close
వీవోఏల పదవీ కాలం మూడేళ్లే

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
కొత్త నియామకాలకు  మార్గదర్శకాలు జారీ
భగ్గుమన్న వీవోఏలు
మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు బైఠాయింపులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వెలుగు పథకంలో పనిచేస్తూ మూడేళ్లు సర్వీసు దాటిన వివోఏల స్థానంలో కొత్త వారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీవోఏల నియామకం, అర్హతలు, అనర్హతలు, కాలపరిమితి, పని విధానం, గౌరవ వేతనం చెల్లింపుపై విధి విధానాలు స్పష్టం చేస్తూ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఇకపై వారి పదవీ కాలం మూడేళ్లేనని.. అనంతరం గ్రామ సమాఖ్య మరొకరిని నియమించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 27వేల వీవోఏల పదవీకాలం ముగిసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో యానిమేటర్లు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. తక్షణం సర్క్యులర్‌ ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉత్తర్వును ఉపసంహరించుకుంటామని, ఏ ఒక్కరినీ తొలగించబోమని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతపురంలో మంత్రి తానేటి వనితకు వినతిపత్రం ఇచ్చారు. మంత్రి పుష్పశ్రీవాణి, ఉపసభాపతి కోన రఘుపతి, రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేసినట్లు వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు.

‘పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్‌ రూ.10 వేలు వేతనం చెల్లిస్తామని మాట ఇచ్చారు. ఈ జీవో కోసం ఎదురుచూస్తున్న వివోఏలకు ఉద్యోగమే ఊడిందన్న సర్క్యులర్‌ జారీచేసి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది’ అని ఏపీ వెలుగు వివోఏ(యానిమేటర్లు)ల ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వైకాపా శ్రేణులను సంతృప్తి పరచడానికే తొలగింపు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఏ ఒక్కరినీ తొలగించబోమని కేబినెట్‌లో ప్రకటించి..ఇలా చేయడం దారుణం’ అని మండిపడ్డారు.
నియామకాలకు మార్గదర్శకాలివే...

గ్రామ సంఘ సహాయకురాలి(వీవోఏ) కాలపరిమితి మూడేళ్లు మాత్రమే. ఆ తర్వాత తప్పనిసరిగా కొత్త వారిని నియమించాలి.

* ప్రతి ఏటా వీవోఏల పనితీరును గ్రామ సంఘ మహాసభ సమావేశంలో సమీక్షించాలి. మెరుగ్గా ఉంటే ఉద్యోగ కాలపరిమితిని పొడిగించవచ్చు. సరిగా లేకపోతే విధుల నుంచి తొలగించాలి. పనితీరు ఆధారంగా గౌరవ వేతనం నిర్ణయించాలి.
* 18నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి కనీసం పదో తరగతి చదివి ఉండాలి.
* వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి..సంఘంలో అర్హత కలిగిన సభ్యురాలు లేకుంటే వారి పిల్లలను నియమించవచ్చు.
* ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాలకు చెందిన వారు ఉండకూడదు.
* ఈ మేరకు సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి విధి విధానాలు వివరించి కొత్త వారిని ఎన్నుకునే ప్రక్రియ గ్రామస్థాయిలో అధికారులు ప్రారంభించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.