close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకే ఆకాంక్ష.. మహాదీక్ష

తుళ్లూరు నుంచి షికాగో వరకు సంఘీభావాల వెల్లువ

200వ రోజున రాజధాని రైతుల వినూత్న నిరసన
రాష్ట్రవ్యాప్తంగా దీక్షలతో మద్దతు
విదేశాల్లోని 300 నగరాల్లో ప్రవాసాంధ్రుల నినాదాలు

నవ్యాంధ్రకు మహారాజధాని నిర్మిస్తామంటే ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్న భూములను స్వచ్ఛందంగా ఇచ్చాం. అనూహ్యంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, మా త్యాగాలను తుంచేస్తూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదు’’ అంటూ అమరావతి రాజధాని గ్రామాల రైతులు, రైతుకూలీలు, ప్రజలు ఉద్యమబాట పట్టారు. వారి పోరాటం శనివారానికి 200 రోజులకు చేరింది. ఈ సందర్భంగా తుళ్లూరు నుంచి షికాగో వరకు జై అమరావతి నినాదం మిన్నంటింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు.. సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాల నుంచి... వివిధ దేశాల్లోనూ ఇవి కొనసాగాయి. దీక్షలకు వివిధ పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక, సామాజిక వేత్తలు, పలు రంగాల ప్రముఖులు మద్దతు ప్రకటించారు. భాజపా, వామపక్షాలు, అఖిలభారత హిందూ మహాసభ, అమరావతి ఐకాస.. ఇలా అన్నివర్గాలకు చెందినవారూ ఈ దీక్షలు, నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.


రాజధానిలో మిన్నంటిన నినాదాలు

అసువులుబాసిన రైతులు, రైతు కూలీలకు నివాళి

పోలీసు ఆంక్షల మధ్యా కొనసాగిన నిరసనలు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే తుళ్లూరు,

తుళ్లూరు గ్రామీణం, ఈనాడు డిజిటల్‌, అమరావతి

మరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తున్న పోరాటం 200 రోజుకు చేరడంతో శనివారం 29 గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు మహాదీక్ష నిర్వహించారు. కరోనా నిబంధనలు, పోలీసుల కఠిన ఆంక్షల మధ్య ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగాయి. అందరూ ఒకేచోట గుమికూడకుండా ప్రతి గ్రామంలో అయిదు నుంచి పది శిబిరాలు ఏర్పాటు చేశారు. మిగతావారు ఇళ్లల్లోనే దీక్షలు చేశారు. అమరావతి రైతులు, రైతు కూలీల ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. రాజధాని గ్రామాల్లో వీధివీధినా రైతులు, మహిళలు, చిన్నారులు ప్లకార్డులు, ఐకాస జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. తొలుత... ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. అన్ని గ్రామాల్లోనూ మృతుల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 గంటలకు ‘అమరావతి వెలుగు’ నిర్వహించారు. ఇళ్లల్లోని విద్యుత్తు దీపాలను ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించారు.

* తుళ్లూరులో బుద్ధుడి విగ్రహానికి పూలమాలలు వేసి.. మీరైనా సీఎంకు జ్ఞానోదయం కలిగించాలని విన్నవించారు.
* దొండపాడులో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో మహిళలు, రైతులు ప్రదర్శన నిర్వహించారు.
* ఉద్దండరాయునిపాలెంలో ప్రదర్శనగా వెళ్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దళితనాయకులు అంబేడ్కర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
* యువజన ఐకాస ప్రతినిధి రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రాయపూడి రేవు వద్ద ఛాతి లోతు వరకు ఇసుకలోకి దిగి నిరసన తెలిపారు.
* తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రంలో కోటిలింగేశ్వర స్వామికి పూజలు చేశారు.
* బోరుపాలెంలో రైతులు, మహిళలు ఐకాస జెండాలతో గ్రామ వీధుల్లో ర్యాలీ తీశారు.

భారీ బందోబస్తు
ఈ సందర్భంగా గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో నిర్వహించిన శిబిరాల వద్దకు ఎవరూ రాకుండా పెద్ద సంఖ్యలో మోహరించారు. వారివారి వీధుల్లోను, ఇళ్లల్లోను మాత్రమే నిరసనలు తెలియజేసేందుకు పోలీసులు అనుమతిచ్చారు.

నాయకుల మద్దతు
మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌ బాబు, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, వంగవీటి రాధాకృష్ణ, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు శ్రీనివాస్‌యాదవ్‌, పోతిన మహేష్‌, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు, ఐకాస కన్వీనర్‌ సుధాకర్‌ పలు శిబిరాలను సందర్శించారు.

విజయవాడలో...
విజయవాడ ఆటోనగర్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో కొందరు మహిళలు రాజధాని రైతులకు మద్దతుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించారు. సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, బాబూరావు, తెదేపా నుంచి గద్దె అనూరాధ, కాంగ్రెస్‌ నుంచి సుంకర పద్మశ్రీ తదితరులు వచ్చి వారికి సంఘీభావం తెలిపారు.


కార్యాలయాలు మార్చడం కాదు
-తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

‘‘అభివృద్ధివికేంద్రీకరణంటే కార్యాలయాలు మార్చడం కాదు. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టి... ప్రగతి సాధించాలి. స్థానిక సంస్థలకు విధులు, నిధులను బదిలీ చేయాలి. తెదేపా ప్రభుత్వం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు రివైజ్డ్‌ బడ్జెట్‌లో రూ.31,208 కోట్లు కేటాయించగా.. దాన్ని జగన్‌ ప్రభుత్వం రూ.11,661 కోట్లకు తగ్గించింది ’’


రాజకీయ రాజధాని వద్దంటున్న విశాఖ వాసులు
-మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి

‘‘విజయసాయిరెడ్డి విశాఖ వచ్చాక భూ కబ్జాలు పెరిగాయి. ఇక జగన్‌రెడ్డి కూడా వస్తే పరిస్థితి ఏంటి? విశాఖలో జగన్‌ బినామీలకు, విజయసాయిరెడ్డికి, ఆయన అల్లుడికి వందల ఎకరాల భూములున్నాయి. పాలనా రాజధాని ప్రకటనకు ముందే వైకాపా మంత్రులు పది వేల ఎకరాలకు పైగా ఇక్కడ భూములు కొన్నారు. నాలుగు అద్దె భవనాల నుంచి పరిపాలిస్తే ప్రయోజనమేంటి..? పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలి. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. అమరావతిని దెబ్బతీయొద్దని ఉత్తరాంధ్రవాసులు కోరుతున్నారు’’.


అమరావతి దేశానికి సంపద సృష్టించే ప్రాజెక్టు

విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉంటుందని చెప్పారేగానీ మూడు అనలేదు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులను మార్చుకుంటూ పోతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? అమరావతి దేశానికి సంపద సృష్టించే ప్రాజెక్టు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్ల ఇచ్చింది. ఇంకా ఇస్తామని చెప్పింది. అందుకే ఈ రాష్ట్రాన్ని, అమరావతిని కాపాడాల్సిందిగా కేంద్రాన్నీ, ప్రధానినీ కోరుతున్నా.

- చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత


అమరావతి దక్షిణ భారతదేశానికి అయోధ్య. ఈ పవిత్ర భూమిలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. అమరావతిలో రాజధాని సహా రామమందిరాన్ని సైతం నిర్మించి తీరతాం.

- చక్రపాణి మహారాజ్‌, జీవీఆర్‌ శాస్త్రి, అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్ష, ఉపాధ్యక్షులు

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.