close
స్టే ఎత్తివేత తగదు

‘నవయుగ’ వ్యాజ్యానికి విచారణార్హత ఉందన్న ధర్మాసనం
అప్పీల్‌కు అనుమతి
తుది విచారణ జరపాలని సింగిల్‌ జడ్జికి సూచన
ఈనాడు - అమరావతి

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు విషయంలో ఏపీ జెన్‌కో.. నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు ఉత్తర్వులను ‘నిలుపుదల చేయడంతో పాటు పీహెచ్‌ఈపీ పనులను మూడో వ్యక్తి(థర్డ్‌ పార్టీ)కి అప్పగించొద్దంటూ’ ఆగస్టు 22న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. స్టే ఎత్తివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది. పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ విషయమై ఏపీజెన్‌కో.. నవయుగ సంస్థ మధ్య జరిగిన ఒప్పందంలో వివాదం తలెత్తితే మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరించాలనే నిబంధన ఉన్నా హైకోర్టును ఆశ్రయించడంపై నిషేధం లేదని పేర్కొంది. ఒప్పందం రద్దు విషయంలో చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.ఒప్పందం రద్దును నిలువరిస్తూ మొదట్లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండేలా ఖరారు చేసింది.  వ్యాజ్యంపై  ‘తుది విచారణ’ జరపాలని సింగిల్‌ జడ్జిని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

తీర్పులోని అంశాలివే..
‘ఒప్పందం రద్దు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మొదట్లో మధ్యంతర ఉత్తర్వులిచ్చిన సింగిల్‌ జడ్జి.. వ్యాజ్యంలోని అంశాలను పరిశీలించి ఆదేశాలు జారీచేశారు. కాని వ్యాజ్యంలోని అంశాల్లోకి వెళ్లకుండా మరో సింగిల్‌ జడ్జి..స్టే ఎత్తివేత ఉత్తర్వులిచ్చినట్లు కనిపిస్తోంది. రెండు అనుబంధ పిటిషన్లలో ఇద్దరు వేర్వేరు జడ్జిలు ఉత్తర్వులు జారీచేశారు. ఒక సింగిల్‌ జడ్జి నవయుగ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత ఉందని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ దృక్పథానికి విరుద్ధంగా మరో సింగిల్‌ జడ్జి వ్యవహరించడానికి వీల్లేదు. స్టేను ఎత్తివేస్తూ సింగిల్‌ జడ్జి అక్టోబర్‌ 31న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.

నేపథ్యమిది..
* 80 మెగావాట్ల సామర్థ్యంతో 12 జల విద్యుత్‌ స్టేషన్ల ఏర్పాటు విషయంలో ఏపీ జెన్‌కో..నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థతో 2017 డిసెంబరులో ఒప్పందం చేసుకుంది
* ఆ ఒప్పందాన్ని ఈ ఏడాది ఆగస్టు 14న ఏపీ జెన్‌కో రద్దు చేసింది. దీంతో నవయుగ హైకోర్టును ఆశ్రయించింది
* ఒప్పందం రద్దు ఉత్తర్వులను ‘నిలుపుదల చేయడంతో పాటు పీహెచ్‌ఈపీ పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దని’ పేర్కొంటూ ఆగస్టు 22న హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు
* ఆ మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏపీ జెన్‌కో స్టే వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో (ఆగస్టు 22 నాటి ఉత్తర్వులపై) స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ అక్టోబర్‌ 31న మరో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారు దీన్ని సవాలు చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది.

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఒప్పందంలో మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరించాలని రాసుకున్నందున నవయుగ సంస్థ దాఖలుచేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని, స్టే ఎత్తివేస్తున్నట్లు సింగిల్‌ జడ్జి చెబుతున్నదాన్ని మేం అంగీకరించలేం.    

   - ధర్మాసనం

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.