close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజధానిని నిర్ణయించుకునేది రాష్ట్రమే

దానిలో మాకు ఎలాంటి పాత్రా లేదు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం
హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్రం పేర్కొంది. దానిలో తమకు ఎలాంటి పాత్రా ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 23న రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ ఉత్తర్వులనిచ్చిందని తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వం 2020 జులై 31న పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టాన్ని గెజిట్‌లో నోటిఫై చేసిందని పేర్కొంది. ఏపీకి 3 రాజధానులుంటాయని ఆ చట్టంలో రాష్ట్రం పేర్కొన్నట్టు కేంద్రం తెలిపింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేసేలా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పోలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి 2018లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దానిపై హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తరఫున హోంశాఖ అండర్‌ సెక్రటరీ లలిత టి.హెదావూ గురువారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషనర్‌ వేసిన వ్యాజ్యం వంటిదే సుప్రీంకోర్టులోనూ విచారణలో ఉందని తన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని మరోసారి తేల్చేసింది. రాజ్యాంగ నిబంధనల మేరకు.. చట్టం ద్వారా ఒక కొత్త రాష్ట్రాన్ని విభజించిగానీ రెండు రాష్ట్రాలను కలిపిగానీ, రెండు రాష్ట్రాల నుంచి విడగొట్టిన ప్రాంతాలను కలిపిగానీ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు ఉందని తెలిపింది. దాని ప్రకారమే కేంద్రం ఏపీని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, ఈ ప్రక్రియకు సంబంధించి పిటిషనర్‌ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సంబంధించి తాజా పరిస్థితిని వివరించే పత్రాలనూ అఫిడవిట్‌కు జత చేసింది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన చట్టం ప్రతుల్ని, విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2), (3), (4)ల కింద కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిన నిధుల జాబితాను అఫిడవిట్‌కు జత చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిపై అధ్యయనానికి కేంద్రం 2014 మార్చి 28న శివరామకృష్ణన్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించిందని అఫిడవిట్‌లో పేర్కొంది. కమిటీ 2014 ఆగస్టు 30న నివేదిక ఇచ్చింది. దాన్ని సెప్టెంబరు 1న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులనిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించింది. దానికి సంబంధించిన చట్టాన్ని గెజిట్‌లో నోటిఫై చేసింది’ అని వెల్లడించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శ్రీనివాసరావు వేసిన వ్యాజ్యాన్ని కొట్టి వేయాలని కోరింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలు..
ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదంటే..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని జాతి విస్తృత ప్రయోజనాల కోణంలో చూడాలి. హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని 14వ ఆర్థిక సంఘం చూపించలేదు. ఒక రాష్ట్రానికి వనరుల లోటుంటే.. దాన్ని పన్నుల్లో వాటా ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక సంఘం తెలిపింది. ఒకవేళ అప్పటికీ లోటు భర్తీ కాని రాష్ట్రాలకు, ప్రత్యేకంగా రెవెన్యూ లోటు భర్తీకి నిధులివ్వాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లలో రెవెన్యూ లోటు కింద రూ.22,113 కోట్లు చెల్లించాలని ఆర్థిక సంఘం సూచించింది. దాని ప్రకారం 2015-20 మధ్య రూ.22,111.88 కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సమకూర్చింది. 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాల్లో (సీఎస్‌ఎస్‌) 90 శాతం నిధులను కేంద్రం భరించడం ద్వారానూ (90:10 నిష్పత్తిలో), విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల్లో రుణం, వడ్డీని కేంద్రమే చెల్లించడం ద్వారానూ రాష్ట్రానికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
* 2014 జూన్‌ రెండో తేదీ నుంచి 2015 మార్చి 31 మధ్య ఆంధ్రప్రదేశ్‌కు వనరుల లోటు (రిసోర్స్‌ గ్యాప్‌) రూ.4117.89 కోట్లుగా అంచనా వేసి దానిలో రూ.3979.50 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
పోలవరం ప్రాజెక్టుపై..
ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం రాష్ట్రానికే అప్పగించింది. 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీన దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. అప్పటినుంచి మిగతా కాలానికి ప్రాజెక్టులోని ‘ఇరిగేషన్‌ కాంపొనెంట్‌’కయ్యే మొత్తం వ్యయాన్ని తానే సమకూర్చుతానని కేంద్రం పేర్కొంది. అప్పటినుంచి రూ.8,614.16 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2017-18 ధరల ప్రకారం సవరించిన ప్రాజెక్టు అంచనాలకు కేంద్ర జలవనరుల శాఖ నియమించిన కమిటీ ఆమోదించింది.
ఇతర అంశాలపై..
విభజన చట్టంలోని 92వ సెక్షన్‌ (12వ షెడ్యూల్‌)లోని అన్ని అంశాలనూ కేంద్రం అమలు చేసింది.
సెక్షన్‌ 93 (13వ షెడ్యూల్‌)
దీని ప్రకారం మౌలిక వసతుల ప్రాజెక్టులు, విద్యాసంస్థల ఏర్పాటు దీర్ఘకాలిక ప్రక్రియ. చట్టంలోనే పదేళ్ల గడువు ఉంది.
విభజన చట్టంలోని సెక్షన్‌ 94
1961నాటి ఆదాయపన్ను చట్టంలోని 32వ సెక్షన్‌ను కేంద్రం సవరించింది. దాని ప్రకారం.. 2015 ఏప్రిల్‌ 1 తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి నిర్దేశిత కొత్త యంత్రాలపై 35 శాతం చొప్పున డిప్రెసియేషన్‌ సదుపాయం కల్పిస్తోంది. సెక్షన్‌ 32 (డి) ప్రకారం 15 శాతం అదనపు పెట్టుబడి ప్రోత్సాహాన్నీ ఇస్తోంది.
* రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీల అమలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలకు సంబంధించీ అఫిడవిట్‌లో చెప్పిన అంశాలనే పునరుద్ఘాటించింది.
* వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రస్తావిస్తూ.. ఏపీలోని ఏడు జిల్లాలకు ఏటా రూ.50 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.1,400 కోట్లు, తెలంగాణకు రూ.1,800 కోట్లు ఇచ్చినట్టు తెలిపింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.