close
మెరిట్‌ లిస్ట్‌ ఎక్కడ?

కొలిక్కిరాని కసరత్తు.. సచివాలయాల ఉద్యోగార్థుల్లో ఆందోళన
నేడు ప్రకటించే అవకాశం
పత్రాల పరిశీలనానంతరం అక్కడికక్కడే నియామక ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి జిల్లాల వారీగా ప్రతిభావంతుల జాబితా (మెరిట్‌ లిస్ట్‌) తయారీ పని ఆదివారానికీ కొలిక్కి రాలేదు. ముందు ప్రకటించిన ప్రకారమైతే ఈపాటికే జిల్లాల వారీగా జాబితాలను ప్రకటించి, అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవ్వాలి. మార్కులు, ర్యాంకుల వివరాలు జిల్లాలకు సకాలంలో వెళ్లినా శనివారం సాయంత్రం వరకు అత్యధిక జిల్లాల్లో బయటకు రాలేదు. పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాక కొంత కదలిక వచ్చింది. మార్కులు, రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ప్రతిభావంతుల జాబితా తయారు చేసే ప్రక్రియ అత్యధిక జిల్లాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జాబితాల్లో పేర్లున్న వారంతా సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసి, అసలైన ధ్రువపత్రాలతో హాజరయ్యేలా జిల్లా యంత్రాంగాలు సోమవారం నేరుగా అభ్యర్థులకు సమాచారాన్ని అందించనున్నాయి. ఈ ప్రక్రియను 3 రోజులపాటు నిర్వహించి, పత్రాల పరిశీలన తర్వాత అక్కడికక్కడే నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

వెబ్‌సైట్‌లో పెట్టాలని అభ్యర్థుల వినతి
ప్రతిభావంతుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో పెట్టాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సమాచారాన్ని అందించి మిగతా వారి వివరాలు బహిర్గతం చేయబోమని కొన్ని జిల్లాల్లో అధికారులు ప్రకటించడంతో ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధానంతో ప్రతిభావంతుల జాబితాలో ఎవరికెన్ని మార్కులొచ్చాయో తెలుసుకోవడం కష్టమని, అవకతవకలు జరిగినట్లుగా అనుమానించాల్సి వస్తుందని హెల్ప్‌లైన్‌కు ఆదివారం కొందరు అభ్యర్థులు ఫోన్లు చేశారు. దీనిపై పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ ఉన్నతాధికారులు సమావేశమై ప్రతిభావంతుల జాబితాలను జిల్లా వెబ్‌సైట్లలో పెట్టే విషయమై చర్చించారు. ప్రతిభావంతుల జాబితాల్లోని అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం మరోసారి ఆదేశాలు జారీ చేశారు. పొరుగు సేవల కింద పనిచేస్తూ పరీక్షలు రాసిన తమకు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు కలపలేదని ఏఎన్‌ఎంలు ఆదివారం పలుచోట్ల ఆందోళనకు దిగారు. అర్హత మార్కుల్లో రిజర్వేషన్‌ అమలు చేయకపోవడంపై మాజీ సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రతిభ ఆధారంగానే ఎంపికయ్యారని నమ్ముతున్నా: అజేయ కల్లం

వినుకొండ, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వచ్చిన వార్తలను నమ్మొద్దని, ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులు ఎంపికయ్యారని తాను నమ్ముతున్నానని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.