close
సైబర్‌ కీచకులు

సాంకేతికత తోడుగా మహిళలపై వేధింపులు
అప్రమత్తతే శ్రీరామరక్ష
ఈనాడు, అమరావతి

ఓ కౌమార బాలికను విశాఖపట్నం యువకుడు ప్రేమ పేరిట ఉచ్చులోకి లాగాడు. కొంత సాన్నిహిత్యం పెరిగాక ఆమె నగ్నదృశ్యాలు పంపించమనేవాడు. వాటిని తన దగ్గర పెట్టుకుని ‘‘మీ అక్క నగ్నచిత్రాలు, రహస్య దృశ్యాలు పంపించు. లేకపోతే నీ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతా’’ అని బెదిరించేవాడు. ఆ బాలిక తన అక్క నగ్నదృశ్యాలను ఫోన్లో రహస్యంగా చిత్రీకరించి అతనికి పంపించింది. వాటిని అడ్డుపెట్టుకుని మరింత రెచ్చిపోయాడు.

బెంగళూరుకు చెందిన ఓ నవజంట హనీమూన్‌కి వెళ్లారు. తమ ఏకాంత దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించుకున్నారు. ఫోన్‌ పాడవటంతో మరమ్మతు కోసం సెల్‌ఫోన్‌ మెకానిక్‌కు ఇచ్చారు. ఆ వీడియోలు తన దగ్గర దాచిపెట్టుకున్న ఆ మెకానిక్‌.. డబ్బులివ్వకపోతే వాటిని పోర్న్‌సైట్లలో పెడతానని బెదిరించేవాడు. ప్రతిసారీ అతనికి డబ్బులివ్వలేక, ఆ వీడియోలు బయటకొస్తే పరువు పోతుందన్న వేదనతో ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
* కొత్త ఫోనా? చూస్తానివ్వు అంటూ ఓ అమ్మాయి ఫోన్‌ను తీసుకున్న స్నేహితుడు అందులో స్పైయాప్‌ ఇన్‌స్టాల్‌ చేశాడు. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడే ప్రతి సంభాషణ, ఏకాంత దృశ్యాలు తన ఫోన్‌ నుంచే పర్యవేక్షించేవాడు. తన వాంఛ తీర్చకపోతే ఆ దృశ్యాలను అంతర్జాలంలో పెడతానని బెదిరింపులకు దిగాడు.
*  మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పేందుకు ఇవి తార్కాణాలు మాత్రమే. ‘‘మహిళలపై సైబర్‌ నేరాలు-తీసుకోవలసిన చర్యలు’’ అంశంపై మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో జరిగిన సదస్సులో సైబర్‌ నేరాలపట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో నిపుణులు వివరించారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అనుమతించొద్దు.

మీ ఫొటోలేవీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయొద్దు.

అసభ్యసందేశాలు పంపిస్తున్న వారి నంబర్లు బ్లాక్‌ చేయాలి.

మీ ఫోన్‌  ఇతరులకు ఇవ్వద్దు

వివాహ పరిచయ వేదిక (మ్యాట్రీమోనీ) సైట్లలో ఉన్న ప్రొఫైల్స్‌ను గుడ్డిగా నమ్మి ఫొటోలు, వివరాలు పంపొద్దు

అప్రమత్తతే రక్ష

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ఆధారంగా బలహీన భావోద్వేగాలున్న వారిని గుర్తించి నేరగాళ్లు ఉచ్చులోకి లాగుతుంటారు. మహిళల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేస్తుంటారు. మహిళల ఫోటోలను నగ్నంగా మార్చే యాప్‌లు,  అశ్లీల వీడియోల్లో నటించినట్లు తయారుచేసే డీప్‌ఫేక్స్‌ బెడద ఎక్కువైంది.

- నల్లమోతు శ్రీధర్‌, సైబర్‌ నిపుణులు

వాటిని క్లిక్‌ చేయొద్దు

మన ఫోన్లకు సందేశాల రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేస్తే ర్యాట్‌లు, స్పైవేర్లను ఫోన్‌లోకి అనుమతించినట్లే. తర్వాత ఫోన్లు హ్యాక్‌ చేసి.. మహిళల ఫొటోలు దొంగిలించి కాల్‌గర్ల్స్‌ వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. బాధితులు 91212 11100కు వాట్సప్‌ ద్వారా సందేశం పంపించినా నిందితులపై చర్యలు తీసుకుంటాం.

- మేరీ ప్రశాంతి, ఎస్పీ, సైబర్‌ నేరాల విభాగం, ఏపీ సీఐడీ

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.