close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్లాస్మాతో కొవిడ్‌ మరణాలు తగ్గడం లేదు

ఈ చికిత్స కోసం వైద్యులపై ఒత్తిడి తీసుకురాకూడదు: ఎయిమ్స్‌

దిల్లీ: కాన్వలసెంట్‌ ప్లాస్మా చికిత్స వల్ల కొవిడ్‌-19 రోగుల్లో మరణాల ముప్పు తగ్గలేదని ఎయిమ్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి కూడా పెద్దగా మెరుగుపడలేదని తేలింది. ప్లాస్మా చికిత్సపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనానికి సంబంధించిన మధ్యంతర విశ్లేషణ ఈ మేరకు పేర్కొంది. ‘నేషనల్‌ క్లినికల్‌ గ్రాండ్‌ రౌండ్స్‌ ఆన్‌ కొవిడ్‌-19’ పేరిట జరిగిన వర్చువల్‌ సదస్సులో.. ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి కరోనా బాధితుల్లో ప్లాస్మా చికిత్స ప్రయోజనం అంశంపై నిపుణులు చర్చించారు. ప్లాస్మా చికిత్స విధానంలో.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి యాంటీబాడీలను సేకరించి, కరోనా బాధితుల్లోకి ఎక్కిస్తారు. తద్వారా ఇన్‌ఫెక్షన్‌పై పోరాటం సాగించేలా బాధితుడి రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమవుతుంది. అయితే కాన్వలసెంట్‌ ప్లాస్మా చికిత్స వల్ల కొవిడ్‌ మరణాలు తగ్గుతున్న ఆధారాలేమీ తమ అధ్యయనంలో కనిపించలేదేని దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. 30 మంది బాధితులపై దీన్ని నిర్వహించామన్నారు. వీరిలో ఒక బృందానికి ప్రామాణిక చికిత్సతోపాటు ప్లాస్మా థెరపీని కూడా ఇచ్చామని చెప్పారు. మరో బృందానికి ప్రామాణిక చికిత్సను మాత్రమే అందించినట్లు వివరించారు. అయితే రెండు బృందాల్లోనూ మరణాల రేటు ఒకేలా ఉందని చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి కూడా పెద్దగా మెరుగుపడలేదన్నారు. ఇది మధ్యంతర విశ్లేషణ మాత్రమేనని, ప్లాస్మా థెరపీ వల్ల ఏదైనా ఉప బృందానికి ప్రయోజనం కలిగిందా అన్నది తేల్చేందుకు సవివర పరిశీలన చేయాల్సి ఉందని తెలిపారు. ప్లాస్మా సురక్షితమేనా అన్నది మొదట తేల్చాల్సి ఉంటుందని, అలాగే అందులో కొవిడ్‌ బాధితులకు ఉపయోగపడే సంఖ్యలో యాంటీబాడీలు ఉండాలని చెప్పారు.
ప్లాస్మా సురక్షితమేనని ఎయిమ్స్‌ వైద్య విభాగంలో అదనపు ప్రొఫెసర్‌ మోనిష్‌ సొనేజా పేర్కొన్నారు. ‘‘అయితే దాని సమర్థత విషయంలో ఇంకా స్పష్టత లేదు. అందువల్ల లోతుగా మదింపు చేశాకే బాధితులకు ప్లాస్మా చికిత్స ఇవ్వాలి. జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇది జరగాలి’’ అని తెలిపారు. కాన్వలసెంట్‌ ప్లాస్మాను పరిశోధనాత్మక చికిత్స విధానంగానే పేర్కొనట్లు తెలిపారు. దీని సమర్థతపై విస్పష్ట ఆధారాలేమీ లేవన్నారు. ఎయిమ్స్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన ప్రాథమిక అంశాలను ప్రస్తావిస్తూ.. ‘‘ఆ చికిత్స మంత్ర దండమేమీ కాదు. ప్రారంభ దశలో ఉండి, ఒక మోస్తరు స్థాయి వ్యాధి లక్షణాలు కనిపించినవారికి ఇది ప్రయోజనకరం కావొచ్చు. కొన్ని లక్షణాలున్న బాధితులకు దీనివల్ల లబ్ధి కలగొచ్చు. ఆ లక్షణాలేంటన్నది ఇంకా వెల్లడి కాలేదు. పరిశోధన సాగుతోంది’’ అని తెలిపారు. ఈ చికిత్స పొందడానికి బాధితుడు అర్హుడని వైద్యుడు తేల్చాలని, దీనిపై రోగి బంధువులు ఒత్తిడి తీసుకురాకూడదని ఎయిమ్స్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నీరజ్‌ నిశ్చల్‌ తెలిపారు. ఈ చికిత్స విధానం వల్ల.. రక్తం ద్వారా సోకే ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే ముప్పు కూడా ఉండొచ్చన్నారు.  సీరంలోని కొన్ని రేణువుల వల్ల ప్రతి చర్యలు తలెత్తవచ్చని, ఫలితంగా రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.