close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్ని వయసుల వారినీ కాటేస్తోంది

కరోనా మృతుల్లో ఎక్కువ మందికి ఇతర అనారోగ్య సమస్యలు
చికిత్స తీసుకోవడంలో జాప్యం వద్దంటున్న వైద్యులు

ఈనాడు, అమరావతి: కరోనా వైరస్‌ అన్ని వయసుల వారి ప్రాణాలనూ హరిస్తోంది. మహమ్మారి వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 218 మంది చనిపోయారు. ఇప్పటికే అనారోగ్యాలతో ఉండి.. వైరస్‌ బారినపడిన వారు సకాలంలో చికిత్స పొందడంలో జాప్యం జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలిక వైరస్‌ బారినపడి ప్రాణాలు విడిచింది. 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఆరుగురు మరణిస్తే వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. రక్తహీనత, ఇతర అనారోగ్య కారణాల వల్ల వీరు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

రాష్ట్రంలో శుక్రవారానికి నమోదైన 206 మరణాలను పరిశీలిస్తే 49 ఏళ్లలోపు వయసు ఉన్న వారు 51 మంది ఉన్నారు. మిగిలిన 155 మంది వయసు 50 నుంచి 92 ఏళ్ల మధ్యన ఉంది. వీరిలో రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు 90% మంది ఉన్నారు. వీటితోపాటు మూత్రపిండాల సమస్యలు, ఉబ్బసం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వైరస్‌కి చిక్కి ప్రాణాలు విడిచిన వారు 72 మంది ఉన్నారు. మొత్తం మృతుల్లో 49 మంది మహిళలున్నారు.

ఫలితాల రాకలో ఆలస్యం.. ఆపై అలసత్వం!
లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోకపోవడం, చేయించుకున్న తర్వాత ఫలితం ఆలస్యంగా రావడం, ఆసుపత్రిలో చేరడంలో జాప్యం వంటి కారణాలవల్ల కూడా మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. లక్షణాలు కనిపించిన 5 రోజుల్లో ఆసుపత్రుల్లో చేరగలిగి...సత్వరం చికిత్స అందిస్తే కొన్ని ప్రాణాలు దక్కే అవకాశం ఉందని తెలిపారు. కొందరు అనుమానిత లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోకుండా ఇష్టమొచ్చిన మందులను వాడి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని వెల్లడించారు.

నమూనాల సేకరణలో లక్షణాలున్న వారికి ప్రాధాన్యం
కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ప్రాధాన్యం ఇవ్వాలని   వైద్య, ఆరోగ్యశాఖ నుంచి జిల్లా అధికారులకు సూచనలు వెళ్లాయి. నమూనాల సేకరణ పెరుగుతున్నా.. ఫలితాలు సకాలంలో రావడంలేదు. దీనివల్ల   బాధితులు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అనుమానిత లక్షణాలున్న, 60 ఏళ్లకు పైబడినవారు, కట్టడి ప్రాంతాల్లోని వారి నుంచి నమూనాలను   సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ పలు జిల్లాల కలెక్టర్లకు తెలిపినట్లు సమాచారం.

సీఎం నివాసం వద్ద భద్రతా విధులకు వెళ్లిన ఏడుగురికి పాజిటివ్‌
ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంవద్ద భద్రతా విధులకు వెళ్లిన ఏడుగురు కరోనా వైరస్‌ బారినపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం పరిధిలోని ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ సిబ్బంది నెలన్నర కిందట ముఖ్యమంత్రి నివాసంవద్ద భద్రతా విధుల కోసం వెళ్లారు. వీరికి ఈ నెల 2న పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని 3వ బెటాలియన్‌ అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

తమిళనాట కొత్తగా 4,280 కేసులు
చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులో శనివారం ఒక్కరోజే 4,280 మందికి కరోనా సోకిందని  ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 1,07,001కి చేరింది. శనివారం 65 మంది ప్రాణాలు కోల్పోవడంతో... మృతుల సంఖ్య 1,450కి పెరిగింది.

కర్ణాటకలో 1,839 కేసులు
బెంగళూరు, న్యూస్‌టుడే: కర్ణాటకలో శనివారం 1,839 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 21,549కి చేరుకుంది. మరో 42 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 335కు చేరుకుంది. కేసుల నియంత్రణలో భాగంగా శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రభుత్వం కర్ణాటకలో లాక్‌డౌన్‌ను అమలులోకి తెచ్చింది.

తెలంగాణలో 1,850 కేసులు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో శనివారం ఒక్కరోజునే కొత్తగా 1,850 కేసులు నమోదయ్యాయి. వాటిలో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 1,572 వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 22,312కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 288గా చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో పనిచేస్తున్న పది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.