
మత్స్యకారుల్లో భరోసా నింపా
గొప్ప పనులు చేస్తుంటే నిందలా?
ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం
వెనుకబడిన తరగతులతో ముందడుగు వేయిస్తా
‘మత్స్యకార భరోసా’ సభలో సీఎం జగన్మోహన్రెడ్డి
ఈనాడు, కాకినాడ: అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తికాకముందే ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని కొమానపల్లిలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. ‘రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా బతుకుదెరువుకు œుజరాత్ లాంటి ప్రాంతాలకు వలసలు పోవడం బాధాకరం. ప్రజా సంకల్పయాత్రలో 2018లో ముమ్మిడివరంలో పర్యటించినప్పుడు మత్స్యకారుల బాధలు విని నా గుండె తరుక్కుపోయింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్‌పై రూ.6.03గా ఉన్న రాయితీని 9 రూపాయలు చేశాం. సముద్రంలో వేటకువెళ్లే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే సాయం రూ.10 లక్షలకు పెంచాం. 2012లో జీఎస్పీసీ డ్రిల్లింగ్ జరపడంతో 16వేలకు పైగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. డ్రిల్లింగ్ జరిగిన సమయంలో ఏడు నెలలకు సంబంధించిన పరిహారాన్ని ఎగ్గొట్టారనిని 16 వేల మత్స్యకార కుటుంబాలు ఆరేళ్లు పోరాడాయి. అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. పాదయాత్రలో వారికిచ్చిన హామీ ప్రకారం ఆ మొత్తం రూ.78.24 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. తూ.గో.జిల్లా ఉప్పాడ, శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట, రాళ్లపేట, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పలో ఫిష్‌ల్యాండ్ సెంటర్లు, విజయనగరం జిల్లా సింగపల్లిలో మినీ జెట్టీతోపాటు అవసరమైన ప్రతిచోటా జెట్టీలు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లు నిర్మిస్తాం. కేవలం ఆరు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లో 794 మంది మత్స్యకార సహాయకులను నియమించాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
జలవిహార నియంత్రణ కేంద్రాలకు శంకుస్థాపన: అంతకుముందు ఐ.పోలవరం మండల పరిధిలో పశువుల్లంక నుంచి సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్ వారధిని జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో సింగన్నపల్లి, గండిపోచమ్మ, పేరంటాలపల్లి, రాజమహేంద్రవరం, పోచవరం, విజయవాడ వద్ద హరితబర్మా పార్కు, రుషికొండ, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో రూ.1.62 కోట్లతో ఏర్పాటు చేయనున్న జలవిహార నియంత్రణ కేంద్రాలకు సభా వేదిక నుంచే శంకుస్థాపన చేశారు. 90 రోజుల్లో ఈ పనులు పూర్తి చేస్తామని పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ వివరించారు. కరప మండలంలోని ఉప్పలంక, తాళ్లరేవు మండలం మట్లపాలెంలో నిర్మించనునన ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లకు.. ఎదుర్లంక వద్ద రూ.79.76 కోట్లతో ఫ్లడ్ బ్యాంకు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసిన ధర్మాడి సత్యాన్ని సీఎం సన్మానించారు. సంప్రదాయ మత్స్యకారులను ఎస్సీల్లో చేర్చాలని.. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ముఖ్యమంత్రిని కోరారు. అనంతరం సీఎం యానాంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. ఇటీవల మరణించిన ఆయన తండ్రి సూర్యనారాయణ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణరావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అయిదారు నెలలుగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పరిపాలన ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. మీ జీవితాలను, మీ బిడ్డల జీవితాలను మార్చడానికి అడుగులు ముందుకేస్తున్నా. వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం తెస్తున్నాం. మన పిల్లలు గొప్పగా చదవాలి. ఉద్యోగాల కోసం ప్రపంచంతో పోటీపడాలి. వారు ప్రైవేటు కొలువులకో.. వాచ్మెన్లు, డ్రైవర్ల వంటి ఉద్యోగాలకో పరిమితం కాకూడదు.. ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలి. టై కట్టుకుని పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలి.
ప్రజల కోసం గొప్పగొప్ప పనులు చేస్తున్నా. ఏ చెడూ చేయకపోయినా నిందలు వేస్తున్నారు. ఇలా తప్పుగా మాట్లాడుతున్న నాయకులు, పత్రికాధిపతుల్ని ప్రశ్నించండి. అయ్యా.. మీ పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని గట్టిగా నిలదీయండి. మీకేమో ఇంగ్లీషు మీడియం.. మా పిల్లలకేమో తెలుగు మీడియం అనడం భావ్యమేనా అని అడగండి..
వెనుకబడిన తరగతులు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్‌గా మార్చాలని తాపత్రయపడుతున్నా. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంటే వెనుకబడినవారు కాదు. వాళ్లను ముందుకు తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నా. అలా ఆరాటపడటమే నేను చేసిన తప్పు అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. మీ మంచి కోసం మీ బిడ్డగా చేయదగిన పనులన్నీ చేస్తున్నా. ఎంతమంది శత్రువులు ఏకమైనా, ఎవరెన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడగలుగుతా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉంచండి..
- ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
ముఖ్యాంశాలు
దేవతార్చన

- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే