close

ప్రధానాంశాలు

కోర్టుతో ఆటలొద్దు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దన్నా వినరా?
పైగా పాడిపంటలకు సంబంధించినవని సమర్థించుకుంటారా?
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
జీవో 623 రద్దు
సీఎస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌పై కోర్టుధిక్కరణ కేసు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీ రంగులేయొద్దని తాము విస్పష్టంగా ఆదేశించినప్పటికీ పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగులు వేస్తున్నారని సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ భవనాలకు వైకాపా జెండాకు చెందిన ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో పాటు ఎర్రమట్టి రంగు వేసేందుకు ఉద్దేశించిన తాజా జీవో 623.. గతంలో తాము ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తోందని తేల్చిచెప్పింది. ఆ జీవోను రద్దు చేసింది. పాడిపంటలకు సంబంధించిన రంగులేస్తున్నామన్న ముసుగులో కోర్టు ఉత్తర్వులతో ఆడుకోవడానికి వీల్లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అవి వైకాపా రంగులు కాదన్న అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) సుధాకర్‌రెడ్డి వాదనలను తోసిపుచ్చింది. ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైకాపా రంగులు తొలగించాలన్న తమ తీర్పును అమలు చేయనందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌శాఖ  ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై కోర్టుధిక్కరణ కేసు కూడా నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. రంగుల విషయంలో గతంలో తాము ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే ఈ నెల 28న విచారణకు ఆ అధికారులు ముగ్గురూ హాజరై వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ని రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా అంగలకుదురుకు చెందిన రైతు సూర్యదేవర వెంకటరావు హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీ జెండాలకు చెందిన రంగులు వేయడానికి వీల్లేదని మార్చి 10న హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమ పంచాయతీ కార్యాలయానికి అధికార వైకాపా జెండా రంగులేయడాన్ని నిలువరించాలంటూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు రైతు ముప్ప వెంకటేశ్వరరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో.. ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులను పది రోజుల్లో తొలగించాలని ఆదేశించింది. వాటికి పార్టీల జెండాతో సారూప్యం లేని రంగును వేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. వీటి అమలుకు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి తగిన ఆదేశాలివ్వాలని పేర్కొంది. అయితే కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ వైకాపా జెండాలోని రంగులకు మరో రంగును జత చేసి వేసేందుకు ప్రభుత్వం జీవో 623 ఇచ్చిందంటూ అంగలకుదురు రైతు పిల్‌ వేశారు.

తాజా తీర్పులో హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘పంచాయతీ కార్యాలయాలకు వేసేందుకు ఇచ్చిన జీవోలో పేర్కొన్న 4 రంగుల్లో ఆకుపచ్చ, నీలం, తెలుపు వైకాపా జెండాను ప్రతిబింబిస్తున్నాయనడంలో సందేహం లేదు. అధికారులు ఆ రంగులు పాడిపంటలకు సంబంధించినవంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ పార్టీ రంగులు వేయకుండా ఉండేందుకు అధికారులు శ్రద్ధ పెట్టలేదు.4రంగులేయాలని నిర్ణయించిన కమిటీ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు కనిపించడం లేదు. గత తీర్పును పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను దాటవేయడానికి వీల్లేదు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా వారి జెండా రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం పరిపాటిగా మారిందని, ఆ విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన తీర్పు ఇచ్చాం. దానిపై సదుద్దేశం లేకనే మరోమారు వైకాపా జెండా రంగులే వేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైకాపా రంగులేయొద్దన్న మా తీర్పును సుప్రీంకోర్టూ సమర్థించింది. ఆ నిర్ణయాన్ని విస్మరించి ఎర్రమట్టి రంగును చేర్చి ప్రభుత్వం తన ఉద్దేశాన్ని పరోక్షంగా నెరవేర్చుకునేందుకు జీవో ఇచ్చింది’ అని వ్యాఖ్యానించింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని జీవో 623ను రద్దు చేస్తున్నామని పేర్కొంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.