close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎం మనసు మారాలి

అమరావతిని కలల రాజధానిగా అభివృద్ధి చేయాలి
రాజధాని రైతుల డిమాండ్‌
232వ రోజుకు చేరిన రాజధాని ఆందోళనలు

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, తుళ్లూరు గ్రామీణం: పాలనలో, ప్రజల బాగోగులు చూడడంలో శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శమని, అటువంటి పాలన మళ్లీ రావాలని రాజధానివాసులు ఆకాంక్షించారు. ‘రామరాజ్యంతో దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆయనను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వాధినేతలు పరిపాలించాలి. మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి మనస్సు మార్చాలి. అమరావతిని కలల రాజధానిగా అభివృద్ధి చేసేలా పాలకులకు ఆలోచనలు కలిగించాలి...’ అని వారు వేడుకున్నారు. రైతులు చేస్తున్న నిరసనలు బుధవారం 232వ రోజుకు చేరుకున్నాయి. 29గ్రామాల్లో నిరసనలను కొనసాగించారు. రైతులు జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు చేసిన సవాల్‌కు అనుకూలంగా రాజధానివాసులు ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు భారీగా స్పందించారు. రాజధాని తరలింపును ఆపాలని కోరారు.

కుక్కలతో పోలుస్తారా..?: మహిళల ఆవేదన
హైకోర్టుకు న్యాయమూర్తులు వచ్చే సమయంలో ఆ మార్గంలో రైతులు, మహిళలు మోకాళ్లపై నిలబడి దండం పెట్టే చిత్రాన్ని కుక్కలతో పోలుస్తూ పెట్టిన పోస్టుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్నాథరథచక్రం పేరుతో సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడం అమానవీయం. మేం అందరి బాగు కోసం భూములిచ్చి మోసపోయాం. న్యాయం చేయాలని ఎండలో నిలబడి అభ్యర్థిస్తే ఇలా పోల్చడం నీచం. ఇళ్లల్లోని మహిళలపై కూడా ఇలాగే ప్రచారం చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టిన వారిని ఆగమేఘాలపై అరెస్టు చేస్తూ ఇబ్బంది పెడుతున్న పోలీసులు.. మాపై పెడుతున్న అభ్యంతరకరమైన వాటిపై అంతే వేగంగా స్పందించాలి...’ అని వారు డిమాండ్‌ చేశారు.
మా ప్రాణాలు తీసుకోండి: వృద్ధ రైతు కన్నీరు
మట్టినే నమ్ముకున్న రైతును మట్టిలోనే కలిసే పరిస్థితి తీసుకొస్తోందీ ప్రభుత్వం. ప్రభుత్వానికి భూములు ఇవ్వడమే మేం చేసిన తప్పా?.... అని మందడం గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆనాడు రాజధాని కోసం స్వచ్ఛందంగా నేలను ఇచ్చాం. నేడు అందరి కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. మేం నేల తల్లిని వదిలి పెట్టడమే మా ఖర్మ. పది మందికి పని కల్పిస్తూ ఘనంగా బతికాం. అటువంటి మాకు ఈ పరిస్థితిని సీఎం జగన్‌ తీసుకొచ్చారు. భూములిచ్చిన మేం సీఆర్‌డీఏలో వాటాదారులం. ఎన్నికల ముందు రాజధానిని తరలిస్తానని చెప్పకుండా ఇప్పుడు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. మా ప్రాణాలు తీసుకోండని, మానసికంగా హింసించకండి ...’ అని సీపీఐ నేత రామకృష్ణ ముందు ఎదుట ఆయన వేడుకున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. కోటయ్యను ఓదార్చిన రామకృష్ణ మాట్లాడుతూ భూములిచ్చిన రైతులను కన్నీరు పెట్టించడం మంచిది కాదన్నారు. దీక్షలకు సంఘీభావం తెలియచేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తుళ్లూరులో బుధవారం ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ నేతలు షేక్‌ మస్తాన్‌ వలీ, లింగంశెట్టి ఈశ్వరరావు, సుంకర పద్మశ్రీ, సీపీఐ నేత రామకృష్ణ, తదితరులు హాజరయ్యారు. పలువురు నేతలు మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రైతుల పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు.

రాజధానిపై సీఎం జగన్‌ తీరు సరికాదు
విజయవాడ, న్యూస్‌టుడే: రాజధానిని విశాఖకు తరలించడంలో సీఎం జగన్‌ తీరు సరికాదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వారు వామపక్ష నాయకులతో కలిసి మూడు రాజధానులు వద్దు- ఒక రాజధానే ముద్దు, అమరావతినే రాజధానిగా ఉంచి, పరిపాలన అక్కడి నుంచే కొనసాగించాలని కోరుతూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్‌ పరిపాలన మంచిగా చేస్తారని నమ్మి ఓట్లు వేస్తే ఆయన సైతం చంద్రబాబు తీరునే అనుసరిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో బాబుకు పట్టిన గతే జగన్‌కు పడుతుందని జోస్యం చెప్పారు.  సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు, అక్కినేని వనజ, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు బ్రహ్మయ్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర నాయకులు సుందర రామరాజు, ఎంసీపీఐ (యూ) రాష్ట్ర నాయకులు ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.