close

ప్రధానాంశాలు

ఈ కీచకుల్నీ కాల్చేయండి!

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి
లేదంటే ఉరి తీయాలి
‘ఉన్నావ్‌’ బాధితురాలి కుటుంబసభ్యుల డిమాండ్‌
దిల్లీ/ఉన్నావ్‌

అకృత్యాలకు పాల్పడేవారిని హైదరాబాద్‌లో దిశ నిందితుల తరహాలోనే ఎన్‌కౌంటర్‌ చేయాలని లేదా ఉరి తీయాలని ‘ఉన్నావ్‌’ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. బాధితురాలిపై ఏడాది క్రితం అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు గురువారం ఆమెను సజీవదహనం చేసేందుకు యత్నించారు. 90 శాతం కాలిన గాయాలతో దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. శనివారం శవపరీక్ష పూర్తైన అనంతరం బాధితురాలి మృతదేహాన్ని ఉన్నావ్‌ జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించారు. బాధితురాలి తండ్రి, సోదరుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయాలని లేదా ఉరి తీస్తే చూడాలని ఉందని పేర్కొన్నారు. మరోవైపు, బాధితురాలికి న్యాయం చేయడంలో, భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. బాధిత కుటుంబానికి వీలైనంత వేగంగా న్యాయం చేసేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ చేయిస్తామని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. అత్యాచార బాధితురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

కుమార్తెపై ద్రావణం పోసిన తల్లి
ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం మధ్యాహ్నం  సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి ఎదుట ఓ తల్లి తన మైనర్‌ కుమార్తెపై మండే స్వభావమున్నదిగా భావిస్తున్న ద్రావణాన్ని పోసింది. బాధితురాలి మృతదేహాన్ని తరలించిన గంట తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ ఆ మహిళ నినదించింది. పోలీసులు బాలికను రక్షించి, తల్లీకుమార్తెలను తమతో తీసుకెళ్లారు.

మంత్రుల రాకపై నిరసన
మరోవైపు, శనివారం ఉన్నావ్‌ జిల్లాలోని బాధితురాలి ఇంటికి వచ్చిన యూపీ రాష్ట్ర మంత్రులు స్వామీ ప్రసాద్‌ మౌర్య, కమల్‌రాణి వరుణ్‌, స్థానిక భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌లకు చేదు అనుభవం ఎదురైంది. వారి రాకను నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు, స్థానికులు ప్రదర్శన చేపట్టారు. ‘వెనక్కి వెళ్లిపోండి. వెనక్కి వెళ్లిపోండి’ అంటూ సుమారు 15 నిమిషాల పాటు నినాదాలు చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కొందరు గాయపడ్డారు. అనంతరం మంత్రులు, ఎంపీని పోలీసులు బాధితురాలి ఇంట్లోకి తీసుకెళ్లారు.

ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: అఖిలేశ్‌
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అత్యాచార బాధిత మహిళ మరణాన్ని నిరసిస్తూ శనివారమిక్కడ ఆయన విధాన సభ భవనం ఎదుట బైఠాయించారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో యోగి సర్కారు విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుమోటోగా తీసుకోవాలి: మాయావతి
దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోవడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కోరారు. మహిళలపై నేరాలను అడ్డుకునేందుకు తక్షణం చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నేరస్థులకు కొమ్ము కాస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. శనివారం ఆమె ‘ఉన్నావ్‌’ బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘‘రాష్ట్రంలో అరాచకం, మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. యూపీలో అసలు మహిళలకు స్థానం ఉందా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు. ‘ఉన్నావ్‌’ అత్యాచార బాధితురాలు మరణించడం ప్రతి భారతీయుడికీ అవమానకరమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.