close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనకూ ముప్పే!

ఇప్పటికే ఉత్తరాదిలో పంటలపై మిడతల దాడి
తెలుగు రాష్ట్రాల అప్రమత్తత

దిల్లీ: దేశంలో మరో పెద్ద సమస్య వచ్చి పడింది. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మిడతల దండు వణికిస్తోంది. లక్షల సంఖ్యలో పంటపొలాలపై దాడి చేస్తున్నాయి. పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌లోకి, అక్కడి నుంచి ఒక్కో రాష్ట్రంలోకి ‘వాయు’వేగంతో తరలి వస్తున్న మిడతలు తెలుగు రాష్ట్రాలకూ చేరువవుతున్నాయి. వీటిని అలాగే వదిలేస్తే దుర్భిక్షం, ఆకలి చావులు తప్పవని ఇతర దేశాల్లోని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దీంతో రైతుల్ని అప్రమత్తం చేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాయి. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు
వ్యవసాయ రంగంలో వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానం, చీడపీడల నివారణలో వచ్చిన కొత్త పద్ధతుల వల్ల 2011 డిసెంబర్‌ నుంచి భారత్‌లో మిడతల ప్రభావం పెద్దగా లేదు. మళ్లీ ఇప్పుడు వాటి ఉద్ధృతి ముంచుకొచ్చింది. దాదాపు 200 ఏళ్ల నుంచి వీటిని మన దేశంలో చూస్తున్నా, ఇంతటి తీవ్రస్థాయిలో దండెత్తడం  27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాజస్థాన్‌ నుంచి మొదలుపెట్టి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రల వరకు ఇవి ఇప్పటికే విస్తరించాయి. 17 జిల్లాలను యూపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పెద్దఎత్తున రసాయనాలను జల్లించేందుకు సిద్ధమవుతోంది. పంట నష్టాలపై ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. ఇళ్లలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే నెలలో ఈ సమస్య ఇంకా తీవ్రతరం అవుతుందంటున్నారు.

వాతావరణ మార్పులే కారణం
గతేడాది వర్షాకాలం దీర్ఘకాలం కొనసాగడం, హిందూ మహాసముద్రంలో తరచూ తుపాన్లు చెలరేగడం.. వీటి సంఖ్య భారీగా పెరిగేందుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.  మిడతల సంచారంపై రైతులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పెద్ద శబ్దాలు చేయడం ద్వారా వాటిని తరిమికొట్టాలని సూచిస్తున్నారు. ఈ చీడలను అరికట్టేందుకు ప్రభావిత రాష్ట్రాలు కంట్రోల్‌ రూంల ద్వారా పర్యవేక్షిస్తున్నాయి.
జులైలో సమస్య మరింత తీవ్రం!
మిడతల దండు వల్ల పశ్చిమ భారత రాష్ట్రాల్లో పంటలకు నష్టం వాటిల్లవచ్చని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ఎడారి మిడతలు ఈసారి భారీగా వచ్చాయని మంత్రిత్వశాఖలోని వన్యప్రాణి విభాగం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సౌమిత్ర దాస్‌గుప్తా తెలిపారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ బెడదను నిర్మూలించడంపై దృష్టి సారించాయని చెప్పారు. ఇరాన్‌, పాకిస్థాన్‌లలోని మిడతలు తమ సంతానాన్ని వృద్ధి చేసుకునే కాలం కావడంతో జులై ఆరంభంలో సమస్య మరింత తీవ్రతరం అవుతుందని మరో అధికారి అంచనా వేశారు.
* అత్యధిక పునరుత్పాదక శక్తి కలిగిన మిడతలు 3 నెలల్లో సంతతిని 20రెట్ల వరకు పెంచుకుంటాయి.
* ఒక పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. 10ఏనుగులు, 25 ఒంటెలు, లేదా 2500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి గుంపు తినేస్తుంది.
* ఒక చదరపు కి.మీ. దండులో 8 కోట్ల వరకు మిడతలుంటాయి. మనదేశంలో కనిపించిన దండు గరిష్ఠంగా 1500 చదరపు కి.మీ. లోపే ఉంటే గతంలో అమెరికాలో 5 లక్షలకు పైగా చ.కి.మీ. విస్తీర్ణంలోనూ కనిపించాయి.
* గాలి వేగాన్ని బట్టి ఇవి రోజుకు సుమారు 135- 150 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.
* ఎడారి మిడతలు అత్యంత విధ్వంసకరమైనవని ‘ఆహారం- వ్యవసాయ సంస్థ’ చెబుతోంది.


మన రాష్ట్రానికీ రావొచ్చు

ఎడారి ప్రాంతాలకే పరిమితమైన మిడతల దండు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సాగు మొదవుతుంది. అప్పుడు కనుక మిడతల దండు దాడి చేస్తే పత్తి, మిరప, వరి, పప్పుధాన్య పంటలు పాడవుతాయి. మిడతల నివారణకు మలాథియాన్‌ పిచికారీ చేయాలి. మిడతలు రాత్రి వేళ ఎగరలేవు కనుక ఆ సమయంలో మందులు చల్లి నియంత్రించాలి.

- దుర్గాప్రసాద్‌, శాస్త్రవేత్త, లాం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.