close
భారతీయులపై పాక్‌ ఉగ్ర చర్యలు

విద్రోహ కార్యకలాపాల్లో నిందితులుగా చూపేందుకు విఫలయత్నం
అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసేందుకు కుట్ర
ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తినీ ఇరికించేందుకు ఎత్తుగడ

దిల్లీ: జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద ముఠా నాయకుడు మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస భద్రతా మండలి తీర్మానించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతోంది. ఉగ్రవాద కేసుల్లో భారతీయులను ఇరికించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు చైనా సహకరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి సహా ఇద్దరు వ్యక్తులను ఇలాగే ఉగ్ర ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలను, వాటిని భారత్‌ అడ్డుకున్న తీరును ఓ ఆంగ్ల పత్రిక ప్రస్తావించింది.
ఈ ఏడాది మే 1న మసూద్‌ను భద్రతా మండలిలోని ‘1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ’ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, ఫ్రాన్స్‌ సాయంతో భారత్‌ చేసిన ప్రయత్నాలు ఫలించడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ నేపథ్యంలో భారత్‌కూ ఉగ్రవాద మరకను అంటించేందుకు పాక్‌ కుట్రకు తెరతీసింది. ఇందుకు అఫ్గానిస్థాన్‌ను వేదికగా చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఘర్షణల్లో నలిగిపోయిన అఫ్గాన్‌లో మౌలిక వసతుల పునరుద్ధరణకు భారత్‌కు చెందిన అనేక కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. వీటితో పాటు పలువురు భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. వీరు తమ భూభాగంలో అనేక భారీ ఉగ్రవాద దాడులు చేసినట్లు ప్రపంచాన్ని నమ్మించాలని పాక్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అజోయ్‌ మిస్త్రీ, వేణుమాధవ్‌ దొంగరలను ఇలాగే ఇరికించేందుకు పాక్‌ ప్రయత్నించింది. ఆంక్షల కమిటీలో వీరిపై తెచ్చిన ప్రతిపాదలను అమెరికా అడ్డుకుంది. భారత్‌ వెంటనే వీరిని అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించింది.

చైనాతో కలిసి కుట్ర
గతవారం భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం, తన ప్రియ నేస్తమైన చైనాతో కలిసి పాకిస్థాన్‌.. ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటింపచేసేందుకు ఆంక్షల కమిటీని సంప్రదించింది. వారు తమ బలూచిస్థాన్‌, పెషావర్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అప్పాజీ అంగార కూడా ఉన్నారు. కాబుల్‌లోని ఒక బ్యాంకులో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఆయన పనిచేశారు. జనవరి 18నే ఆయన అఫ్గాన్‌ వీడారు. ఆయన 2017 ఫిబ్రవరి 13న లాహోర్‌లోని మాల్‌ రోడ్‌లో ఉగ్రవాద దాడికి పాల్పడినట్లు పాక్‌ ఆరోపించింది. జమాతుల్‌ అహ్రార్‌ (జేయూఏ) అనే ముఠాతో కలిసి ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొంది. 2014 డిసెంబర్‌ 16న పెషావర్‌లోని సైనిక పాఠశాలపైన, 2016 సెప్టెంబర్‌ 2న అదే నగరంలోని వార్సాక్‌ కాలనీపై దాడుల్లోనూ ఆయన నిందితుడని చెప్పింది.
ఒడిశాకు చెందిన గోబింద పట్నాయక్‌ దుగ్గివలసను ఈ నెల 18న భారత భద్రతా సంస్థలు కాబుల్‌ నుంచి హడావుడిగా వెనక్కి రప్పించాయి. గత ఏడాది జులై 13న బలూచిస్థాన్‌లోని మస్తుంగ్‌లో రాజకీయ నేత సిరాజ్‌ రైసాని సహా 160 మందిని బలితీసుకున్న ఉగ్ర దాడి కేసులో పట్నాయక్‌ను పాక్‌ ఇరికించింది. ఆయన విశాఖపట్నంలో ఎంబీఏ చదివారు. కాబుల్‌లోని ఫీనిక్స్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌లో ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

ప్రశాంత్‌, ధరిలాల్‌ను క్షేమంగా అప్పగించండి
పాక్‌కు భారత్‌ స్పష్టీకరణ

దిల్లీ: పాకిస్థాన్‌ అరెస్టు చేసిన ఇద్దరు భారతీయులకు దౌత్య సేవలు అందుబాటులో ఉంచాలని భారత్‌ గురువారం డిమాండ్‌ చేసింది. ఎలాంటి హాని కలిగించకుండా వారిని తిరిగి తమకు అప్పగించాలని పాక్‌కు స్పష్టంచేసింది.
తెలుగు వ్యక్తి అయిన ప్రశాంత్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన ధరిలాల్‌లు అరెస్టు అయ్యినట్లు పాక్‌ మీడియాలో వచ్చిన వార్తలు భారత్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వారు పొరపాటున సరిహద్దులు దాటి వెళ్లి ఉంటారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. పాక్‌ తన దుష్ప్రచారానికి వీరిద్దరినీ బలిపశువులుగా మార్చబోదని ఆశిస్తున్నట్లు చెప్పారు.

భారత జంటపై జర్మనీ విచారణ

బెర్లిన్‌: జర్మనీలోని కశ్మీర్‌, సిక్కు సంఘాలపై గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక భారతీయ జంటపై ఫ్రాంక్‌ఫర్ట్‌ కోర్టు విచారణ మొదలైంది. వీరిపై అభియోగాలు రుజువైతే 10 ఏళ్ల వరకూ జైలుశిక్ష పడొచ్చు. మన్మోహన్‌, ఆయన భార్య కన్వల్జీత్‌ ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరు జర్మనీలోని కశ్మీర్‌ వేర్పాటువాద ముఠాలు, సిక్కు సంఘాలపై నిఘా వేసి, ఆ సమాచారాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేస్తున్న గూఢచారులకు చేరవేసేవారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.