close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘జే’ టర్న్‌ వెనుక రహస్యమేంటి?

జగన్‌ వ్యాఖ్యలతో లోకేష్‌ వీడియోలు విడుదల
‘రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి’
‘హైదరాబాద్‌ను మించిన మహానగరాన్ని నిర్మిస్తాం’
‘వాషింగ్టన్‌ వంటి నగరాల్ని ఆదర్శంగా తీసుకుంటాం’
ఇవన్నీ గతంలో జగన్‌ చెప్పిన మాటలేగా!

ఈనాడు, అమరావతి: ‘ఏ రాజధానైనా సరే రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణించాలన్నా ఇబ్బంది పడకూడదు. దండిగా భూమి ఉండాలి. అభివృద్ధికి అవకాశం, నీళ్లు ఉండాలి. ఈ ప్రాతిపదికలతో ఎక్కడో చోట రాజధాని వస్తుంది’ అని గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గుర్తుచేశారు. రాజధాని ఏర్పాటు, మహానగరం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై గతంలో జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలను గురువారం ఆయన ట్విటర్‌లో విడుదల చేశారు. స్థానిక యువతకు ఉపాధి కల్పన, ఉద్యానవనాలు, విశాలమైన ఖాళీ స్థలాలతో ప్రపంచానికే తలమానికంగా నవ్యాంధ్రకు రాజధాని మహానగరాన్ని కడతామంటూ జగన్‌ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని లోకేష్‌ విమర్శించారు. జగన్‌ చెప్పిన వాటికంటే ఘనమైన లక్ష్యాలతో చంద్రబాబు నిర్మించిన ప్రజారాజధానిని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ కట్టాలనుకున్న రాజధాని కంటే గొప్పది చంద్రబాబు కట్టారని కూలగొడుతున్నారా? అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదని మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా? ఈ ‘జే’ టర్న్‌ వెనుక రహస్యమేంటి? అని ప్రశ్నించారు. ఆ ట్వీట్‌లకు జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలను జతపరిచారు.


ఆ వీడియోల్లో జగన్‌ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో ఉండేవారిని తిరుపతిలో ఉండండి అంటే వెళ్లరు. డాక్టర్లు, విద్యావంతులు పెద్ద నగరాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఒడిశా, బిహార్‌, తిరుపతి అంటే ఇష్టపడరు. ప్రతి ఒక్కరికీ తమ సొంతమనుకునేలా గొప్ప నగరం కావాలి. అన్ని ఆకర్షణలు అక్కడ ఉండాలి. చదువుకున్న యువకులు ఉండి, గౌతమ్‌ అదానీ, జీవీకే వంటి వారిని ప్రేరేపించగలిగితే ఆ నగరానికి 100 కి.మీ పరిధిలో పరిశ్రమ పెడతారు. విద్యావంతులు గుజరాత్‌లోనో, బెంగళూరులోనో ఉంటే ఇక్కడ పరిశ్రమ పెట్టరు. ఎవరైనా తమ పిల్లల్ని ఉద్యోగాల కోసం 100-150 కి.మీ దూరం పంపగలరు కాని 400-600 కి.మీ దూరం పంపించరు.
* ఉద్యోగాల కల్పనకు తొలిరోజు నుంచే ఓ కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ప్రతి జిల్లా తలసరి ఆదాయం, యువతకు ఉద్యోగవకాశాలు ఎలా మెరుగపరచాలో అధ్యయనానికి యాక్సించర్‌ కంపెనీని నియమించాం. వారితో రెండు మూడు సార్లు భేటీ అయ్యాం. ఎలా చేస్తే బాగుంటుందో వారు చెప్పారు. 


మా బుర్రలోంచి వచ్చే ఆలోచనలతో కడతాం

ఉమ్మడి రాష్ట్రంలో 75 శాతం వ్యాట్‌, 60 శాతం ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. ఇది ఇంజిన్‌ ఆఫ్‌ గ్రోత్‌. హైదరాబాద్‌ మనకు లేకుండా పోతున్నందుకు రాబోయే పదేళ్లు సవాల్‌గా తీసుకోవాలి. హైదరాబాద్‌ను మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా మా బుర్రలో వచ్చే ఆలోచనతో నిర్మిస్తాం. 20 ఏళ్ల కిందట బెంగళూరుకు ఉద్యనవనాల నగరిగా పేరుంది. చల్లగా ఉండేది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్‌ల్లో అన్నీ భవనాలే. పచ్చదనమే లేదు. విశాలమైన ఖాళీ స్థలాల కోసం ఐదారు కిలోమీటర్లు కార్లలో, బైకులపై వెళ్లాల్సి వస్తోంది. మేం కట్టబోయేది ఉద్యనవనాల నగరిగా ఉంటుంది. వాషింగ్టన్‌ డీసీ వంటి మహానగరాల్ని ఆదర్శంగా తీసుకుంటాం. రోడ్లు, భవనాలు ఇతర మౌలిక వసతులు చేకూర్చి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు అనువైన వాతావరణం కల్పిస్తాం. పారదర్శకంగా, అతివేగంగా గొప్పగా నిర్మిస్తాం. వీటితో డిమాండు సృష్టించి డబ్బులు తీసుకొస్తాం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.