close

ప్రధానాంశాలు

అమేయం.. అపూర్వం..

ఘనంగా గణతంత్ర వేడుకలు
  సైనిక పాటవం, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిన భారత్‌
దిల్లీ

సైనిక పాటవం, ఘన సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక-ఆర్థిక పురోగతిని చాటుతూ భారత్‌ తన 71వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకుంది. దిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 90 నిమిషాల పాటు సాగిన ఈ వేడుకను దేశ అత్యున్నత రాజకీయ, సైనిక నాయకత్వం, విదేశీ ప్రతినిధులు, వేల మంది ప్రజలు తన్మయంతో వీక్షించారు. ఈ కార్యక్రమానికి బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయీర్‌ మిసియాస్‌ బొల్సోనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర వేడుకల్లో ఆ దేశాధినేత ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది మూడోసారి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర అగ్రనేతలు ఇందులో పాల్గొన్నారు. ఈసారి వేడుకల్లో అనేక కొత్త అంశాలు కనిపించాయి. ఆనవాయితీకి భిన్నంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అలాగే కవాతులో త్రివిధ దళ హెలికాప్టర్‌ విన్యాసం, ‘మిషన్‌ శక్తి’ కింద అభివృద్ధి చేసిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి, పోరాట హెలికాప్టర్‌ అపాచీ, రవాణా హెలికాప్టర్‌ చినూక్‌, శతఘ్ని వ్యవస్థ ‘ధనుష్‌’ సహా అనేక ముఖ్య ఆయుధాలను తొలిసారిగా ప్రదర్శించారు.


ముఖ్య అతిథి బొల్సోనారోతో కలసి వేదిక వద్దకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో జాతీయ గీతాలాపన జరిగింది. సైన్యం శతఘ్నులను పేలుస్తూ ‘21 గన్‌ సెల్యూట్‌’ను సమర్పించింది. అనంతరం త్రివిధ దళాలు, పారామిలటరీ, ఇతర విభాగాలకు చెందిన సైనికులు అద్భుతంగా కవాతు చేస్తూ రాష్ట్రపతికి గౌరవ వందనాన్ని సమర్పించారు. టి-90 ట్యాంకు, కె-9 వజ్ర శతఘ్ని, సంచార ఉపగ్రహ టెర్మినల్‌, ఆకాశ్‌ క్షిపణులు ఈ కవాతులో ఆకట్టుకున్నాయి. వైమానిక దళం తన తేజస్‌ యుద్ధవిమానాన్ని, తేలికపాటి పోరాట హెలికాప్టర్‌ నమూనాలను, అస్త్ర క్షిపణులను ప్రదర్శించింది. నౌకాదళానికి చెందిన కోల్‌కతా తరగతి స్టెల్త్‌ యుద్ధనౌక, కల్వరి జలాంతర్గామి, స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి విమానవాహక నౌక విక్రాంత్‌ నమూనాలు వీక్షకులను కట్టిపడేశాయి. అనంతరం వివిధ రాష్ట్రాలు, శాఖలకు చెందిన అద్భుత శకటాలు రాజ్‌పథ్‌పైకి వచ్చాయి. ఇందులో వివిధ ఇతివృత్తాలను ప్రదర్శించారు.

 

నారీ శక్తి
మహిళా శక్తి ఈ వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. మొత్తం పురుష జవాన్లతో కూడిన ఒక సైనిక బృందానికి కెప్టెన్‌ తానియా షేర్‌గిల్‌ నాయకత్వం వహించారు. సీఆర్పీఎఫ్‌కు చెందిన మహిళా బృందం మోటారు సైకిళ్లపై చేసిన విన్యాసాలను పౌరులు ఊపిరి బిగబట్టి వీక్షించారు.

వాయు గర్జన
చివర్లో దాదాపు 40 యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు నిర్వహించిన విన్యాసాలు మన పైలెట్ల సత్తాను ప్రపంచానికి చాటాయి. తొలుత మూడు ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్లు త్రిశూలం ఆకారంలో వచ్చాయి. ఇవి త్రివిధ దళాల నుంచి వచ్చాయి. ఆ తర్వాత కొత్తగా సమకూర్చుకున్న చినూక్‌ హెలికాప్టర్లు విక్టరీ ఆకృతిలో విహరించాయి. అనంతరం ఐదు ఆపాచీ హెలికాప్టర్లు దూసుకొచ్చాయి. వీటికితోడు మూడు డోర్నియర్‌ విమానాలు, సి-130 జె సూపర్‌ హెర్క్యులెస్‌, మూడు సి-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాలు, గగనతల ముందస్తు హెచ్చరికల విమానం ‘నేత్ర’ కవాతులో పాల్గొన్నాయి. ఐదు జాగ్వార్‌ యుద్ధవిమానాలు, సుఖోయ్‌ జెట్లు పలు విన్యాసాలు నిర్వహించాయి.

యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళులు
వేడుక ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రివిధ దళాల అధిపతులు, దేశ తొలి త్రిదళాధిపతి ఉన్నారు. గతంలో ఈ కార్యక్రమాన్ని ఇండియా గేట్‌ వద్ద ఉన్న ‘అమర్‌జవాన్‌ జ్యోతి’ వద్ద నిర్వహించారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని గత ఏడాది ఫిబ్రవరి 25న ప్రధాని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణంలో అమర్‌ చక్ర, వీర్తా చక్ర, త్యాగ చక్ర, రక్షక్‌ చక్ర ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన 25,942 మంది అమర సైనికుల పేర్లను గ్రానైట్‌ ఫలకాలపై చెక్కారు.
గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో వర్ణరంజితమైన తలపాగాలను మోదీ ధరిస్తుంటారు. ఈసారి కూడా ఆయన కాషాయి రంగు తలపాగాతో ఆకట్టుకున్నారు. గణతంత్ర వేడుకల అనంతరం మోదీ.. రాజ్‌పథ్‌పై నడుస్తూ జనాలకు అభివాదం చేశారు.


డీఆర్‌డీవో బృందానికి తెలుగు శాస్త్రవేత్త నాయకత్వం

గణతంత్ర వేడుకల్లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బృందానికి తొలిసారిగా ఒక శాస్త్రవేత్త నాయకత్వం వహించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌) అస్త్రాన్ని మోసుకెళ్లిన వాహనంపై వై.శ్రీనివాసరావు నిలబడి.. రాష్ట్రపతికి వందనం సమర్పించారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఈ తెలుగు తేజం.. ఏశాట్‌ క్షిపణికి ప్రధాన రూపశిల్పిగా వ్యవహరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.