close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా ఖడ్గం

కొత్త కేసులు 10,128
గత 24 గంటల్లో మరణాలు 77
కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో 20 వేలు దాటిన కేసులు

కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రంలో ఉగ్రరూపం దాలుస్తోంది. మరోసారి ఒక్క రోజులోనే పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో వచ్చిన కేసుల్లో మళ్లీ తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాతో పాటు.. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్య ఇరవై వేలు దాటేసింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1.86 లక్షలు కాగా.. ఇప్పటివరకు 1,681 మంది ఈ వ్యాధి బారిన పడి అసువులు బాశారు.

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో మరో 10,128 కేసులు నమోదయ్యాయి. 77 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఒక రోజు వ్యవధిలో నమోదైన కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 60,576 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,544 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 20 వేల కేసులు దాటిన జిల్లాల్లో తూర్పుగోదావరి (26,229)తో పాటు కర్నూలు (22,063), అనంతపురం (20,061) ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,461కి చేరగా.. మొత్తం మృతుల సంఖ్య 1681కి చేరింది.
జిల్లాల వారీగా మరణాలు
కొవిడ్‌ వల్ల 24 గంటల వ్యవధిలో గుంటూరు జిల్లాలో 16 మంది, విశాఖలో 12, శ్రీకాకుళం-10, చిత్తూరు -8, తూర్పుగోదావరి - 7, కృష్ణా -5, నెల్లూరు-4, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురి చొప్పున, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు.
* మరో 8,729 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి కాగా ఇప్పటివరకు మొత్తం 1,04,354 మంది కోలుకున్నారు. 80,426 మంది చికిత్స పొందుతున్నారు.
* బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 22,35,646 వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 8.34 శాతం మందికి పాజిటివ్‌గా తేలింది.
* రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు నిర్వహించిన పరీక్షలతో పోలిస్తే పాజిటివ్‌ కేసుల శాతం అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉంది. ఆ జిల్లాలో 11.57% పాజిటివ్‌ కేసులు నమోదవగా, కృష్ణా జిల్లాలో అతి తక్కువగా 3.84 శాతం కేసులు నమోదయ్యాయి.


ఇస్రో కార్యాలయానికి తాళం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. ఫలితంగా ఆ సంస్థను సీల్‌డౌన్‌ చేశారు. కీలక అధికారికి గత వారం కరోనా సోకినట్లు నిర్ధరణ కావటంతో ఇక్కడి సిబ్బందిని క్వారంటైన్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


క్వారంటైన్‌ కేంద్రంలో బాధితుడి మరణం

తణుకు, న్యూస్‌టుడే: క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న బాధితుడు.. సకాలంలో చికిత్స అందక మరణించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన గణసాల రామాంజనేయులు (45) జ్వరం, దగ్గు, రొంపతో బాధపడుతూ తాడిమళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈనెల 4న వెళ్లారు. కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో వైద్యాధికారిణి పరీక్షలు చేసి, అనంతరం తణుకు ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆయనకు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నా సకాలంలో వైద్యం అందలేదని, అందుకే మరణించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. రామాంజనేయులు ఈనెల 4న రాత్రి 9 గంటలకు క్వారంటైన్‌ కేంద్రంలో చేరి, బుధవారం ఉదయం టిఫిన్‌ కూడా చేశారని విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు పి.శ్రీనివాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. కాసేపటి తర్వాత ఆయాసపడుతున్నారని పక్కన ఉన్న రోగులు తమ దృష్టికి తీసుకొస్తే వెళ్లి పరిశీలించగా సాధారణంగా కనీసం 95% ఉండాల్సిన ఆక్సిజన్‌.. 54%కి పడిపోయిందన్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి పంపేందుకు ప్రయత్నించామని, కానీ ఆలోపే మరణించారని తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రంలో చికిత్స అందించేందుకు పరికరాలు లేవని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.