close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
45,240 పడకలు సిద్ధం

కొవిడ్‌ చికిత్స కేంద్రాల్లో  ఏర్పాటు
ఒక్కో జిల్లాకు రూ.కోటి కేటాయింపు: కృష్ణబాబు

ఈనాడు అమరావతి: రాష్ట్రంలోని కొవిడ్‌ చికిత్స కేంద్రాల్లో 45,240 పడకలను సిద్ధం చేసినట్లు కొవిడ్‌-19 క్వారంటైన్‌, కొవిడ్‌ చికిత్స కేంద్రాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ప్రతీ జిల్లాలో కనీసం 3-5వేల పడకలను సిద్ధం చేస్తున్నామన్నారు. వైరస్‌ సోకినా లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. ఈ కేంద్రాల్లో మంచినీరు, మరుగుదొడ్ల ఏర్పాటు, ఈసీజీ, ఎక్స్‌రే, రక్త పరీక్షల ఏర్పాట్లకు జిల్లాకు రూ.కోటి వంతున విడుదల చేశామన్నారు. సమీపంలోని కొవిడ్‌ ఆస్పత్రులకు 15 నిమిషాల ప్రయాణ దూరంలో వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు వస్తే.. కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులనూ సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం 23 కేంద్రాల్లో 2,280 మంది ఉన్నారని పేర్కొన్నారు.

గుత్తేదారులకు చెల్లింపులు
‘‘గడిచిన రెండు రోజుల్లో క్వారంటైన్‌ కేంద్రాలు, కొవిడ్‌ చికిత్స కేంద్రాల్లో ఉన్నవారికి భోజనం, ఇతర సౌకర్యాలపై తృతీయపక్షంతో అధ్యయనం చేయించాం. గుత్తేదారులకు జూన్‌ 30 వరకు ఉన్న బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భోజనం ప్యాకింగ్‌లో ఐర్‌సీటీసీ సలహాలు, సూచనలు పొందాం. భోజనం తయారీలో నాణ్యత, ఇతర ప్రమాణాలు పాటించని వారికి మెమోలు ఇస్తాం. వచ్చే వారం నాటికి పరిస్థితుల్లో మార్పు రాకుంటే జరిమానా, ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం క్వారంటైన్‌ కేంద్రాల్లో 9,421 మంది ఉన్నారు.

వైరస్‌ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక
విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి రోజూ 13-15 వేల మంది వస్తున్నారు. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఇంతకుముందు తెలంగాణ, కర్ణాటక లేవు. ఇప్పుడు అవీ ఆ జాబితాలోకి వెళ్లాయి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చేవారిలో 10% మందికి ర్యాండమ్‌గా పరీక్షలు చేస్తున్నాం. మిగిలిన వారి చిరునామా, ఇతర వివరాలను ఎ.ఎన్‌.ఎం., సచివాలయ సిబ్బందికి పంపుతున్నాం. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినవారు రెండు వారాలు ఇళ్లలోనే ఉండాలి.

గల్ఫ్‌ నుంచి తిరుపతికి విమానాలు..
గల్ఫ్‌ దేశాల నుంచి తిరుపతి విమానాశ్రయానికి విమానాలు వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చేవారిలో కడప, చిత్తూరు, ఇతర జిల్లాలవారు ఎక్కువగా ఉంటున్నారు’’ అని వివరించారు.

సంచార సంజీవని!
ఆర్టీసీలోని ఇంద్ర బస్సులు ఇప్పుడు ‘కొవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ ల్యాబ్‌’గా మారాయి. వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు నమూనాలు సేకరించడానికి వీలుగా ఏసీ బస్సుల్లోని సీట్లను తొలగించి తక్కువ ఖర్చుతో తీర్చిదిద్దుతున్నారు. ప్రతి జిల్లాకు నాలుగు చొప్పున మొత్తం 52 సంచార ల్యాబ్‌లు విజయవాడలో తయారు చేస్తున్నారు. ఒక్కో బస్సులో ఏకకాలంలో 10 మంది నుంచి నమూనాలు తీసుకోవచ్చు. ఇప్పటికే 21 సిద్ధం చేసి ఆయా జిల్లాలకు పంపించారు. మిగతావి మరో పది రోజుల్లో పూర్తి కానున్నాయి. ఈ బస్సులకు ‘సంచార సంజీవిని’గా పేరుపెట్టారు. 


అంబులెన్సు రాదు.. ఇంట్లోకి వెళ్లలేరు!

విశాఖపట్నం (సీతంపేట), న్యూస్‌టుడే: ఒకవైపు కొవిడ్‌ పాజిటివ్‌ అన్న సమాచారం.. మరోవైపు అంబులెన్సు రాక నీరసం.. ఇంకోవైపు ఇంట్లోకి వెళ్లాలంటే ఆందోళన! విశాఖపట్నంలోని ఒక ఆలయంలో పనిచేసే ఉద్యోగికి దేవాదాయ శాఖ చేయించిన పరీక్షలలో పాజిటివ్‌ అని తేలింది. ఆ విషయాన్ని శుక్రవారం వార్డు వాలంటీర్‌ ఫోన్‌ చేసి తెలిపారు. మధ్యాహ్నం 108 అంబులెన్సు వస్తుందని, ఇంటి బయటే వేచి ఉండాలని ఆయనకు చెప్పారు. దాంతో ఆయన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఫుట్‌పాత్‌ మీదే కూర్చున్నారు. కానీ, ఎంత ఎదురుచూసినా అంబులెన్సు రాలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన పరిస్థితి చూసి స్థానికులు కొంత అల్పాహారం, టీ అందించారు. 11 గంటల సమయంలో స్థానిక నాయకులు కొందరు.. అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా జోన్‌2 కమిషనర్‌ సహా ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం వల్లే అంబులెన్సు రాలేదని అంటున్నారు. చివరకు ఆయనను రాత్రికి వార్డు కార్యాలయంలో ఉంచి.. తెల్లారాక ఆసుపత్రికి తరలించాలని స్థానిక నాయకులు యోచిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.