close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముందే గుర్తించినా..

ప్రమాద హెచ్చరికగా పరిగణించని యాజమాన్యం
నియంత్రిస్తే ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదు 

ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక

ఈనాడు, అమరావతి: ‘‘విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరీన్‌ ఆవిర్లు లీకైన ట్యాంకులో పాలిమర్స్‌ పరిమాణం అసాధారణంగా పెరుగుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ఏప్రిల్‌ 24నే గుర్తించారు. అయితే వారు దాన్ని ప్రమాద హెచ్చరికగా పరిగణించలేదు. అప్పుడే తగిన నియంత్రణ చర్యలు తీసుకుని ఉంటే మే 7న ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదు’’ అని ఈ దుర్ఘటనపై విచారించిన ఉన్నతస్థాయి కమిటీ పేర్కొంది. ఎమ్‌6 స్టైరీన్‌ ట్యాంక్‌ పైపింగ్‌ను ఎవరికీ చెప్పకుండా గతేడాది డిసెంబరులో ఆ సంస్థ మార్చేయటంతో సర్క్యులేషన్‌, మిక్సింగ్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈ దుర్ఘటనకు అప్పుడే బీజం పడిందని తేల్చింది.

స్టైరీన్‌ వంటి ప్రమాదకర రసాయనం నిల్వ ఉందని తెలిసినా లాక్‌డౌన్‌ సమయంలో దాని నిర్వహణకు కంపెనీ చర్యలేవీ తీసుకోలేదని తప్పుపట్టింది. యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శించిందని, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ పాటించలేదని.. అందుకే పెను ప్రమాదం సంభవించిందని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి 11 భాగాలతో 4వేల పేజీల నివేదికను ఉన్నతస్థాయి కమిటీ రూపొందించింది. కమిటీ ఛైర్మన్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఈ నివేదిక అందజేశారు. అనంతరం అందులోని ప్రధానాంశాలను విలేకరులకు వివరించారు.

ఆ నిల్వలే ఉండుంటే..
* ఎమ్‌6 స్టైరీన్‌ ట్యాంకు 50 ఏళ్ల కిందటిది. ఈ ట్యాంకు లోపల ఉష్ణోగ్రతలు తెలుసుకునేందుకు అధునాతన పద్ధతుల్లేవు. ట్యాంకు పైభాగంలో, మధ్యభాగంలో ఉష్ణోగ్రతలు తెలుసుకునే వ్యవస్థ లేదు.
* సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం రాత్రి 2.45 సమయంలో ట్యాంకు నుంచి సైరీన్‌ ఆవిర్లు వెలువడ్డాయి. ఉదయం 5.15 వరకూ కంపెనీ వాటి నియంత్రణకు చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత నీళ్లు చల్లారు. అయితే ఆవిరి రూపంలోకి మారిన స్టైరీన్‌ను తటస్థీకరించేందుకు అవసరమైన రసాయనాల (ఇన్‌హిబిటర్స్‌) నిల్వలు లేవు. అవి ఉంటే మధ్యాహ్నానికల్లా ఆవిర్లు నియంత్రించేందుకు అవకాశం ఉండేది. రాత్రి 10 గంటల సమయంలో రెండోసారి ఆవిర్లు వచ్చేవి కాదు. ఆ సమయంలో ట్యాంకులో ఉష్ణోగ్రత 153.7 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరిపోయింది.
* ప్రమాదం సంభవించినప్పుడు మోగించాల్సిన అలారంలను వినియోగించలేదు.

ఎల్‌జీ పాలిమర్స్‌ తరలింపు..
* ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో అక్కడ స్టైరీన్‌ లేదా ఇతర ప్రమాదకర రసాయనాల నిర్వహణకు అనుమతించం. గ్రీన్‌ లేదా వైట్‌ కేటగిరీ కార్యకలాపాలకే అనుమతిస్తాం. స్టైరీన్‌ నిర్వహణ వంటివి మరో చోట చేపట్టేలా తరలించాలని సిఫార్సు చేశాం.

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు..
నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను వాటికి దూరంగా తరలించాలని లేదా గ్రీన్‌, వైట్‌ కేటగిరీ పరిశ్రమలుగా మార్చుకోవాల్సిందిగా యాజమాన్యాలకు నిర్దేశిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఆయనకు నివేదిక సమర్పించిన సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఆయా పరిశ్రమల వల్ల ప్రజలకు ప్రమాదం లేకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఈ నివేదిక ఒక ప్రారంభం కావాలి. పరిశ్రమలకు సంబంధించి అన్ని శాఖలూ రానున్న రోజుల్లో మరింత పటిష్ఠంగా కార్యాచరణ ప్రణాళికతో పాటు, ప్రోటోకాల్స్‌ సిద్ధం చేసుకోవాలి. భవిష్యత్తులో పరిశ్రమల వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ నివేదిక మార్గదర్శకంగా ఉంటుంది. అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు, సవరణలు చేస్తాం. అలారం మోగకపోవటం వంటి లోపాల వల్లే ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఉన్నతస్థాయి కమిటీ నివేదికను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలి’’ అని పేర్కొన్నారు.

ప్రమాదానికి మూల కారణాలు ఇవే!
* స్టైరీన్‌ నిల్వ ట్యాంకు ఆకృతి పేలవంగా ఉంది.
* సేఫ్టీ ప్రోటోకాల్‌, భద్రత, రసాయనాల నిల్వపై సిబ్బందికి ఎలాంటి అవగాహన లేదు.
* బయట నుంచి చల్లబరిచే రిఫ్రిజిరేషన్‌ యూనిట్‌ సరిగ్గా లేదు.
* సేఫ్టీ ఆఫీసర్‌, షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి, ఇంజినీర్లకు... ఇంజినీరింగ్‌ అర్హతల్లేవు. వారికి ఆ సామర్థ్యం కూడా లేదు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.