close
ఐదేళ్లలో రాష్ట్రానికి  రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు

పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల్లో అవకాశం
ఎన్‌ఎండీసీ నుంచి కడప  స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం
సీఎం, అధికారులతో సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకొస్తున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలు, సహజవాయువు, ఉక్కు రంగాల్లో రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నట్లు చెప్పారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టులు, కాకినాడలో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు, కడపలో ఉక్కు కర్మాగారం ద్వారా ఈ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ఉక్కు శాఖ అధికారులు, చమురు కంపెనీలు, వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. సీఎం మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ పరిశ్రమకు నిరంతరంగా ఇనుప ఖనిజం సరఫరా అవసరమని వివరించారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ద్వారా ఖనిజం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి దీనికి సానుకూలంగా స్పందించారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఏపీ ప్రభుత్వంతో ఎన్‌ఎండీసీ త్వరలో ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ఉక్కు శాఖ అధికారులను ఆదేశించారు.

అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీ
విభజన చట్టం ప్రకారం ముడిచమురు రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను కాకినాడలో వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని ఏపీ ప్రభుత్వ అధికారులు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేసేందుకు పెట్రోలియం శాఖ అధికారులు, ఏపీ అధికారులతో సంయుక్తంగా అత్యున్నత కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి సమాధానమిచ్చారు. కాకినాడ, రాజమండ్రిలో పెట్రోలియం ఎక్సలెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలి
చమురు, గ్యాస్‌ వెలికితీస్తున్న కంపెనీలు చెల్లించే రాయల్టీలో రాష్ట్రానికి కూడా వాటా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర మంత్రిని కోరింది. ఆఫ్‌షోర్‌లో ఆయా నిక్షేపాల వెలికితీతతో సమీప ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం ఉంటోందని, తీరప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ ప్లాంట్ల వల్ల కూడా పర్యావరణ ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ప్రజలు, మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులొస్తున్నాయని వివరించారు. చమురు, గ్యాస్‌ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్లుగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్‌ఆర్‌ నిధులొచ్చేలా చూస్తామని మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం బైరవపాలెంలో జీఎస్‌పీసీ లిమిటెడ్‌ నిర్వహించిన ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు రూ.81 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉందని, వాటిని మంజూరు చేయాలని ప్రభుత్వం కోరింది. వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు.

సహకరించేందుకు సిద్ధం: జగన్‌
పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ తెలిపారు. పైపులైన్లు వేయడంలో సమస్యలు, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించినందుకు ఏపీ ప్రభుత్వానికి ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్‌ ఛైర్మన్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి బినోయ్‌రాయ్‌, పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి అమర్‌నాథ్‌, సీఎండీలు ఎన్‌.బైజేంద్రకుమార్‌ (ఎన్‌ఎండీసీ), అశుతోష్‌ కర్ణాటక్‌ (గెయిల్‌), శశిశంకర్‌ (ఓఎన్జీసీ), ముఖేశ్‌కుమార్‌ సురానా (హెచ్‌పీసీఎల్‌), పి.కె.రథ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌, కేంద్ర మంత్రి ప్రధాన్‌ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపైనా వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.