నియమించింది. నిరంతం శ్రమిస్తూ.. కంపెనీ అప్పగించిన బాధ్యతను గొయెంకా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సమయంలోనే తన భార్య మమతకు కేన్సర్‌ సోకినా.. తన లక్ష్యాన్ని మాత్రం చేజారనివ్వలేదు. అయితే ఈ క్రమంలో తన భార్య సహకారం కూడా ఎంతో ఉందంటారు గొయెంకా. ఎట్టకేలకు దేశీయంగా తయారుచేసిన తొలి స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌(ఎస్‌యూవీ)ని ‘స్కార్పియో’ పేరిట మార్కెట్లోకి తెచ్చారు. కంపెనీ ఆశించినట్లుగా మహీంద్రా చరిత్రలో స్కార్పియో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కంపెనీ పురోగతిలో కీలక పాత్ర పోషించింది. మహీంద్రా ట్రాక్టర్‌, బొలెరో తర్వాత ఆ స్థాయి విజయాన్ని కట్టబెట్టింది. ఈ క్రెడిట్‌ అంతా గొయెంకాకే దక్కుతుంది. కానీ, గొయెంకా మాత్రం స్కార్పియో విజయంలో మార్కెటింగ్‌, డిజైనింగ్‌, ప్రొడక్షన్‌ విభాగాల పాత్ర కూడా ఉందంటారు. ఇక్కడితో ఆయన పేరు ‘స్కార్పియోమ్యాన్‌’గా మారిపోయింది. ఒక్క స్కార్పియోనే కాదు, ఆయన పర్యవేక్షణలో ఎక్స్‌యూవీ 500 వంటి మరికొన్ని వాహనాలు సైతం రూపుదిద్దుకున్నాయి. భారత రోడ్లపై మహీంద్రా ప్రతిష్ఠను ముందుకు నడిపించాయి.

రోజుకు 16గంటలు...
నిత్యం కంపెనీ పురోగతి కోసమే తపించే గొయెంకా.. రోజుకు 16గంటలు కష్టపడతారు. అయితే తనని పనిరాక్షసి అంటే మాత్రం ఒప్పుకోరు. తానెప్పుడు ఒత్తిడికి గురికాలేదని..పనిని ఇష్టపడితే ఏదీ కష్టంగా ఉండదంటారు. అందుకే తాను చేసే ఏ పని భారంగా అనిపించదట. ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే గొయెంకా రోజు రాత్రి 12గంటలకు మెయిల్స్‌ చూడడంతో ముగుస్తుంది. సమయాన్ని ఏమాత్రం వృథా చేయని గొయెంకా విదేశాలకు వెళ్లేటప్పుడు విమానంలోనే కునుకు తీస్తారు. దీనివల్ల అక్కడికెళ్లాక విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదంటారు. ఇక ఇంటి నుంచి ఆఫీసుకు, మళ్లీ తిరిగి కారులో వచ్చే సమయంలోనే ముఖ్యమైన కాల్స్‌ అంటెండ్‌ చేస్తారు. రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసేటప్పుడు కూడా గొయెంకా ముందు ఆరు ల్యాప్‌టాప్‌లు తెరిచి ఉంటాయంటే కంపెనీ పట్ల, పని పట్ల ఆయన నిబద్ధత ఎంటో అర్థం చేసుకోవచ్చు.

ఇక జనరల్‌ మోటార్స్‌ని వదిలి వచ్చేటప్పుడు.. ఆయన్ని వదులుకోవడానికి ఇష్టపడని కంపెనీ నాలుగేళ్లు ‘అన్‌పెయిడ్‌ లీవ్స్‌’గా ప్రకటిస్తూ ఆయనకు తలుపులు తెరిచే ఉంచిందంటే.. గొయెంకా పనితీరు ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. మరి అలాంటి వ్యక్తికి మహీంద్రా బాధ్యతలు అప్పగించడం సముచితమేగా..! ప్రస్తుతం మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న పవన్‌ గొయెంకా.. ఏప్రిల్‌, 2020 నుంచి సీఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.