close

ప్రధానాంశాలు

నమ్మకానికి దెబ్బ: ఆర్‌కే సింగ్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం - సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తిదారుల మధ్య కుదిరిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై మళ్లీ సంప్రదింపులు జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఆరంగానికి చెందిన పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసిందని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ పేర్కొన్నారు. దేశంలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగం వృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. గురువారం లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

రూ.10.94 కోట్లు సాక్షర నిధులు ఖర్చు కాలేదు
సాక్షర భారత్‌ పథకంలో భాగంగా కేంద్రం వాటాగా ఇచ్చిన నిధుల్లో ఏపీ రూ.10.94 కోట్లు ఖర్చు చేయలేదని కేంద్రం పేర్కొంది. 2009-10 నుంచి 2017-18 వరకు రూ.310.30 కోట్లు కేంద్ర వాటాగా విడుదల చేశామని తెలిపింది. నిధులు ఖర్చు చేయని నేపథ్యలోనే తదుపరి విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. భాజపా సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఏపీలో 8,295 మంది చిన్నారులపై నేరాలు
జాతీయ నేర నివేదిక ప్రకారం 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 8,295 మంది చిన్నారులపై నేరాలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో సమాధానమిచ్చారు.

61,855 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం
ఆంధ్రప్రదేశ్‌లోని 61,855 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉందని కేంద్రం పేర్కొంది. యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూ-డీఐఎస్‌ఈ) 2017-18 వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 96.4 శాతం పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉందని తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

కృష్ణా నది కలుషితం
అమరావతి-హంసలదీవి మధ్యలో కృష్ణానది కలుషితమైనట్లు గుర్తించామని జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

పడవ ప్రమాదానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..
పడవ ప్రయాణాలకు సంబంధించి సర్వే, రిజిస్ట్రేషన్‌, మర పడవలకు లైసెన్సులివ్వడం, ప్రయాణికుల రక్షణ, రాకపోకలు, మరణాలపై విచారణ బాధ్యత ఆ ప్రభుత్వానిదేనని నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవ్య తెలిపారు. గోదావరిలో పడవ మునకపై నరసాపురం, కడప ఎంపీలు రఘురామకృష్ణరాజు, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

బాధితుల గోప్యతపై దృష్టి పెట్టాలి

ఈనాడు, దిల్లీ: బాధితుల గోప్యత హక్కు విషయంపై అంతా దృష్టి సారించాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ కోరారు. దిశ ఘటనపై లోక్‌సభ శూన్య గంటలో గురువారం మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒక మహిళపై అనాగరికం, క్రూరమైన ఘటన చోటు చేసుకుందన్నారు.  వేగంగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మీడియాలో బాధితురాలి పేరు, ఫొటో, కుటుంబవివరాలు బయటకు వచ్చాయని.. ఇది గోప్యత హక్కును దారుణంగా ఉల్లంఘించడమేనని అన్నారు.
సివిల్‌ సర్వీస్‌ ఉత్తీర్ణుల్లో హిందీ మాతృభాష వారే ఎక్కువ
దేశంలో అత్యున్నతంగా భావించే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో హిందీ మాతృభాషగా ఉన్న వారే అత్యధికంగా ఉత్తీర్ణులయినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. ఆయన గురువారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
అంతరిక్ష సాంకేతిక రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం..
అంతరిక్ష సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి దేశంలోని కొన్ని ఐఐటీల్లో స్పేస్‌ టెక్నాలజీ సెల్స్‌ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. బాంబే, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌ ఐఐటీలతోపాటు, బెంగళూరులోని ఐఐఎస్‌సీ, పుణెలోని సావిత్రీభాయిపూలే పుణె యూనివర్శిటీలో సంయుక్త పరిశోధన కార్యక్రమాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

నాబార్డుతో ముడిపెట్టొద్దు: సుబ్బిరామిరెడ్డి

ఈనాడు, దిల్లీ: పోలవరం నిధులను నాబార్డుతో ముడిపెట్టకుండా నేరుగా బడ్జెట్‌ నుంచే విడుదల చేసేలా నిబంధనలు మార్చాలని కాంగ్రెస్‌ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. నాబార్డుతో ముడిపెట్టడంవల్లే రాష్ట్రానికి సకాలంలో నిధులు అందట్లేదని ఆరోపించారు. ఆయన గురువారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు జల్‌శక్తి మంత్రిత్వశాఖను నోడల్‌ ఏజెన్సీగా పెట్టినా, వాళ్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వం రూ.5వేల కోట్లు ఖర్చుపెట్టినా, గతంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణ వల్ల అది నిలిచిపోయిందన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.