close
అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఒప్పందం

ఫిబ్రవరిలో నివేదిక
పేదలు, సామాన్యులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యం
ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి
ఈనాడు - అమరావతి

ఒప్పందం ప్రకారం.. తహసీల్దార్‌ కార్యాలయం, మున్సిపల్‌ ప్రణాళిక విభాగాలు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ ప్రభుత్వ  విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై ఐఐఎం బృందం అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులతో నివేదిక ఇస్తుంది.

కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో అవినీతి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులు చేసేందుకు అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం-ఎ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఐఐఎం-అహ్మదాబాద్‌లో ప్రజా విధానాల గ్రూప్‌ ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏసీబీ చీఫ్‌ కుమార్‌ విశ్వజిత్‌ దీనిపై సంతకాలు చేశారు. సీఎం మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల్ని ఇతర ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించడం, అవినీతికి ఆస్కారం లేకుండా వాటిని తీర్చిదిద్దడంపై సూచనలు ఇవ్వాలన్నారు.సిఫారసులు చేయడంతో పాటు, వాటి అమల్లోనూ భాగస్వాములు కావాలని ఐఐఎం బృందాన్ని కోరారు.

 ఒక్క బటన్‌తో అనుసంధానం
‘‘ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు వివక్షకు, అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా అందరికీ అందుతున్నాయి. గతంలో ఏ పని కావాలన్నా ప్రజలు మండల  కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు ఆస్కారం ఏర్పడింది. అధికార వికేంద్రీకరణ, గ్రామాలకు అందుబాటులో పాలన తీసుకురావడం, ప్రభుత్వ పథకాల్ని నేరుగా లబ్ధిదారుల గడపకే చేర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకువచ్చాం. అవి జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. గతంలో మండల కార్యాలయాల్లో జరిగే పనులన్నింటినీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పూర్తి చేయొచ్చు. తహసీల్దార్‌ కార్యాలయం, కలెక్టరేట్లు, రాష్ట్ర సచివాలయం ఒక్క బటన్‌తో గ్రామ సచివాలయాలతో అనుసంధానవుతాయి. దీనికి ఐటీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ వ్యవస్థనూ పరిశీలించాలని ఆయన ఐఐఎం ప్రతినిధుల్ని కోరారు. వాలంటీర్లు, సచివాలయాల పనితీరుపై గట్టి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ ప్రయత్నాలన్నీ పేదలకు, సామాన్యులకు మంచి చేసేందుకేనన్నారు.

మాకు లభించిన గౌరవం
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం తమ సంస్థకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నామని ప్రొఫెసర్‌ సుందరవల్లి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న
ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి మూడో వారం వరకు అధ్యయనం
ప్రభుత్వానికి, ఐఐఎం అహ్మదాబాద్‌కు మధ్య జరిగిన ఒప్పందంలోని ముఖ్యాంశాలు.
* తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్‌ ప్రణాళిక విభాగాలు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివి ధ ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై ఐఐఎం బృందం ఫిబ్రవరి మూడో వారం వరకు
అధ్యయనం చేసి నివేదిక అందజేస్తుంది.
* కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను మొదటి నుంచీ అవినీతికి దూరంగా ఉంచేందుకు అవసరమైన చర్యలను సూచిస్తుంది.
* ప్రభుత్వ శాఖల్లో నిర్మాణాత్మక మార్పులకు చేపట్టాల్సిన చర్యలు, అవినీతి నిర్మూలన వ్యూహాలపై సిఫారసులు చేస్తుంది.
* పరిపాలనలో ఇప్పుడున్న లోపాల్ని గుర్తించి, సమర్థమైన పాలన అందించేందుకు సూచనలు ఇస్తుంది.
* ఉన్న వనరుల్ని సమర్థంగా వాడుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం, మెరుగైన ఫలితాల్ని రాబట్టడంపై సిఫారసులు అందజేస్తుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.