close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే హతం

 ఎన్‌కౌంటర్‌లో ముగిసిన నేరగాడి చరిత్ర
 కాన్పుర్‌కు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఘటన
 పిస్తోలు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించాడు
ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు: పోలీసుల వెల్లడి

కాన్పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘరానా నేరగాడు వికాస్‌ దుబే కథ ముగిసింది. తనను అరెస్టు చేయడానికి వస్తున్న 8 మంది పోలీసులను ఒక పథకం ప్రకారం దారుణంగా కాల్చి చంపించిన ఈ గ్యాంగ్‌స్టర్‌కు ఖాకీలు తిరిగి తమ తూటా రుచిని చూపించారు. శుక్రవారం కాన్పుర్‌ శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడు హతమయ్యాడు. యూపీకి తరలిస్తున్న సమయంలో పోలీసుల నుంచి అతడు పిస్తోలు లాక్కొని, కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు.
ఈ నెల 2న అర్ధరాత్రి దాటాక కాన్పుర్‌ సమీపంలోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేయడానికి వస్తున్న 8 మంది పోలీసులపై దుబే ముఠా మాటువేసి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుబే గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో ఉన్న మహకాలేశ్వరుడి ఆలయంలో పట్టుబడ్డాడు. యూపీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆ నేరగాడిని తీసుకొని ఒక వాహన శ్రేణిలో కాన్పుర్‌కు పయనమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ వాహనాలు కాన్పుర్‌ జిల్లాలోని భౌటీ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఇంతలో దుబేను తరలిస్తున్న ఎస్‌యూవీ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ఇన్‌స్పెక్టర్‌ రమాకాంత్‌ పచౌరి నుంచి పిస్తోలును లాక్కొని పరారయ్యేందుకు దుబే ప్రయత్నించాడు. తేరుకున్న మిగతా పోలీసులు ఆ నేరగాడిని వెంబడించి, చుట్టుముట్టారు. అయినా లొంగిపోని దుబే.. కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ గ్యాంగ్‌స్టర్‌ హతమయ్యాడు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడని ఓ ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. దుబేకు నాలుగు తూటాలు తగిలాయి. ‘‘పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు దుబే రేపు ప్రయత్నించొచ్చు. ఆ సందర్భంగా జరిగే ఎదురుకాల్పుల్లో అతడి కథ సమాప్తం కావొచ్చు’’ అంటూ యూపీ సివిల్‌ డిఫెన్స్‌ విభాగం ఐజీ అమితాబ్‌ ఠాకుర్‌ శుక్రవారమే నర్మగర్భ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత కొద్దిగంటలకే ఆయన వ్యాఖ్యలు నిజం కావడం గమనార్హం.

  ఘటనపై అనుమానాలు
ఉజ్జయిన్‌ ఆలయం వద్ద పట్టుబడ్డ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించని దుబే.. ఆ తర్వాతి రోజున బోల్తా పడ్డ వాహనంలో పోలీసు తుపాకీని లాక్కొని, కారు నుంచి బయటకు వచ్చి పరారీకి ఎలా యత్నిస్తాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసు వాహనశ్రేణి వెనుక వస్తున్న మీడియా వాహనాలను.. ఎన్‌కౌంటర్‌కు ఐదు నిమిషాల ముందు నిలిపివేశారు. ఉజ్జయిన్‌ నుంచి బయలుదేరే సమయంలో దుబే ఒక వాహనంలో ఉండగా.. ప్రమాదానికి లోనైంది మాత్రం వేరే వాహనం. అంత ప్రమాదకర నేరగాడి చేతులకు సంకెళ్లు ఎందుకు వేయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలను పోలీసులు ఖండించారు.
  విపక్షాల విమర్శలు
ఈ ఎన్‌కౌంటర్‌పై విపక్ష పార్టీలు యూపీలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఎదురుకాల్పుల ఘటన, గతవారం 8 మంది పోలీసుల కాల్చివేతపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని బీఎస్పీ అధినాయకురాలు మాయావతి డిమాండ్‌ చేశారు. ‘‘ఆ నేరగాడు ఇప్పుడు లేడు. మరి అతడికి ‘రక్షణ కల్పించిన’ వారి మాటేమిటి’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా దుబే ఎన్‌కౌంటర్‌పై సందేహాలు లేవనెత్తారు.
  పోలీసు చర్య సబబే: దుబే తండ్రి
ఘోర నేరాలకు పాల్పడ్డ తన కుమారుడిని పోలీసులు కాల్చిచంపడం సబబేనని వికాస్‌ దుబే తండ్రి రామ్‌కుమార్‌ పేర్కొన్నాడు. తన కుమారుడి అంత్యక్రియలకూ హాజరుకాబోనన్నాడు.

చంపకుండా చూడాలని పిటిషన్‌
దుబేను చంపరాదంటూ యూపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని.. ఈ ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. దుబే అనుచరుల కాల్చివేత ఘటనలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని కూడా పిటిషనర్‌, న్యాయవాది ఘన్‌శ్యామ్‌ ఉపాధ్యాయ్‌ కోరారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.