close
మళ్లీ భూమి శిస్తు!

యాజమాన్య హక్కుకు భరోసానిచ్చేందుకే..
సీఎంతో చర్చించాక నిర్ణయం
ఉపముఖ్యమంత్రి  పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: భూమి శిస్తు వసూలుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదిస్తోంది. భూములపై యాజమాన్య హక్కుకు భరోసానిచ్చేందుకు ఇది అవసరమని అభిప్రాయపడుతోంది. శుక్రవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ అధికారుల భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. ఎన్టీఆర్‌ హయాంలో రద్దయిన భూమి శిస్తు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి రసీదు (ఎకరాకు రూ.50లోపు) ఇస్తే రైతుల్లో యాజమాన్య హక్కుపై ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దీన్ని ఆదాయవనరుగా చూడటం లేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి నివేదించి ఆయన ఆమోదించాక భూరికార్డుల స్వచ్ఛీకరణ అనంతరం శిస్తు వసూలుకు చర్యలు తీసుకుందామని వివరించారు. వచ్చే ఏడాది మే నెలాఖరుకు రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రతి ఏడాది ఈ-జమాబందీ నిర్వహించాలన్న ప్రతిపాదనను సమావేశంలో అంగీకరించారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాక వీఆర్వోలపై ఎమ్మార్వోలకు నియంత్రణ లేకపోవడాన్ని పలువురు అధికారులు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సమక్షంలో విధివిధానాలు ఖరారైనందున అమలు చేయాల్సిందేనని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌, ఇతర సిబ్బందిపై జిల్లా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఉన్న అధికారాలను ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు బదలాయించాలని సమావేశం సందర్భంగా ఉపముఖ్యమంత్రి సూచించారు. జిల్లా కలెక్టరుకు సహకరించేందుకు డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఒకరిని నియమించాలని, జేసీ-2కు రెవెన్యూ బాధ్యతల్లో కొన్నింటిని అప్పగించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సిద్ధార్థజైన్‌ సూచించారు. బీసీ, ఇతర ధ్రువీకరణ పత్రాల మంజూరు బాధ్యతలను డిప్యూటీ తహశీల్దారుకు అప్పగిస్తే బాగుంటుందని కొందరు అధికారులు సూచించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చేసినా తహశీల్దార్ల నుంచి ఫిర్యాదులు రావడం లేదని సీసీఎల్‌ఏ కార్యదర్శి చక్రవర్తి పేర్కొన్నారు. పెండింగులో ఉన్న 617 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తే ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, భూపరిపాలన శాఖ ఉన్నతాధికారులు విజయసునీత, వెట్రిసెల్వి, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాల సంయుక్త కలెక్టర్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.