close
పార్లమెంటు కబుర్లు..

కొవ్వాడలో అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటు ప్రక్రియపై ముందుకే..: కేంద్రం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ వద్ద అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికా సంస్థ వెస్టింగ్‌హౌస్‌ దివాళా ప్రమాదం నుంచి బయటపడిందని, ఇకపై ఈ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతుందని కేంద్ర అణు ఇంధనశాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ వెల్లడించారు. 2008లో భారత్‌-అమెరికాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని గురువారం రాజ్యసభలో అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ముందుకుసాగుతోంది. కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతులు, స్థల పరిశీలన, సాంకేతిక-వాణిజ్య సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయి. ఒక్కోటి 1,208 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు రియాక్టర్లు అక్కడ ఏర్పాటవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పరిపాలన ఆమోదం, ఆర్థిక అనుమతులు తీసుకొని వెస్టింగ్‌హౌస్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలయ్యాయి’’ అని మంత్రి తెలిపారు.

ప్రైవేటు కంపెనీలకు ఆధార్‌ డేటా పంపిణీ జరగలేదు

ఈనాడు, దిల్లీ:  ప్రైవేటు కంపెనీలకు ఆధార్‌ డేటా పంపిణీ జరగలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయమంత్రి సంజయ్‌ధోత్రే తెలిపారు. గురువారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో  ప్రభుత్వ ఈ-ప్రాజెక్టులు చేసే ప్రైవేటు కంపెనీలకు ఆధార్‌ డేటా పంపిణీ జరిగిన మాట వాస్తవమేనా’’ అని ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లేదని సమాధానమిచ్చారు. ఒకవేళ అలా జరిగి ఉంటే, తెలంగాణలో ఆధార్‌ డేటా చౌర్యంపై నమోదైన కేసులకు సంబంధించిన ప్రత్యేకమైన వివరాలు ఏమైనా ఉన్నాయా? అని అడగ్గా ‘పై సమాధానం నేపథ్యంలో ఇది ఉత్పన్నంకాదు’ అని బదులిచ్చారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించిందా? ప్రైవేటు ఏజెన్సీలు ఆధార్‌ డేటాను ఎలా సేకరించాయి, విదేశీ సర్వర్లలో ఎలా నిల్వచేశాయి? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘‘హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ ఐజీ, సిట్‌ ఇన్‌ఛార్జి ఇచ్చిన నివేదిక ప్రకారం యూఐడీఏఐ చేసిన ఫిర్యాదు ఆధారంగా 2019 ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐటీగ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇతరులపై 278/2019 నంబర్‌తో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది’’ అని మంత్రి సమాధానమిచ్చారు.

పీపీఏల సమీక్షలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెదేపా లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు కోరారు. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులపై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
అమరావతి కనిపించకపోవడం ప్రధానిని అవమానించడమే..
కేంద్ర హోం శాఖ ఇటీవల విడుదల చేసిన భారత రాజకీయ మ్యాప్‌లో అమరావతి లేకపోవడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలనే కాకుండా...2015లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రిని అవమానించడమేనని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ అన్నారు. లోక్‌సభ శూన్య గంటలో ఆయన మాట్లాడారు. అదే మ్యాప్‌ ప్రచారంలో ఉంటే..రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతుందన్నారు.
పర్యావరణానికి ప్రాధాన్యమివ్వాలి
ఆర్థిక నష్టాలు, ఇతర సమస్యలను పక్కనపెట్టి పర్యావరణానికే చైనా, జపాన్‌ దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయని..మనమూ ఆ విధానాన్నే అనుసరించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులపై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  ప్రసంగం అనంతరం బాగా మాట్లాడారని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా కృష్ణదేవరాయలును ప్రశంసించారు.

2,068 గ్రామాలకు మొబైల్‌ సేవల్లేవు
టెలికం సర్వీసు ప్రొవైడర్లు, కమ్యూనికేషన్‌ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లోని 2,068 గ్రామాలకు మొబైల్‌ సేవలు లేవని కేంద్రం తెలిపింది. వామపక్ష తీవ్రవాదం నేపథ్యంలో 346 టవర్లు ఏర్పాటుకు అనుమతించినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానమిచ్చారు.

ఏపీలో 67, తెలంగాణలో 79 : ఆంధ్రప్రదేశ్‌ జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లో 67 మంది, తెలంగాణలో 79 మంది న్యాయమూర్తులను భర్తీ చేయాల్సి ఉందని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఏపీలోని జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లో 5,58,144 కేసులు, తెలంగాణలో 5,53,032 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్‌ కమిటీల్లో వైకాపా ఎంపీలు
కేంద్ర మంత్రిత్వశాఖల కన్సల్టేటివ్‌ కమిటీల్లో పలువురు వైకాపా ఎంపీలకు స్థానం దక్కింది. కమిటీలోని సభ్యుల వివరాలు

ఆదివాసీలకు న్యాయం చేయాలి: ఏపీ రైతు సంఘం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసీలకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండు చేసింది. గురువారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆదివాసీలు చేపట్టిన ధర్నా అనంతరం ఏపీ గిరిజన సంఘం నేత ఎస్‌.దామోదర్‌రావు, సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేశవరావు, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో 3 లక్షల మంది ఆదివాసీలు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. గిరిజన రైతులకు పెట్టుబడిసాయం, పంటరుణాలు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. బాక్సైట్‌, యురేనియం తవ్వకాలు ఆపాలని, పోలవరం, వెలిగొండ, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని కోరారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.