close

ప్రధానాంశాలు

న్యాయం.. ప్రతీకారానికి కాదు

అలా అయితే అది సహజ గుణాన్ని కోల్పోతుంది
తక్షణ తీర్పులు ఎప్పుడూ సాధ్యం కాదు
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ బోబ్డే అభిప్రాయం
ఈనాడు - దిల్లీ

న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపాన్ని సంతరించుకోకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. అదే జరిగితే న్యాయం తన సహజ గుణాన్ని కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. తక్షణ న్యాయం అంటూ ఉండదని అన్నారు. శనివారం ఉదయం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా జరిగిన ఆ రాష్ట్ర కొత్త హైకోర్టు భవన ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో ఇటీవల జరిగిన సంఘటనలు పాత చర్చను సరికొత్తగా వినిపించాయి. ప్రస్తుతం ఉన్న క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థను పునఃసమీక్షించాలనడంలో అనుమానం లేదు. కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న సమయం, అందులో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని పరిస్థితి, వైఖరిని మనం పునఃపరిశీలించాల్సి ఉంది. తక్షణ న్యాయం ఎప్పుడూ సాధ్యం కాదన్న విషయం గుర్తుంచు కోవాలి. అలాగే న్యాయం ప్రతికార రూపం సంతరించుకోకూడదు. అలాంటి రూపం సంతరించుకుంటే న్యాయం తన సహజరూపాన్ని కోల్పోతుంది. వ్యాజ్యాలను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా న్యాయ వ్యవస్థ స్వీయ దిద్దుబాటు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.  వివాదాలను మొగ్గదశలోనే (ప్రీ-లిటిగేషన్‌) పరిష్కరించే మధ్యవర్తిత్వ విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా వివాదాలను నివారించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసి, అందులో వచ్చిన ఫలితాన్ని డిక్రీ తరహాలో అమలు చేయాలి. సకాలంలో న్యాయం అందించడానికి సాంకేతిక వ్యవస్థను ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవాలి. వేగవంతంగా న్యాయం అందించడానికి సుప్రీంకోర్టు ఇటీవలే అధికారిక మొబైల్‌ అప్లికేషన్‌, కృత్రిమ మేధ ఆధారంగా అనువాదం చేసే ‘సుప్రీంకోర్టు విధిక్‌ అనువాద్‌ సాఫ్ట్‌వేర్‌-సువాస్‌’ను ఆవిష్కరించింది. దీనివల్ల సర్వోన్నత న్యాయస్థాన వ్యవహారాలు దేశంలోని మారుమూలనున్నవారికీ అందుబాటులోకి వచ్చాయి’’ అని జస్టిస్‌ బోబ్డే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ రవీంద్ర భట్‌ పాల్గొన్నారు.

సామాన్యుడికి అందనంత దూరంలో న్యాయప్రక్రియ
రాష్ట్రపతి ఆవేదన

జోధ్‌పుర్‌: న్యాయప్రక్రియ అనేది ఎన్నో కారణాల దృష్ట్యా సామాన్యుడికి అందనంత దూరంలో ఉందంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయప్రక్రియ సామాన్య కక్షిదారులకు అందుబాటులోకి లేకుండా పోయిందన్నారు. ‘‘పాత రోజుల్లో ఎవరైనా రాజభవనాల వద్దకు వచ్చి గంట కొట్టి రాజుకు తమ సమస్యలు చెప్పుకొనే వారని మనం చదువుకున్నాం. ప్రస్తుతం సామాన్యులు, పేదలు తమ సమస్యలు చెప్పుకొనే పరిస్థితి ఉందా? న్యాయాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని రాజ్యాంగం ప్రవేశికలోనే ఉంది’’ అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కూడా ఇదే అంశంపై ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.